Odisha Train Accident: పదేళ్లలో రెండున్నర లక్షల మందికిపైగా మృతి.. దేశంలో రైలు ప్రమాదాలపై నివేదిక ఇది!
దేశంలో పదేళ్లలో రైలు ప్రమాదాల వల్ల 2.6 లక్షల మంది మరణించారు. గడిచిన పదేళ్లలో రైల్వే సంబంధిత కారణాలు/ప్రమాదాల వల్ల సగటున 2.6 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, వీటిలో ఎక్కువ శాతం మరణాలకు రైళ్లు ఢీకొనడం లేదా పట్టాలు తప్పడం కారణం కాదు.
Odisha Train Accident: ఇటీవల ఒడిశా రైళ్ల ప్రమాద ఘటనలో 275 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఇది దేశంలోనే అత్యంత పెద్ద ప్రమాద ఘటనల్లో ఒకటి. ఈ నేపథ్యంలో దేశంలో రైళ్ల భద్రత, రైలు ప్రమాదాలు, మరణాల అంశం చర్చకు వస్తోంది. అసహజ మరణాలు, నేరాలు, ప్రమాదాల వల్ల కలిగే మరణాలపై డాటా సెకరించే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం.. దేశంలో పదేళ్లలో రైలు ప్రమాదాల వల్ల 2.6 లక్షల మంది మరణించారు.
గడిచిన పదేళ్లలో రైల్వే సంబంధిత కారణాలు/ప్రమాదాల వల్ల సగటున 2.6 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, వీటిలో ఎక్కువ శాతం మరణాలకు రైళ్లు ఢీకొనడం లేదా పట్టాలు తప్పడం కారణం కాదు. ప్రయాణిస్తున్న రైళ్ల నుంచి పడిపోవడం, పట్టాలపై వ్యక్తులను రైలు ఢీకొనడం, రైళ్ల కింద పడి ఆత్మహత్య చేసుకోవడం వంటి కారణాలతోనే అత్యధికంగా మరణిస్తున్నారు. 2017-21 మధ్య కాలంలో, రైల్వే సంబంధ మరణాల్లో ఈ ప్రమాదాల వాటా 70 శాతంపైగా ఉంది. ఎన్సీఆర్బీ రైల్వే ప్రమాదాల్ని ఐదు కేటగిరీలుగా విభజించింది. రైలు పట్టాలు తప్పడం, ఢీకొనడం, పేలుళ్లు లేదా అగ్ని ప్రమాదాలు, ట్రాకుపై ఉన్న వాళ్లను ఢీకొనడం, ఇతర కారణాలుగా విభజించింది.
పట్టాలపై ఉన్న వారిని ప్రమాదవశాత్తు ఢీకొనడం లేదా రైళ్ల కింద పడి ఆత్మహత్యలు చేసుకునే వారి శాతం ఎక్కువగానే ఉంది. 2011లో 25,872 మంది, 2012లో 27,000 మంది, 2013లో 27,765 మంది, 2014లో 25,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, 2017 నుంచి వీటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2020లో కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో రైలు సర్వీసులు ఆగిపోవడంతో ఈ మరణాల సంఖ్య మరింత తగ్గింది. వీటితోపాటు రైళ్ల నుంచి పడిపోవడం, ఇతర్ ప్రమాదాల వల్ల కూడా భారీ సంఖ్యలోనే మరణించారు. వీటిలో రైలు ఢీకొనడం వల్ల మరణించిన వారి సంఖ్య చాలా తక్కువ.