US Dollar: ప్రపంచంపై డాలర్ పెత్తనం ముగిసినట్టేనా? ఇక మన రూపాయికి తిరుగులేదా ?
నిన్న మొన్నటి వరకు డాలర్ ముద్దు అన్న దేశాలే ఇప్పుడు డాలర్ వద్దు అంటున్నాయి. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకప్పుడు కింగ్ ఆఫ్ కరెన్సీగా ఉన్న డాలర్ ఇటీవలి కాలంలో బలహీనపడుతోంది. డాలర్‌తో మారక విలువ అన్నదానికి అర్థం లేకుండా పోతోంది.
US Dollar: అమెరికా డాలర్‌పై తిరుగుబాటు మొదలయ్యింది. వందల సంవత్సరాలుగా ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయిస్తున్న డాలర్‌కు రోజులు దగ్గరపడ్డాయి. ఇన్నాళ్లూ విదేశీ మారక ద్రవ్యానికి కేంద్రంగా ఉన్న యూఎస్ డాలర్‌ను అనేక దేశాలు కాదు పొమ్మంటున్నాయి. మా కరెన్సీ ఉండగా ఇక డాలర్‌తో పని ఏంటంటూ డాలర్ రూపంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. అమెరికాతో పాటు అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని భారత్‌తో సహా అనేక దేశాలు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాయి. డాలర్‌పై ఆధారపడటం, రిజర్వ్ కరెన్సీగా నిల్వ ఉంచుకోవడం, మారకద్రవ్యంగా వాడటం ఈ మూడు అంశాల నుంచి డాలర్‌ను తప్పించాలని చాలా దేశాలు కోరుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే డీడాలరైజేషన్‌కు ప్రపంచదేశాలు మొగ్గు చూపుతున్నాయి. డాలర్‌ను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదన్న అభిప్రాయంలో అనేక దేశాలు ఉన్నాయి. భారత్ కూడా అదే దిశగా ఆలోచిస్తోంది. డాలర్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుందా? ప్రత్యామ్నాయంతో ముందుకెళ్లలేమా అన్న ఆలోచనతో డాలర్ వ్యతిరేక వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
ఇన్ని కరెన్సీలు ఉంటే డాలర్ మాత్రమే ఎందుకు ?
ప్రతి దేశానికీ కరెన్సీ ఉన్నా ప్రపంచమంతా కాలర్ ఎగరేసుకుని తిరిగేది మాత్రం అమెరికా డాలర్ మాత్రమే. రెండో ప్రపంచ యుద్ధం వరకు బ్రిటన్ పౌండ్ రారాజుగా ఉండేది. యుద్ధంలో పాల్గొని ఆర్థికంగా నష్టపోయిన బ్రిటన్ అమెరికా నుంచి అప్పులు తెచ్చుకోవాల్సిన స్థితికి దిగజారిపోయింది. అప్పటి నుంచి అమెరికా ఆర్థిక వ్యూహాలతో తమ దేశ కరెన్సీని వరల్డ్ కరెన్సీగా మార్చే ప్రయత్నం మొదలుపెట్టింది. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా డాలర్ శకం మొదలయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ లావాదేవీలు, నగదు నిల్వలు అన్నీ అమెరికా డాలర్‌తోనే జరుగుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు డాలర్ మాత్రమే వెన్నుదన్ను. ఏదేశమైనా అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించాలంటే కచ్చితంగా రిజర్వ్ కరెన్సీని పెట్టుకోవాలి. క్రూడ్ ఆయిల్ అమ్మకాలు, కొనుగోలు కూడా డాలర్లలోనే సాగుతుంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత అమెరికా అనేక కారణాలతో అన్ని దేశాలకు డాలర్ విలువను రుచి చూపించింది. ఇక అప్పటి నుంచి డాలర్ తప్పనిసరిగా మారిపోయింది. ఆర్థిక స్థిరత్వం, అందుబాటులో ఉండటం, గ్లోబర్ మార్కెట్లన్నింటిలో చెల్లుబాటు కావడంతో డాలర్ రిజర్వ్ కరెన్సీగా మారింది. అందుకని ప్రతీదేశం రిజర్వ్ కరెన్సీగా డాలర్లను పెట్టుకుంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది.
డాలర్ ఎందుకు మునుగుతోంది?
నిన్న మొన్నటి వరకు డాలర్ ముద్దు అన్న దేశాలే ఇప్పుడు డాలర్ వద్దు అంటున్నాయి. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకప్పుడు కింగ్ ఆఫ్ కరెన్సీగా ఉన్న డాలర్ ఇటీవలి కాలంలో బలహీనపడుతోంది. డాలర్‌తో మారక విలువ అన్నదానికి అర్థం లేకుండా పోతోంది. ఇతర కరెన్సీలతో ముఖ్యంగా యూరోతో పోల్చితే గడిచిన ఆరు నెలల్లో డాలర్ విలువ పది శాతానికి పడిపోయింది. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే పేరుతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ విచ్చలవిడిగా డాలర్లను ముద్రించడం మొదలు పెట్టింది. చివరకు ఇది తీవ్రమైన ద్రవ్యోల్బణానికి దారితీసి.. డాలర్ విలువనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. మరోవైపు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను విపరీతంగా పెంచినా సరే.. బంగారం ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో పసిడి ధరలు 20 శాతం పెరిగిపోయాయి.
బంగారంపై పెట్టుబడులు పెరగడం, భవిష్యత్తు అవసరాల కోసం బంగారాన్ని కొనిపెట్టికోవడం వంటి సాధారణ కారణాల వల్ల పసిడి ధరలు అమాంతం పెరగలేదు. గోల్డ్ ర్యాలీకి ప్రధాన కారణం.. నిన్న మొన్నటి వరకు డాలర్‌ను రిజర్వ్ కరెన్సీగా పెట్టుకున్న వివిధ దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని చూస్తున్నాయి. అందుకే ఆయాదేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకునేందుకు పుత్తిడిని కొని పెట్టుకుంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు గంపగుత్తగా బంగారాన్ని కొనేస్తున్నాయి. 1950 నుంచి లెక్కలు చూసుకుంటే ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా టన్నుల కొద్దీ బంగారాన్ని కొని రిజర్వ్ చేసుకుంటున్నాయి. ప్రతి నెలా బంగారం డిమాండ్ 33 శాతం పెరిగిందంటే డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బంగారం దూసుకొస్తుందన్న విషయం అర్థమవుతుంది. ఒకప్పుడు నగలు, ఆభరణాల వంటి సంప్రదాయ పెట్టుబడికి కేరాఫ్‌గా ఉండే బంగారం ఇప్పుడు దేశాల సెంట్రల్ బ్యాంకులకు ఇంధనంగా మారింది.
ఆ దేశాలు అందుకే కొంటున్నాయా?
“ప్రతి రోజూ రాత్రి నన్ను నేను ఓ ప్రశ్న వేసుకుంటా. అన్ని దేశాలు ఎందుకని డాలర్‌తోనే వాణిజ్యం చేస్తాయి. ప్రత్యామ్నాయం ఎందుకు ఉండకూడదు..” ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వ చేసిన వ్యాఖ్యలివి. ఆయనే కాదు చాలా దేశాధినేతలు అదే ఆలోచిస్తున్నారు. అమెరికా డాలర్‌ను నెత్తిన పెట్టుకొని మోయడం కంటే.. ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం మంచిది అన్న అభిప్రాయంలో ఉన్నారు. అందుకే అన్ని దేశాలు బంగారంపై పడ్డాయి. ఇటీవలి కాలంలో బంగారాన్ని టన్నులకొద్దీ దాచిపెట్టుకున్న టాప్ 10 దేశాల జాబితాలో రష్యా, చైనా, భారత్, బ్రెజిల్, సౌతాఫ్రికా ఉన్నాయి. డాలర్‌ను ఛాలెంజ్ చేస్తూ అంతర్జాతీయ మారకం కోసం కొత్త కరెన్సీ విధానాన్ని తీసుకురావాలన్న ఆలోచనలో ఈ దేశాలు ఉన్నాయి.
ఈ దేశాలకు డాలర్‌పై ఎందుకంత కోపం ?
ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతూ రావడం ఒక ఎత్తైతే.. అగ్రరాజ్యంగా అమెరికా అనుసరిస్తున్న విధానాలు, ప్రపంచ దేశాలపై విధించే ఆంక్షలు.. డాలర్‌కు క్రమంగా పొగ పెట్టాయని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా 30 శాతం దేశాలు అమెరికా నుంచి ఏదో ఒక రూపంలో ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. వీటిలో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఉన్నాయి. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా యూరోను అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు యూరోపియన్ యూనియన్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. డాలర్‌ను అడ్డంపెట్టుకుని అమెరికా సాగిస్తున్న ఏకఛత్రాధిపత్యానికి గండికొట్టాలని ఈయూ దేశాలు టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాలు ఉంటే ఒకే ఒక్క కరెన్సీపైనే అన్ని దేశాలు ఆధారపడి అంతర్జాతీయ లావాదేవీలు, కొనుగోళ్లు జరపడంపై కూడా క్రమేపీ ఆసక్తి తగ్గుతోంది. దీంతో డాలర్‌తో ఢీకొట్టేందుకు కొన్ని దేశాలు సమాయత్తమవుతున్నాయి.
రష్యా మీద ఆంక్షలే డాలర్ కొంపముంచాయా?
ఉక్రయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచాన్ని రెండుగా చీల్చేసింది. అమెరికా సహా చాలా దేశాలు రష్యాతో ఢీ అంటే ఢీ అంటూ యుక్రెయిన్‌కు అండగా నిలిచాయి. రష్యాను నిలువరించేందుకు, ఆ దేశాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకు అగ్రరాజ్యం ఎన్నో ఆంక్షలు విధించింది. డాలర్ కేంద్రంగా నడిచే అంతర్జాతీయ పేమెంట్ వ్యవస్థకు రష్యాను దూరం చేసింది. ఇతర దేశాలతో అమ్మకాలు కొనుగోళ్లు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. తమకు అనుకూలంగా లేని దేశంపై అమెరికా ఆంక్షలు విధించడం అన్నది కొత్త విషయమేమీ కాదు. ఆప్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, వెనిజులా.. ఇలా అనేక చిన్న దేశాలపై అమెరికా చాలా సందర్భాల్లో ఆంక్షలు విధించింది. అయితే రష్యా విషయంలో మాత్రం అమెరికా, దాని మిత్ర దేశాల లెక్క తప్పింది.
వాస్తవానికి రష్యా అమెరికా విధించిన చాలా ఆంక్షలను పట్టించుకోలేదు. ఎన్ని ఆంక్షలు విధించినా యుక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించింది. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. అయితే 300 బిలియన్ డాలర్ల విలువైన రష్యా ఫారెన్ ఎక్సేంజ్ రిజర్వులను అమెరికా ఫ్రీజ్ చేయడం రష్యా ఆగ్రహానికి కారణమైంది. రష్యా వద్ద ఉన్న మారక నిల్వల్లో సగానికి పైగా నిల్వలను స్తంభింపచేయడంతో చివరకు అది డాలర్‌కు అడ్డం తిరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూక్లియర్ వ్యవస్థ ఉన్న దేశం.. పైగా జీ 20 సభ్య దేశానికి సంబంధించిన రిజర్వ్ కరెన్సీని స్తంభింపచేయడం డాలర్ వ్యతిరేక వ్యూహాలకు మరింత పదును పెట్టేలా చేసింది. ప్రపంచదేశాలను కట్టడి చేసేందుకు అమెరికా డాలర్‌ను ఒక ఆయుధంగా ప్రయోగిస్తుందని తెలుసుకున్న వివిధ దేశాలు పద్దతి ప్రకారం డాలర్‌కు చెక్ పెట్టడం మొదలు పెట్టాయి.
డాలర్‌కు వ్యతిరేకంగా యూరో.. యువాన్.. రూపాయి
అమెరికా ఆర్థిక విధానాలు, ఆంక్షలపై గుర్రుగా ఉన్న దేశాలు కొన్ని నెలలుగా డాలర్ రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి. లోకల్ కరెన్సీలోనే అంతర్జాతీయ లాదేవీలకు అనుమతిస్తున్నాయి. డాలర్ కంటే బలమైన కరెన్సీగా నిలబడేందుకు యూరో ప్రయత్నిస్తుంటే.. డాలర్‌ను తొక్కేసేందుకు యువాన్‌ను ప్రమోట్ చేస్తోంది చైనా. యుక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్ కూడా రూపాయితో అంతర్జాతీయ లావాదేవీలు మొదలుపెట్టింది. రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా మొత్తం 19 దేశాలు భారత్‌తో రూపాయితోనే వర్తక వాణిజ్యాన్ని నిర్వహిస్తున్నాయి.
నిజంగానే డాలర్ చాపచుట్టేస్తుందా ?
డీ డాలరైజేషన్ అనేది రాత్రికి రాత్రే జరిగే వ్యవహారం కాదు. అనేక సంవత్సరాలుగా డాలర్ చుట్టూ తిరుగుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా డాలర్ లేకుండా ప్రత్యామ్నాయం వైపు మారడం అనుకున్నంత ఈజీ వ్యవహారం కాదని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాలు తమ కరెన్సీతో అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహిస్తున్నా.. అంతిమంగా డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీ ఏదన్నది మిలయన్ డాలర్ల ప్రశ్నగానే ఉంటుంది. 20 ఏళ్ల క్రితమే యూరోను డాలర్‌కు ప్రత్యామ్నాయంగా తెరపైకి తెచ్చినా.. అంతర్జాతీయ చెల్లింపుల్లో యూరో ద్వారా జరిగేదే కేవలం 34 శాతం మాత్రమే.
మన రూపాయికి అంత సీనుందా ?
యుద్ధం కారణంగానో లేక ఆంక్షల కారణంగానో తాత్కాలికంగా రష్యా, భారత్ లాంటి రెండు దేశాలు స్థానిక కరెన్సీలో లావాదేవీలు పూర్తి చేసినా.. అది పూర్తి స్థాయిలో డాలర్‌కు ప్రత్యామ్నాయం కాదు. భారత్ సహా చాలా దేశాలు ఇంటర్నేషనల్ ఎక్సేంజ్ కరెన్సీగా తమ కరెన్సీనే ఉండాలని కోరుకుంటున్నాయి. యుక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా భారత్ వ్యూహం కూడా మారింది. అమెరికా అడ్డంకులు సృషించినా రష్యా నుంచి ఇంధనాన్ని తెచ్చుకునే విషయంలో భారత్ వెనుకడుగు వేయలేదు. పైగా సెటిల్‌మెంట్ మొత్తం డాలర్ రహితంగానే జరిగింది. డాలర్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్నా తమ కరెన్సీకి ప్రత్యామ్నాయం లేదని అమెరికా ఇప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంది.
డాలర్ పై నమ్మకం సన్నగిల్లడం, పెరుగుతున్న ఆంక్షలు, డిజిటల్ కరెన్సీ వైపు ప్రపంచం ప్రయాణించడం ఇలా అనేక కారణాలతో డాలర్‌కు ఎప్పటికీ ముప్పు పొంచే ఉంటుంది. అయితే డాలర్ స్థానాన్ని ఏ దేశం ఆక్రమిస్తుందన్నదే ప్రశ్న. అయితే ఒకటి మాత్రం నిజం.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చెప్పినట్టు అమెరికన్ డాలర్ క్రమంగా తన అస్థిత్వానికి దూరమవుతుంది. డాలర్ క్రమంగా విలువ కోల్పోతుందని.. వరల్డ్ స్టాండర్డ్‌గా ఇకపై ఉండే అవకాశాలు ఎంతమాత్రం లేవన్నది ఆయన అభిప్రాయం. 200 ఏళ్ల చరిత్రలో ఇదే తమ అతిపెద్ద ఓటమి అని కూడా ట్రంప్ అంగీకరించారు. దీనిని బట్టే అర్థం చేసుకోవాలి.. డాలర్ రోజులు దగ్గరపడ్డాయని. అయితే డీ డాలరైజేషన్ అన్నది పూర్తి స్థాయిలో ఎప్పటికి జరుగుతుంది? రూపాయి వంటి కరెన్సీలు డాలర్ స్థానాన్ని అసలు ఆక్రమిస్తాయా లేదా అన్నది ప్రపంచ ఆర్థిక పరిణామాలు, దేశాల సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.