Heartbreaking incident: తన చితి తానే పేర్చుకుని 90 ఏళ్ల వృద్ధుడి ఆత్మాహుతి! గుండెల్ని పిండేసే ఘటన
వృద్ధాప్యం అంతులేని ఘర్షణలకు.. అనేక మానసిక సమస్యలకు నిలయం. కడ వరకు సొంతూరులోనే బతకాలని భావించిన ఈ వృద్ధుడికి ఆ అవకాశం లేదని తెలియడంతో తట్టుకోలేకపోయాడు. ఆత్మాహుతికి పాల్పడ్డాడు.
Heartbreaking incident: గతమంతా కళ్ల ముందు కదలాడింది. పుట్టి పెరిగిన ఊరు.. కని పెంచిన తల్లిదండ్రులను తలచుకున్నాడు. తన కళ్ల ముందు తన చేతి వేళ్లు పట్టుకొని తనకంటే వేగంగా ముందుకు పరుగులు తీసిన కన్నబిడ్డలు గుర్తొచ్చారు. వారంతా అప్పుడే ఇంత పెద్దవారైపోయారా అనిపించింది. తనను వంతులు వారిగా పంచుకునేంత స్థాయికి ఎదిగిపోయారనిపించింది! తన నీడకు తోడుగా.. కంటికిరెప్పలా.. తనతో కలిసి జీవించిన భార్య ఈ లోకాన్ని వీడి ఏళ్లు దాటిపోయాయి..! ఉదయం లేవగానే చుట్టు పక్కల వాళ్ల పలకరింపులు.. ఊరి వారి కల్మషం లేని ప్రేమ తలచుకుంటూ కళ్ల నుంచి నీటి బొట్టుల్లా మొదలైన కన్నీళ్లు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. ఈ ఊరు వదిలి వేరే ఊరిలో.. కూమారుల వద్ద వంతుల జీవితం బతకడం భారమేనని అర్థమైపోయింది..! తన చితిని తానే పేర్చుకున్నాడు..! బాధను దిగమింగుతూ.. చివరిసారిగా కన్నబిడ్డలను, పెంచిన తల్లిదండ్రులను, భార్యను, జీవిత విలువలను నేర్పిన ఊరును తలచుకుంటూ ఆ చితికి నిప్పంటించాడు..అందులోనే తన దేహాం కాలిపోవాలని నిర్ణయించుకున్నాడు. అదే పని చేశాడు. గుండెల్ని పిండేసే ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.
పెద్దల పంచాయితీ నిర్ణయంతో తల్లడిల్లిన కన్నతండ్రి
పొట్లపల్లికి చెందిన మెడబోయిన వెంకటయ్య(90)కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఐదుగురికి పెళ్లిళ్లు అయ్యాయి. కొన్నేళ్ల క్రితమే వెంకటయ్య భార్య కాలం చేసింది. ఇక నలుగురు కుమారులు వ్యవసాయ కూలీలగా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇద్దరు కుమారులు పొట్లపల్లిలో, ఒకరు హుస్నాబాద్‌లో, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్‌పేటలో స్థిరపడ్డారు. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కూడా కుమారులకు పంచేశాడు వెంకటయ్య. తనకు వృద్ధాప్య పింఛన్ వస్తుండడంతో ఆ డబ్బుతోనే జీవిస్తూ తన పెద్దకుమారుడు కనకయ్య ఇంట్లో ఉంటున్నాడు వెంకటయ్య. అయితే ఐదు నెలల క్రితం తండ్రి పోషణ గురించి కుమారుల మధ్య మనస్ఫర్థలు వచ్చాయి. పెద్దమనషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఒక్కొక్కరు ఒక్కో నెల తండ్రిని పోషించాలని ఆ పంచాయితీ పెద్దలు నిర్ణయించారు.
సొంతూరిలోనే తనువు చాలించాలని..
పెద్ద మనుషులు తీసుకున్న నిర్ణయం వెంటయ్యకు నచ్చలేదు. ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరు విడిచి.. తెలియని ఊళ్లో జీవించడం ఈ వయసులో కష్టమనిపించింది. ఒకటా.. రెండా.. 90ఏళ్లు అదే ఊరిలో బతికాడాయన…! పెద్ద కొడుకు వద్ద నెల రోజులు గడిచిపోవడంతో నవాబుపేటలో ఉంటున్న మరో కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ నెల 2న సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికెళ్లారు వెంకటయ్య. అక్కడ బాధనంతా వెళ్లగక్కాడు. రాత్రి అక్కడే నిద్రపోయాడు. ఉదయం లేవగానే నవాబ్‌పేటలోని కొడుకు వద్దకు వెళ్తానని చెప్పి వెళ్లిపోయాడు.
కానీ సొంతూరిని వదిలి వెళ్లడం వెంకటయ్యకు ఇష్టం లేదు. సాయంత్రం వరకు కూడా ఏ కుమారుడి ఇంటికి వెళ్లలేదు. తర్వాతి రోజు మధ్యాహ్నం పొట్లపల్లి ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో ఓ వృద్ధుడి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వృద్ధుడు తమ తండ్రేనని వెంకటయ్య కుమారులు గుర్తించారు. తాటి కమ్మలను ఒక చోట కుప్పగా పేర్చి వాటికి నిప్పంటించి, అందులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. తమతో పాటే.. రోజు తమ ముందే కనిపించే వెంకటయ్య ఇలా చనిపోవడాన్ని వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు.