AI Scam: డీప్ ఫేక్ స్కాంతో జర జాగ్రత్త.. మరో కొత్త తరహా సైబర్ క్రైం..!
తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న మరో క్రైమ్ డీప్ ఫేక్. ఆడియో, వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా డీప్ ఫేక్ స్కాంకు పాల్పడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా డీప్ ఫేక్ టెక్నాలజీ పని చేస్తుంది. అంటే ఎదుటివాళ్లు నిజమే అని నమ్మగలిగే ఫేక్ టెక్నాలజీ ఇది.
AI Scam: మీకు తెలిసిన వాళ్లెవరైనా వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి కష్టాల్లో ఉన్నాం.. డబ్బు ఇమ్మని అడుగుతున్నారా..? అయితే, ఆ కాల్స్ విషయంలో స్పందించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఎందుకంటే అది ఫేక్ కాల్ అయ్యుండొచ్చు. మీకు కావాల్సిన వారి ముఖ కవళికలు కనిపించేలా, మిమ్మల్ని మోసం చేసే టెక్నాలజీ వాడుతుండొచ్చు. ఇదే ఇప్పుడు కొత్త తరహా సైబర్ క్రైం. దీన్ని డీప్ ఫేక్ స్కాం అంటున్నారు.
సైబర్ క్రైం.. ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటుంది. కొత్త టెక్నాలజీని ఆధారంగా చేసుకుని, అంతకంటే కొత్త పద్ధతిలో మోసానికి పాల్పడుతుంటారు నేరగాళ్లు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న మరో క్రైమ్ డీప్ ఫేక్. ఆడియో, వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా డీప్ ఫేక్ స్కాంకు పాల్పడుతున్నారు. డార్క్ వెబ్ సహా ఇంటర్నెట్ నుంచి వినియోగదారుల ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని సైబర్ కేటుగాళ్లు సేకరిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా డీప్ ఫేక్ టెక్నాలజీ పని చేస్తుంది. అంటే ఎదుటివాళ్లు నిజమే అని నమ్మగలిగే ఫేక్ టెక్నాలజీ ఇది. దీని ఆధారంగా సోషల్ మీడియాలో సేకరించిన ఫొటోలు, వీడియోలను వినియోగించి ఆయా వ్యక్తుల్లాగా టార్గెటెడ్ వ్యక్తులకు సైబర్ నేరగాళ్లు కాల్స్ చేస్తారు.
ఈ కాల్స్ రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు.. వాళ్లు మాట్లాడుతోంది నిజమైన వ్యక్తులతోనే అనిపిస్తుంది. దీంతో వారికి కాల్స్ చేసి రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కాల్స్‌ను డీప్ ఫేక్ కాల్స్ అంటారు. వీటిని అనేక రకాలుగా వాడుతున్నారు. కొందరు వేరేవాళ్లకు వీడియో కాల్ చేసి, తాము ఇబ్బందుల్లో ఉన్నట్లు నమ్మించి ఆర్థిక సాయం అడుగుతున్నారు. ఇంకొందరు న్యూడ్ కాల్స్ చేస్తున్నారు. కాల్ చేసిన వ్యక్తి.. తాము కోరుకున్న వాళ్లే అయ్యుంటారని నమ్మి.. వాళ్ల ట్రాపులో పడుతున్నారు. ఈ సమయంలో ఎదుటివారి న్యూడ్ వీడియోలు రికార్డు చేసి, తిరిగి వారిని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా కొందరు వ్యక్తుల ముఖాలను ఉపయోగించి, ఫేక్ పోర్న్ వీడియోలు కూడా సృష్టిస్తున్నారు. ఇలాంటి కాల్స్ వల్ల బాధితుల తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్నిచోట్ల బాధితులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇటీవల ఒక మహిళ తన భర్త గొంతును డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా రికార్డు చేసింది.
అంటే వాయిస్ సింథసిస్ ఉపయోగించి, తన భర్త మాట్లాడినట్లుగా ఒక కాల్ రికార్డు చేసింది. ఆ కాల్‌లో భర్త తనను వేధిస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. తర్వాత నెమ్మదిగా ఈ విషయం బయటపడింది. కేరళకు చెందిన ఒక వ్యక్తి ఇటీవలే ఇలా డీప్ ఫేక్ కాల్ బారిన పడి రూ.40,000 పోగొట్టుకున్నాడు. డీప్ ఫేక్ టెక్నాలజీని ఇలా అనేక రకాలుగా వాడేస్తూ, మోసాలకు పాల్పడుతున్నారు. దీన్నే కాదు.. టెక్నాలజీని అడ్డుకోవడం సాధ్యం కాదు. కానీ, అప్రమత్తంగా ఉంటే ఇలాంటి నేరాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేసే వాళ్లు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.