Indian Billionaires: ఈ మహిళా పారిశ్రామికవేత్తల సంపదెంతో తెలుసా..?
భారత్‌లో అత్యంత ధనవంతులు ఎవరు అంటే టక్కున అంబానీ, అదాని అని చెప్పేస్తాం.. మరి అత్యంత ధనిక మహిళ ఎవరు అని అడిగితే ఎంతమంది సమాధానం చెప్పగలరు..? బిలియనీర్లు అయినా మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరో మీకు తెలుసా..?
భారత్‌లో ధనవంతులైన మహిళా పారిశ్రామికవేత్తల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. వారి పేరిట ఉన్న ఆస్తులు, షేర్లు అన్నింటినీ లెక్కగట్టి విలువను తేల్చింది ఫోర్బ్స్. ఆ జాబితా ప్రకారం దేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ సావిత్రీ జిందాల్. ఆమె ఆస్తి 17.5బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే లక్షా 43వేల కోట్ల రూపాయలకు పైమాటే అన్నమాట.
దేశంలోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుల్లో ఒకటైన జిందాల్‌గ్రూప్‌కు ఈవిడ మాజీ ఛైర్‌పర్సన్. రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా ఉన్నారు సావిత్రీ జిందాల్. హర్యానా మంత్రిగా పనిచేసారు. ఇక రెండోస్థానంలో ఉన్న కరోడ్‌పతి రోహికా సైరస్ మిస్త్రీ.. ఆమె ఆస్తి విలువ 7బిలియన్ డాలర్లు. అంటే 57వేల 288 కోట్ల రూపాయలు. ఇటీవల కారు ప్రమాదంలో చనిపోయిన సైరస్ మిస్త్రీ భార్య ఈమె. టాటాసన్స్‌లో మిస్త్రీలకు 18.4శాతం వాటా ఉంది. సైరస్‌మిస్త్రీ గతంలో టాటాగ్రూప్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. భర్త మరణంతో ఆయన పేరిట ఉన్న ఆస్తులనీ ఈమెకే వచ్చాయి. ఇక మూడో స్థానంలో రేఖా జుంజున్‌వాలా ఉన్నారు. ఆమె ఆస్తి విలువ కాస్త అటూ ఇటుగా 42వేల కోట్ల రూపాయలు. బిగ్‌బుల్ రాకేష్ జుంజున్‌వాలా భార్య రేఖ.
దేశీయ స్టాక్‌మార్కెట్ల గురించి కాస్తో కూస్తో తెలిసిన వారెవరికైనా రాకేష్ జుంజున్‌వాలా గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆయన పేరిట ఉన్న షేర్లన్నీ రేఖా జుంజున్‌వాలా పేరిట బదిలీ అయ్యాయి. టైటాన్, స్టార్‌హెల్త్, టాటామోటర్స్, క్రిసిల్ సహా 29కంపెనీల్లో ఆమెకు వాటాలున్నాయి. ఆమెకు నెలకు 650కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.
ఇక నాలుగోస్థానంలో ఉన్నారు వినోద్‌రాయ్ గుప్తా ( రూ.33వేల కోట్లు). ఈమె గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ ఉత్పత్తిదారుల్లో ఒకటైన హావెల్స్ ఇండియా సహవ్యవస్థాపకురాలు ఆమె. ఈ కంపెనీని ఆమె భర్త కిమత్‌రాయ్‌గుప్తా 1958లో స్థాపించారు. ఇక లీనాతివారీ ఫార్మా జెయింట్ యూఎస్‌వీ ఇండియా ఛైర్‌పర్సన్. ఈమె ఆస్తి విలువ రూ.28వేల కోట్లు. మీడియాకు దూరంగా ఉంటారు. అందువల్ల ఈమె గురించి పెద్దగా తెలియదు. కార్డో వాస్క్యులర్, షుగర్ మందులు తయారుచేసే ఐదు దేశీయ దిగ్గజాల్లో యూఎస్‌వీ ఇండియా ఒకటి. గోద్రెజ్ ఫ్యామిలీలో మూడోతరం వారసురాలు స్మితా క్రిష్ణ ( ఆస్తి రూ.23వేలకోట్లు). నైకా సీఈఓ ఫల్గుణి నాయర్ రూ.21 వేల కోట్ల సంపద కలిగి ఉన్నారు. రెండేళ్ల క్రితం ఐపీఓతో ఆమె సంచలనం సృష్టించారు. ఏపీఎల్ అపోలోట్యూబ్స్ కోఫౌండర్ సరోజ్ రాణి గుప్తా, థర్మాక్స్ సీఈఓ అను ఆగా, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ట్రాక్టర్ తయారీ కంపెనీ టఫే సీఈఓ మల్లికా శ్రీనివాసన్, బయోకాన్ కిరణ్ మజుందార్‌షా కూడా వేలకోట్లతో ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
మహిళలు బిజినెస్ ఉమెన్‌గా రాణించలేరన్న అపవాదును ఈ బిలియనీర్లు కొట్టిపారేస్తున్నారు. కృషి ఉంటే సాధించలేనిది ఏమీ లేదంటున్నారు. వీరిలో కొందరు తమ భర్త అడుగుజాడల్లో నడుస్తున్నారు. వారి తర్వాత కంపెనీ బాధ్యతలను తీసుకుని సమర్ధంగా దూసుకెళుతున్నారు.