Retail Inflation: టమోటా, మిర్చి ఎఫెక్ట్..! ఇంటి ఈఎంఐలు పెరుగుతాయా..?

ఆర్‌బీఐ రిటైల్‌ ద్రవ్యోల్బణం 6శాతానికి మించకూడదని టార్గెట్ పెట్టుకుంది. కానీ ఆ డేంజర్‌లైన్‌ను ఒక్క జంప్‌తో దాటేసింది ఇన్‌ఫ్లేషన్. కాదు అలా దాటేలా చేసింది ఎర్రపండు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నందునే రిజర్వ్‌బ్యాంక్ దాని కట్టడికి వడ్డీరేట్లు పెంచుతూ వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 15, 2023 | 11:11 AMLast Updated on: Aug 15, 2023 | 11:11 AM

Vegetable Price Spike Pushes July Retail Inflation Up To 7 44 Persons

Retail Inflation: టమోటా కొంప ముంచింది. మిర్చి ముంచేసింది. ఈ రెండు కలిపి వంటింటి బడ్జెట్‌నే కాదు.. మీ బ్యాంక్ ఈఐఎంను కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి. వీటి దెబ్బకు త్వరలో మీ ఇంటి ఈఎంఐ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టమోటా, మిర్చికి ఆర్‌బీఐతో సంబంధమేంటి..? ఈ రెండింటికీ బ్యాంకు వడ్డీ ధరలతో లింకేంటి..?
ముంచేసిన రిటైల్ ద్రవ్యోల్బణం
తాజాగా వెల్లడైన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు చూద్దాం. జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.44శాతానికి చేరింది. 15 నెలల్లో ఇదే గరిష్ఠం. జూన్‌లో 4.81శాతంగా ఉండగా, అది జులైలో 7.44శాతానికి చేరింది. అంటే ఏకంగా రెండున్నర శాతానికి పైగా పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో సగం వెయిటేజి కూరగాయలదే. ఇది ఏకంగా 37.34శాతం పెరగడంతోనే పరిస్థితి మొత్తం మారిపోయింది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో టమోటా 1400శాతం పెరిగింది.
వడ్డీ రేట్లు పెంచక తప్పదా..?
ఆర్‌బీఐ రిటైల్‌ ద్రవ్యోల్బణం 6శాతానికి మించకూడదని టార్గెట్ పెట్టుకుంది. కానీ ఆ డేంజర్‌లైన్‌ను ఒక్క జంప్‌తో దాటేసింది ఇన్‌ఫ్లేషన్. కాదు అలా దాటేలా చేసింది ఎర్రపండు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నందునే రిజర్వ్‌బ్యాంక్ దాని కట్టడికి వడ్డీరేట్లు పెంచుతూ వచ్చింది. ఆరుశాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ వేచిచూసే ధోరణి అవలంభించింది. ఇప్పుడు ఏకంగా రిటైల్ ద్రవ్యోల్బణం 7శాతాన్ని దాటేయడంతో మరోసారి వడ్డీరేట్లు పెంచక తప్పదన్న ఆందోళన నెలకొంది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో ఎంతో కొంత వడ్డీరేట్లు తగ్గిస్తారని. ఈఎంఐ భారం కొద్దోగొప్పో తగ్గుతుందని అంతా భావించారు. కానీ ఇలా ద్రవ్యోల్బణం పెరగడంతో దానిపై అనుమానాలు కమ్ముకున్నాయి. కొంతమంది నిపుణులు త్వరలో మరోసారి ఆర్‌బీఐ వడ్డీరేట్లు పెంచుతుందని అంచనా వేస్తున్నారు. 25బేసిస్ పాయింట్ల వడ్డింపు తప్పదని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం వేచిచూసే ధోరణినే కొనసాగించవచ్చని అంటున్నారు. మెజారిటీ మాత్రం ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గడం కష్టమేనంటున్నారు. అంటే మరో ఏడాది ఈఎంఐ భారాన్ని భరించాల్సిందే. గతవారమే రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధానంలో, వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయలేదు. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఈసారి వడ్డీరేట్లు పెంచితే బ్యాంకులు తక్షణమే ఆ భారాన్ని వినియోగదారుడిపై మోపే అవకాశాలున్నాయి.
మరో 2నెలలు..!
రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా పెరుగుతూనే ఉంది. కూరగాయలు, ఆహార ఉత్పత్తుల ధరలు చుక్కల్లోకి చేరాయి. ప్రస్తుతానికి టమోటా కాస్త దిగివచ్చినా మిగిలిన కూరగాయల ధరలు కూడా కాస్త తగ్గాలి. అంటే మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. అంటే మరికొన్నాళ్లు ద్రవ్యోల్బణం అదుపులో ఉండదు. ఆర్‌బీఐ డేంజర్‌లైన్‌కు ఎగువనే ఉండొచ్చు. మరి వచ్చే త్రైమాసిక సమీక్షలో ఆర్‌బీఐ దీన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం గృహరుణ వడ్డీరేట్లు పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇంటి ఈఎంఐలు కడుతున్నవారు బీ ప్రిపేర్. త్వరలో మరోసారి వడ్డీరేట్లు పెరుగుతాయని డిసైడైపోండి.