EMIs Costly: ఎండలు మండుతున్నాయ్… మీ హోంలోన్ ఈఎంఐ పెరుగుతుంది జాగ్రత్త…!
అవును నిజంగానే ఎండలు మండిపోతున్నాయ్... మధ్యాహ్నం రోడ్డుమీదకొస్తే మాడు పగిలిపోతోంది.. ఎండల సంగతి సరే మరి ఎండలకు ఈఐఎంకు లింకేంటి అంటారా...? ఉంది... ఎండలు మండితే ఈఎంఐ పెరగడం గ్యారెంటీ.!
అవును నిజంగానే ఎండలు మండిపోతున్నాయ్… మధ్యాహ్నం రోడ్డుమీదకొస్తే మాడు పగిలిపోతోంది.. ఇప్పుడే ఇలా ఉంటే ఇక సూర్యారావు మిగిలిన మూడు నెలలు ఏ స్థాయిలో రెచ్చిపోతాడో అన్న టెన్షన్ మొదలైంది. ఎండల సంగతి సరే మరి ఎండలకు ఈఐఎంకు లింకేంటి అంటారా…? ఉంది… ఎండలు మండితే ఈఎంఐ పెరగడం గ్యారెంటీ..!
ఈసారి ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొట్టాయి. గత 122 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఫిబ్రవరి వేడిగా ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత మండే అవకాశం ఉందని… గతంలో ఎన్నడూ లేని స్థాయిలో మంట పుట్టిస్తుందన్న అంచనాలున్నాయి. ఈ ఎండలే ఆర్‌బీఐని వడ్డీరేట్లు పెంచే దిశగా ఒత్తిడి తెస్తున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నడూ లేని ఎండల కారణంగా గోధుమ ఉత్పత్తి తగ్గనుంది. గోధుమ ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న పంజాబ్‌లో 4-5 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగింది. ఫలితంగా దాదాపు 5మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గనుంది. దీంతో ధరలు పెరగనున్నాయి. గోధుమల ధరలు రీటైల్ ద్రవ్యోల్భణంలో పదోవంతును ప్రభావితం చేస్తాయి. మార్చి తర్వాత ఎండలు పెరిగినా దాని ప్రభావం పెద్దగా ఉండేది కాదు. కానీ ఫిబ్రవరిలో ఎండలే గోధుమను దెబ్బతీశాయి.
ఏప్రిల్‌లో ఆర్‌బీఐ మరోసారి సమావేశం కాబోతోంది. వడ్డీరేట్లు మరో 25బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది. ఫలితంగా కొత్త, ప్రస్తుత గృహరుణ వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఆరున్నర శాతం వడ్డీతో గృహరుణం తీసుకున్న వారు ఇప్పుడు దాదాపు 9శాతం వడ్డీ కడుతున్నారు. ఆర్‌బీఐ రెపోరేటు పెంచితే మరోసారి ఈఎంఐ భారం భరించక తప్పదు.
ఇటీవల వడ్డీరేట్ల పెంపు సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్లలో కొందరు పెంపును వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు గోధుమల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దానికి తోడు కూరగాయల ధరలు ఆకాశంలో ఉన్నాయి. అవి సాధారణ స్థితికి రావడానికి మరో 2నెలలు పడుతుందంటున్నారు. అంటే ఏప్రిల్ నాటికి ఆర్‌బీఐ అంచనాలకు మించి ఇన్‌ఫ్లేషన్ ఉండే అవకాశం ఉంది. అంటే వడ్డీరేట్ల పెంపునకు అందరూ ఓకే అనక తప్పని పరిస్థితి. మొత్తానికి ఇప్పటిదాకా ఆర్‌బీఐ వడ్డీరేట్ల పేరుతో బాదేస్తే ఇప్పుడు నా పేరు చెప్పి ఇంకొంచెం పెంచుకోమంటున్నాడు సూరీడు.. ఎవరు ఎలా బాదినా మధ్య తరగతి మానవులు భరించక తప్పదు..!
(KK)