Treasure Hunt: గుప్త నిధుల వేటలో భారీ నిధి లభ్యం.. అయినా బంగారం మాయం.. అసలేం జరిగింది?
రహస్యంగా గుప్త నిధుల వేట సాగిస్తున్న ఒక ముఠాకు అనుకోకుండా ఒక నిధి దొరికింది. ఆ నిధిని ముఠాలోని ఒక సభ్యుడి దగ్గర దాచారు. తీరా చూస్తే ఇప్పుడా నిధి మాయమైందంటున్నాడా వ్యక్తి. ఏదో అదృశ్య శక్తే ఇదంతా చేసినట్లు చెబుతున్నాడు.
Treasure Hunt: గుట్టుచప్పుడు కాకుండా గుప్త నిధుల కోసం వేట సాగిస్తున్నాయి కొన్ని ముఠాలు. అలాంటి ముఠాల్లో ఒక ముఠాకు ఇటీవల అనుకోకుండా గుప్తనిధి లభ్యమైంది. కిలోల కొద్దీ విలువైన బంగారం, పురాతన విగ్రహాలు లభించాయి. వాటిని ముఠాలోని ఒక సభ్యుడి దగ్గర దాచారు. తర్వాత పంచకుందామనేలోపు ఆ సభ్యుడు షాకిచ్చాడు. తన దగ్గర దాచిన నిధి మొత్తం మాయమైందని చెప్పాడు. ఏదో అదృశ్య శక్తి ఇదంతా చేస్తుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో షాక్ తిన్న ముఠా సభ్యులు అతడ్ని కిడ్నాప్ చేశారు. ఆ నిధి తమకు ఇచ్చేయాలి అని డిమాండ్ చేశారు. ఇంతకీ ఆ నిధి ఏమైంది? నిజంగానే మాయమైందా? అదృశ్య శక్తే ఇదంతా చేస్తోందా?
భద్రాద్రి జిల్లాలో గుప్త నిధుల వేట
తవ్వకాల్లో అప్పుడప్పుడూ గుప్త నిధులు బయటపడుతుంటాయి. వాటిని నిబంధనల ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అందుకే ప్రభుత్వానికి చిక్కకుండా కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి గుప్త నిధుల వేట సాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలో పదహారు మంది వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి గుప్త నిధుల వేట సాగిస్తున్నారు. రోజంతా తమ పని చేసుకుంటూ సాధారణ వ్యక్తల్లాగే గడుపుతూ, రాత్రి పూట మాత్రం గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు.
గుట్టలు, రహస్య ప్రాంతాల్లోకి పలుగు, పార, ఇతర సామగ్రి తీసుకుని వెళ్లి తవ్వకాలు జరుపుతున్నారు. ఇందుకోసం ఈ ముఠాలు వేర్వేరు ప్రదేశాల్ని ఎంచుకుని, వేర్వేరు బృందాలుగా తవ్వకాలు జరిపాయి. ఇలా నాలుగు చోట్ల తవ్వకాలు జరపగా ఒక చోట, గుప్తనిధి లభ్యమైంది. అందులో విలువైన బంగారు ఆభరణాలు, పురాతన విగ్రహాలు ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ నిధిని బయటకు తీయడం అంత సులభమైన విషయం కాదు. అందుకే ఇటుకల వ్యాపారి కొడుకైన ఒక ముఠా సభ్యుడి వద్ద దాచి ఉంచి, తర్వాత వాటాలు పంచుకోవాలి అనుకున్నారు.
షాకిచ్చిన సభ్యుడు
తర్వాత ముఠా సభ్యులు ఆ బంగారం తెచ్చి ఇమ్మని అతడికి చెప్పారు. అయితే, అతడు వారికి షాకిచ్చాడు. ఆ నిధి తన దగ్గర నుంచి మాయమైందని చెప్పాడు. ఆ నిధిలో ఏదో అదృశ్య శక్తి ఉందని, అదే మాయం చేసి ఉండొచ్చని, అసలు ఆ నిధి ఎలా మాయమైందో తెలియదని చెప్పాడు. దీంతో షాక్ తిన్న ముఠా సభ్యులు అతడిని కిడ్నాప్ చేసి, చాతకొండ పరిధిలోని ఒక రహస్య ప్రదేశంలో దాచి ఉంచారు. మరోవైపు తన కొడుకు కనిపించకపోవడంతో, ఆ సభ్యుడి తండ్రి విషయం ఆరా తీయగా కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. దీంతో వారితో చర్చలు జరిపి, కిడ్నాపైన తన కొడుకును రక్షించుకునేందుకు వెళ్లాడు. అతడిని కూడా ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారు. అంతేకాదు.. వారిద్దరిపై తీవ్రంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. తమను వదిలిపెట్టాలని, ఈ విషయంలో ఎలాగైనా న్యాయం చేస్తానని అతడు వారిని కోరాడు. దీంతో వారు దీనికి అంగీకరించారు.
ప్రముఖులతో డీల్.. అయినా అదే అనుమానం
మాయమైన నిధికి సంబంధించి ముఠా సభ్యులకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు అతడు అంగీకరించాడు. ఇప్పటికే రూ.4 లక్షలు ఇచ్చడు. మరో ఆరు లక్షల రూపాయలు ఈ నెల 10న ఇవ్వాల్సి ఉంది. అయితే, కోట్ల రూపాయల విలువైన నిధిని వదిలేసుకుని, రూ.10 లక్షలకే అంగీకరించడంపై ముఠా సభ్యుల మధ్యే విబేధాలు తలెత్తాయి. ఒకరిపై ఇంకొకరికి అనుమానం తలెత్తింది. దీంతో వివాదం ముదిరి, బయటపడింది. ఈ ముఠాలో ఇదే మండలానికి చెందిన ఒక గ్రామ సర్పంచ్, నేర చరిత్ర ఉన్న మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిసింది.
గుట్టుగా సాగుతున్న వ్యవహారం
గుప్త నిధుల తవ్వకాలు జరపడం చట్టప్రకారం నేరం. అందుకే ఈ విషయంలో ముఠా సభ్యులు బయటపడటం లేదు. కిడ్నాప్, డీల్ వ్యవహారం మొత్తాన్ని రహస్యంగా చేపట్టారు. ఈ వ్యవహారం బయటపడితే మొత్తం నిధి ప్రభుత్వానికి చేరుతుంది. అందుకే ఏమీ చేయలేని స్థితిలో సభ్యులున్నారు. భారీ విలువ కలిగిన నిధి విషయంలో ప్రస్తుతానికి పది లక్షల రూపాయలకే డీల్ కుదిరినా.. ఈ వ్యవహారం ఇంకా ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.