Indians: మూడు రోజుల్లో ముగ్గురు భారతీయుల హత్య అసలు లండన్‌లో ఏం జరుగుతోంది ?
లండన్‌లో హైదరాబాద్ స్టూడెంట్‌ను బ్రెజిలియన్ దారుణంగా హత్య చేసిన ఘటన మరవకముందే.. మరో మర్డర్ కలకలం రేపింది. లండన్‌లో మరో భారతీయ సంతతి వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపారు. కేరళలోని పనంపల్లికి చెందిన అరవింద్ శశికుమార్‌ను తనతో పాటు ఫ్లాట్‌లో అద్దెకు ఉండే మరో భారత సంతతి వ్యక్తి దారుణంగా చంపేశాడు.

Kerala Person Murder at London
కేరళకు చెందిన అరవింద్ శశికుమార్.. పదేళ్ల కింద స్టూడెంట్ వీసాపై బ్రిటన్ వెళ్లాడు. లండన్‌లోని కాంబెర్ వెల్ ప్రాంతంలో ఫ్లాట్‌లో అద్దెకు దిగాడు. అతనితో పాటు.. అదే ఫ్లాట్‌లో కొందరు కేరళ వ్యక్తులు కూడా ఉంటున్నారు. రూమ్మేట్స్ సల్మాన్ సలీమ్‌తో.. చిన్న విషయంలో అరవింద్‌కు గొడవ జరిగింది. మాటమాటా పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లింది. కత్తి తీసుకుని అరవింద్‌ను దారుణంగా పొడిచి చంపాడు సల్మాన్.
అరవింద్, సల్మాన్ గొడవ పడుతున్నప్పుడు పక్కనే ఉండి చూసిన మరో ఇద్దరు కేరళ వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సరిగ్గా రెండు రోజుల కింద.. భారతీయ మూలాలున్న మరో వ్యక్తిని కూడా దారుణంగా హత్య చేసి చంపేశారు. ఈ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన యువతి కూడా ఉంది. ఉన్నత చదువుల కోసం లండన్‌లో ఉంటున్న రంగగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతిని బ్రెజిల్‌కు యువకుడు హత్య చేశాడు.
బ్రెజిలియన్ యువతీ యువకులు.. ఇద్దరు భారత సంతతి యువతులపై కత్తులతో దాడి చేశారు. వీరి దాడిలో తేజస్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇలా మూడు రోజుల్లో మూడు హత్యలు జరిగాయ్. ఈ మూడు హత్యల్లోనూ ఒకటే కామన్. అదే కత్తి తీసుకొని దాడి చేయడం. ఇలా భారతీయుల మీద వరుస దాడులు జరగడం.. అక్కడ ఉన్న మనోళ్లను టెన్షన్ పెడుతోంది. ఆస్ట్రేలియా, అమెరికాలోనే భారతీయులపై దాడులు జరిగేవి ఇన్నాళ్లు. ఇప్పుడు లండన్‌లోనూ ఇలాంటి పరిస్థితులే దాపురించడం కొత్త టెన్షన్‌కు కారణం అవుతోంది.