HYDERABAD: ఏసీబీ వలలో చిక్కిన అవినీతి సీఐ.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ..
మర్రిగూడ ఎమ్మార్వో అవినీతి వ్యవహారం చల్లారకముందే.. ఇప్పుడు మరో సీఐ ఏసీబీ వలలో చిక్కాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ సీఐ నరేందర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
HYDERABAD: మంచి ఉద్యోగం.. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత. అలాంటిది కాసులకు కక్కుర్తి పడి.. చేతులు చాస్తున్నారు కొందరు అధికారులు. అడ్డంగా బుక్కై తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మర్రిగూడ ఎమ్మార్వో అవినీతి వ్యవహారం చల్లారకముందే.. ఇప్పుడు మరో సీఐ ఏసీబీ వలలో చిక్కాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ సీఐ నరేందర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
మూడు లక్షల రూపాయలు తీసుకుంటూ.. నరేందర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కొంతకాలంగా నరేందర్‌పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయ్. దీంతో బంజారాహిల్స్ పీఎస్‌తో పాటు నరేందర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు. ఏ పోలీస్‌స్టేషన్‌కు నరేందర్ బాస్‌గా ఉన్నాడో.. అదే పీఎస్‌లో ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కొన్ని కేసుల్లో బాధితులకు వ్యతిరేకంగా నరేందర్ వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆయనపై ఏసీబీ నిఘా పెట్టింది. ఓ కేసు విషయంలో 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు సీఐ నరేందర్. ఆ బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. మూడు లక్షల రూపాయలను సీఐకి అందజేశారు. ఆ తర్వాత ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సీఐ నరేందర్ ఛాంబర్‌తో పాటు.. నరేందర్ ఇంట్లోనూ సోదాలు చేశారు. ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. సీఐ నరేందర్ డీల్ చేసిన కేసులకు సంబంధించి కూడా వివరాలు రాబడుతున్నారు. ఏసీబీకి చెందిన రెండు బృందాలు.. ఒకేసారి బంజారాహిల్స్ సీఐ నరేంద్ర ఇంట్లోతోపాటు.. పోలీస్ స్టేషన్‌లోని అతని ఛాంబర్ లో తనిఖీలు చేశారు. ఓ సివిల్ కేసులో తలదూర్చి.. రూ.3 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పబ్బులు, స్పాలల్లో… నరేందర్ భారీగా వసూళ్లు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏసీబీ దాడుల్లో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం.
బంజారాహిల్స్ పీఎస్‌లో క్యాష్ మిషన్‌తో పాటు ఓ బ్యాగ్‌ను తీసుకెళ్లారు ఏసీబీ అధికారులు. నరేందర్ వ్యవహారం బయటపడడంతో.. సామాన్య జనం భగ్గుమంటున్నారు. జనాల సొమ్ము జీతంగా తీసుకుంటూ.. సమస్య ఉందని పోలీస్ స్టేషన్‌కు వచ్చే అదే జనాల నుంచి డబ్బులు వసూలు చేయడానికి సిగ్గులేదా అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.