Gold Prices: బంగారం ధరలు మరింత పెరుగుతాయా.. ధరల పెరుగుదలకు కారణాలేంటి?

దేశంలో బంగారం ధరలు అంచనాలకు మించి పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది బంగారం ధర రూ.8 వేల వరకు ఎక్కువగా ఉంది. అసలు ఎందుకు బంగారం ధరలు ఇంతగా పెరిగిపోతున్నాయి? ఇంకా ధరలు పెరిగే ఛాన్స్ ఉందా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2023 | 12:51 PMLast Updated on: Apr 02, 2023 | 1:36 PM

Will The Prices Of Gold Increase Further What Are The Reasons For The Increase In Prices

Gold Prices: భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. అందులోనూ మహిళలకు బంగారు ఆభరణాలంటే విపరీతమైన ఇష్టం. మగవాళ్లు కూడా కొన్ని బంగారు ఆభరణాలు ధరిస్తారు. బంగారం అలంకరణకే కాకుండా.. అవసరానికి పనికొస్తుందని పెట్టుబడిగానూ భావిస్తారు. బంగారం కొంటే ఎలాంటి నష్టం ఉండదని మనవాళ్ల నమ్మకం. అందుకే బంగారానికి మన దేశంలో విపరీతమైన డిమాండ్. దీంతో బంగారం ధరలు ఎప్పుడూ సామాన్యుడికి అందనంతగా పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వారాల నుంచి బంగారం ధర విపరీతంగా పెరిగిపోతోంది. గత ఏడాది ఇదే సమయంలో.. అంటే గత ఏప్రిల్‌లో రూ.53 వేల వరకే ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ.60 వేలకు చేరింది. ఏడాది కాలంలోనే దాదాపు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు పెరిగింది. గతంలో ఒక ఏడాదిలో బంగారం ధర ఈ స్థాయిలో ఎప్పుడూ పెరగలేదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఇంతకీ బంగారం ధర పెరిగేందుకు కారణాలేంటి?

భారీ డిమాండ్
దేశంలో పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. దీంతో ఈ సీజన్‌లో సహజంగానే బంగారం ధరలు కొంత పెరుగుతాయి. అలాగే ఏ వేడుక జరిగినా బంగారం కొనడం ఆనవాయితీ. అవసరం ఉన్నా.. లేకున్నా.. కొందరు బంగారాన్ని కొనిపెట్టుకుంటారు. అందుకే మన దేశంలో బంగారం ఎక్కువగా అమ్ముడవుతోంది. వ్యక్తిగత అవసరాల కోసం, పెట్టుబడిగానే కాకుండా పారిశ్రామిక అవసరాల కోసం కూడా బంగారాన్ని వాడుతున్నారు. కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో కూడా బంగారాన్ని వినియోగిస్తున్నారు. మన దేశం దిగుమతి చేసుకుంటున్న బంగారంలో 12 శాతం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలోనే వాడుతున్నారు.

దిగుమతులపైనే ఆధారం.. అదే కారణం
మన అవసరాలకు తగినంతగా దేశంలో బంగారం ఉత్పత్తి కావడం లేదు. ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా బంగారం ధర ఎక్కువగా ఉంటుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి కాబట్టి అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా కూడా ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం బంగారం ధర పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఇతర వస్తువుల ధరలు పెరిగినట్లే బంగారం ధర కూడా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం సమయంలో వివిధ దేశాల కరెన్సీ విలువ తగ్గుతుంది. స్టాక్ మార్కెట్లు నష్టపోతుంటాయి. దీంతో ఎక్కువ మంది సురక్షితమైన పెట్టుబడి అని, లాభదాయకంగా ఉంటుందని బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

ఈ కారణంగా అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ ఏర్పడి, ధరలు భారీగా పెరుగుతాయి. యుక్రెయిన్-రష్యా యుద్ధం, అమెరికా, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో బ్యాంకులు దివాళా తీయడం, వివిధ దేశాల్లో సంక్షోభాలు, తిరుగుబాట్లు వంటి పరిణామాలు కూడా బంగారం ధరల్ని పెంచేస్తాయి. అమెరికా డాలర్ పతనం మరో కారణంగా చెప్పొచ్చు. అంతర్జాతీయంగా ఎక్కువగా వినియోగించే కరెన్సీ డాలర్. దీని విలువ తగ్గినప్పుడల్లా బంగారం ధర పెరుగుతుంది. పైగా బంగారం కొనుగోలుకు డాలర్‌నే ఎక్కువగా వినియోగిస్తారు. ఇటీవలి కాలంలో అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యాంకు తీసుకుంటున్న కారణాల వల్ల డాలర్ విలువ మారుతోంది. దీంతో బంగారం ధర కూడా పెరుగుతోంది.

Gold Prices

విదేశాల్లోనూ డిమాండ్

గతంలో భారత దేశంలో మాత్రమే బంగారానికి డిమాండ్ ఉండేది. ఇప్పుడు విదేశీయులు సైతం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకన్నా.. బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక దేశాలు బంగారం నిల్వల్ని పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బ్యాంకుల్లో బంగారు నిల్వల్ని పెంచుతున్నాయి. కరెన్సీ విలువ తగ్గొచ్చు కానీ.. బంగారం విలువ తగ్గదనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాయి. ప్రభుత్వాలు బంగారాన్ని భారీ స్థాయిలో కొనుగోలు చేయడం వల్ల కూడా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. మన దేశంలో కూడా బ్యాంకులు, వివిధ సంస్థలు బంగారంపై భారీగా రుణాలిస్తున్నాయి. తక్కువ వడ్డీకే రుణాలిస్తుండటంతో ఎక్కువ మంది బంగారం తాకట్టుపెట్టి తమ ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నారు. దీనివల్ల బ్యాంకుల వద్ద బంగారు నిల్వలు పెరుగుతున్నాయి.

మరింత పెరిగే ఛాన్స్
బంగారం ధరల పెరుగుదల మరింతకాలం కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. అంతర్జాతీయ పరిణామాలే ఇందుకు కారణం. రష్యా-యుక్రెయిన్ యుద్ధం కొనసాగినంతకాలం బంగారం ధరలో స్థిరత్వం ఉండదు. ఇతర దేశాల్లో సంక్షోభం, యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం వంటివి కూడా బంగారం పెరిగేందుకు కారణాలు. ప్రస్తుత అంచనా ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర రూ.62 వేలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. అయినప్పటికీ చాలా మంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే బంగారం 12-15 శాతం గ్యారెంటీ లాభాల్ని అందిస్తుండటంతో చాలా మంది దీనిపై పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.