Hyderabad: రాంగ్ డయల్.. ఆమెకి 45.. అతనికి 25.. కథ విషాదాంతం!
ఓ మహిళ చేసిన రాంగ్ డయల్ రెండు జీవితాల్ని చిదిమేసి.. రెండు కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసిందంటే నమ్ముతారా? హైదరాబాద్ శివార్లలో జరిగిన రాజేష్ హత్య కేసులో ఇలాంటి ఎన్నో ట్విస్టులు బయటకు వస్తున్నాయి.
Hyderabad: పొరపాటున ఒకరికి కాల్ చేయబోయి.. మరొకరికి రాంగ్ డయల్ చేయడం కామన్.. తర్వాత సారీ అంటూ ఫోన్ పెట్టేస్తాం..! కానీ ఓ మహిళ చేసిన రాంగ్ డయల్ రెండు జీవితాల్ని చిదిమేసి.. రెండు కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసిందంటే నమ్ముతారా? హైదరాబాద్ శివార్లలో జరిగిన రాజేష్ హత్య కేసులో ఇలాంటి ఎన్నో ట్విస్టులు బయటకు వస్తున్నాయి.
హయత్‌నగర్ దగ్గరలో జరిగిన రాజేశ్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. అతని హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగించారు. అయితే అంతలోనే షాకింగ్ న్యూస్ తెలిసింది. రాజేశ్‌తో వివాహతర సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న మహిళ కూడా ప్రాణాలతో లేదని తెలిసింది. అంతే కాదు.. ఆమె మరణంపైనా ఎన్నో అనుమానాలు. కానీ ఆ సంబంధమే ఇద్దరి ప్రాణాలు తీసింది. చనిపోయిన విధానం వేరయినా.. కారణం మాత్రం ఒక్కటేనని చివరకు తేలింది. హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్ సమీపంలో రాజేష్ అనే యువకుడి హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. పెద్ద అంబర్‌పేట్ నుంచి నాగోల్ వెళ్లే రోడ్డులో కుంట్లూర్ వద్ద రోడ్డు పక్కన విపరీతమైన దుర్వాసన వస్తుండడాన్ని కొందరు గమనించారు. పక్కనే ఉన్న ప్రహరీ వద్దకు వెళ్లి చూడగా పూర్తిగా పాడైన స్థితిలో ఉన్న డెడ్‌బాడీ కనిపించింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే ప్లేస్‌లో దొరికిన సేల్ ఫోన్‌లో డీటేల్స్ చూస్తే ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన రాజేశ్‌గా గుర్తించారు. ఈ నెల 26న రాజేష్ హత్య జరిగినట్టు భావించారు పోలీసులు. రాజేష్ ఎలా చనిపోయాడు? చంపింది ఎవరు? లేదంటే ఆత్మహత్య చేసుకున్నాడా? మరేమైనా జరిగిందా? ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్వెస్టిగేషన్ టీమ్ క్లూస్ కోసం అన్వేషణ సాగిస్తుండగా.. కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చాయి.
పంచోత్కులపల్లికి చెందిన రాజేష్ ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేశాడు. అప్పట్నుంచి ఖాళీగానే ఉంటున్నాడు. ఈనెల 20న హైదరాబాద్‌కు వచ్చిన రాజేశ్.. ఫ్రెండ్ సాయి ప్రకాశ్‌తోపాటే ఉన్నాడు. 22న మధ్యాహ్నం కాలేజీకి వెళ్తున్నట్లు చెప్పి బయటకు వచ్చాడు. తర్వాత రోజు సాయి ప్రకాశ్‌కు ఫోన్‌చేసి సొంతూరు వెళ్తానని ఛార్జీలకు డబ్బులు కావాలని అడగడంతో 300 ఫోన్‌పే చేశాడు. అదే రోజు రాజేష్ హిమాయత్‌నగర్‌లో ఉంటున్న దగ్గరి బంధువు వద్దకు వెళ్లి కలిశాడు. 24న మరో స్నేహితుడికి కాల్‌చేసి డబ్బులు కావాలని అడిగాడు. తర్వాత 25, 26 తేదీల్లో స్నేహితులు చాలాసార్లు కాల్ చేసినా రాజేష్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. 27న మళ్లీ కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అక్కడ ‘సీన్ కట్ చేస్తే.. హయత్‌నగర్ సమీపంలో దొరికిన డెడ్‌బాడీ రాజేశ్‌దేనని తేలింది. ఇంతకీ రాజేశ్ ఎలా చనిపోయాడు? ఇంటికి వెళ్తానన్నవాడు.. ఇక్కడికి ఎందుకు వచ్చాడు..? ఏం జరిగింది..? దీనికి కారణం ఏంటి..? అన్న విషయాలు తెలియాలంటే సుజాత టీచర్ గురించి చెప్పాలి.
స్కూల్ టీచర్.. అయినా..
దేవరకొండలోని గవర్నమెంట్ స్కూల్ టీచర్ సుజాత. హయత్‌నగర్ ఏరియాలో ఉంటోంది. ఆమె వయసు 45 ఏళ్లు. ఇక్కడ ఉంటున్న సుజాతకు.. ఎక్కడో ములుగు జిల్లాకు చెందిన రాజేశ్‌కు అసలు పరిచయం ఎలా అయింది? అన్నది తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఏడు నెలల క్రితం సుజాత ఫోన్ నుంచి రాజేశ్‌కు కాల్ వచ్చింది. అయితే అది పొరపాటుగా జరిగింది. కానీ మాటలు కలిశాయి. రాంగ్ డయల్ వారిని దగ్గర చేసిందన్నమాట. వ్యవహారం వాట్సాప్‌కు మారింది. సుజాత డీపీ చూసి ఆమెకు పెళ్లి కాలేదనుకున్నాడు రాజేశ్. వెంటనే ప్రేమలో పడిపోయాడు. సుజాతను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. సుజాత దేవరకొండలోనే ఉండేది. ఆదివారాలు, సెలవుల్లో హయత్‌నగర్ వచ్చివెళ్లేది. అలా కొన్నిసార్లు దేవరకొండలోని సుజాత దగ్గరకు వెళ్లాడు రాజేశ్. కొన్ని నెలల తర్వాత సుజాతకు పెళ్లి అయిన విషయం రాజేశ్‌కు తెలిసింది. దాంతో నన్ను మోసం చేశావంటూ సుజాతపై ఫైర్ అయ్యాడు. అప్పట్నుంచి సుజాతను దూరంగా పెట్టాడు. కలిసి మాట్లాడుకుందాం అంటూ రాజేశ్‌కు పదే పదే మెసేజ్ చేసింది సుజాత. అయితే రాజేశ్ స్పందించలేదు. తనను కలవకపోతే చచ్చిపోతానంటూ సుజాత బెదిరించడం మొదలుపెట్టింది. నువ్వు చనిపోతే నేను కూడా చనిపోతానంటూ సుజాతకు చెప్పాడు రాజేశ్. తర్వాత కొన్నాళ్లకు టీచర్ సుజాతను కలిసేందుకు హయత్‌నగర్ వెళ్లాడు రాజేశ్. అప్పటికే.. అంటే ఈ నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాప్రయత్నం చేసిందామె. వెంటనే సిటీలోని ఓ ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. ఈ సమయంలో సుజాత సెల్‌ఫోన్‌ను ఆమె కూతురు తన దగ్గర పెట్టుకుంది. అదే టైమ్‌లో రాజేశ్ పెడుతున్న మెసేజ్‌లను సుజాత కూతురు చూసింది. తల్లి అక్రమ సంబంధం వ్యవహారం తెలియడంతో ఆమె షాక్ అయింది. వెంటనే విషయం తన తమ్ముడితో చెప్పింది.
హత్యా.. ఆత్మహత్యా..?
ఇటు చూస్తే సుజాత నుంచి రిప్లై రాకపోవడంతో మరోసారి హయత్‌నగర్‌లోని ఆమె ఇంటి దగ్గరకు వెళ్లి మళ్లీ మెసేజ్ చేశాడు రాజేశ్. ఆ మెసేజ్‌ని సుజాత కొడుకు చూశాడు. వెంటనే రాజేశ్‌కు ఫోన్ చేశాడు. ఎక్కడున్నావని అడిగాడు. మీ ఇంటి దగ్గరే ఉన్నానని ఇతడు చెప్పాడు. వెంటనే తన ఫ్రెండ్స్‌ని వెంటబెట్టుకుని రాజేశ్ దగ్గరకు వెళ్లాడు సుజాత కొడుకు. ముగ్గురూ కలిసి రాజేశ్‌ను చితకబాదారు. నీవల్లే మా అమ్మ పురుగుల మందు తాగిందంటూ రాజేశ్‌పై దాడి చేశాడు సుజాత కొడుకు. పురుగుల మందు తాగి సుజాత చావుబతుకుల్లో ఉందన్న విషయం రాజేశ్‌కు అప్పుడే తెలిసింది.
తన వల్లే సుజాత చనిపోబోతోందని తెలుసుకున్న రాజేశ్ కంగారు పడ్డాడో..? కుమిలిపోయాడో..? తర్వాత ఏం జరుగుతందోనని భయపడ్డాడో తెలీదు. తర్వాత అతడు కూడా కూడా ఏదో పురుగుల మందు తాగాడు. సుజాత ఇంటి దగ్గర్లోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి కుప్పకూలిపోయాడు. అక్కడే చనిపోయాడు. అయితే నిర్మానుష్య ప్రాంతంలో అతడు కుప్పకూలిపోవడంతో ఎవరూ చూడలేదు. తర్వాత ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నవారికి అ ప్రాంతం నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చింది. తీరా వెళ్లి చూసేసరికి బాడీ పూర్తిగా పాడైపోయింది. పోలీసులు వచ్చి.. ఇస్వెస్టిగేషన్ చేస్తే అది రాజేష్ డెడ్‌బాడీగా తేలింది. ఈ మొత్తం కథ బయటకు వచ్చింది. మరోవైపు అప్పటికే పురుగుల మందు తాగి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టీచర్ సుజాత కూడా చనిపోయింది.
ఇక్కడ వరకు జరిగినదంతా క్లారిటీ వచ్చేసినా.. రాజేష్ చనిపోవడానికి కారణం ఏంటన్నది ఇప్పుడు తేలాలి. టీచర్ సుజాత కొడుకు.. తన ఫ్రెండ్స్‌తో కలిసి కొట్టడం వల్లే అతడు చనిపోయాడా? లేక పురుగుల మందు తాగడం వల్ల చనిపోయాడా అన్నది తేలాలి. పోలీసులు ఇప్పడు అదే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా చిన్న పొరపాటు, ఆకర్షణ.. రాంగ్ డయల్.. ఇలా ఇద్దరి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం అయ్యాయి. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.