Bengaluru Techie: తెలుగు టెక్కీ చనిపోలేదు.. బెంగళూరు చంపేసింది.. మీరు చదివింది నిజమే..!

ఎక్కడో కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగిన భాను రేఖ.. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో బెంగళూరు వెళ్లడం.. కారు అద్దెకు తీసుకుని గార్డెన్ సిటీ అందాలను ఆస్వాదించడం.. ఇంతలోనే తరుముకొచ్చిన వాన.. ఆమె ప్రాణాన్ని హరించడం.. ఇంతకు మించిన విషాదం ఇంకొకటి ఉంటుందా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 23, 2023 | 10:52 AMLast Updated on: May 23, 2023 | 10:52 AM

Bengaluru City Killed Telugu Techie With Negligence

Bengaluru Techie: ఆమె ఇంకా జీవితాన్ని పూర్తిగా చూడలేదు..! బాగా చదువుకుంది. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం తెచ్చుకుంది. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ కెరీర్‌ను ప్రారంభించింది. 22 ఏళ్ల వయసుకే పెద్ద టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా ఉంది. కానీ ఆమె ఏరోజూ ఊహించలేదు.. తనకు ఉపాధినిచ్చి.. తనను టెక్కీగా మార్చిన బెంగళూరు మహానగరమే.. తన చావు కూడా కోరుకుంటుందని..! తను ఏ రోజూ ఊహించలేదు..భారీ వర్షం.. తన పాలిట శాపంగా మారుతుందని. ఎక్కడో కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగిన భాను రేఖ.. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో బెంగళూరు వెళ్లడం.. కారు అద్దెకు తీసుకుని గార్డెన్ సిటీ అందాలను ఆస్వాదించడం.. ఇంతలోనే తరుముకొచ్చిన వాన.. ఆమె ప్రాణాన్ని హరించడం.. ఇంతకు మించిన విషాదం ఇంకొకటి ఉంటుందా..? భారీ వర్షం పడింది.. అండర్ పాస్‌లో కారు చిక్కుకుపోయింది.. స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు.. కానీ ప్రాణాలు దక్కలేదు. ఇవన్నీ చదువుతుంటే మనసు తరుక్కుపోవడం లేదా? ఒక రాష్ట్ర రాజధానిలో విధానసౌధకు సమీపంలో.. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న బెంగళూరులో అండర్ పాస్ కింద వరదలో చిక్కుకుని మహిళ చనిపోవడం ఏంటి..? కొండల్లోనో.. గుట్టల్లోనో.. భారీ వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతే.. ప్రకృతి పగపట్టింది.. ప్రాణాలు తీసుకెళ్లింది అనుకోవచ్చు. కానీ నగరం నడిబొడ్డున, నిత్యం లక్షలాది మంది తిరిగే మార్గంలో మరీ ఇంతటి విషాదమా..?
భానురేఖ చనిపోలేదు.. చంపేశారు..!
అవును నూటికి నూరుపాళ్లు అదే జరిగింది. భానురేఖ చనిపోలేదు. బెంగళూరు మహానగరం చంపేసింది. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద నగరంగా పేరుతెచ్చుకుని, ఎలక్ట్రానిక్ సిటీగా దేశానికి సేవలందిస్తున్న బెంగళూరు అనే మెట్రోపాలిటన్ సిటీ.. 22 ఏళ్ల టెక్కీని తన చేతగానితనంతో చంపేసింది. భారీ వర్షంలో చిక్కుకునేలా చేసి అండర్ పాస్‌ నుంచి కదలలేని పరిస్థితిని కల్పించి, చివరకు ఊపిరి తీసేసింది. ఈ పాపం ముమ్మాటికీ బెంగళూరుదే..
వర్షానికి ప్రాణాలు ఎందుకు పోతున్నాయి?
భారీ వర్షాలు, వరదలు ఏ దేశంలోనైనా సర్వసాధారణం. ఆస్తి,ప్రాణ నష్టాలు కూడా కొన్ని సందర్భాల్లో నివారించలేం. కానీ ఓ మహానగరంలో నగరం నడిబొడ్డున ఓ స్థాయి వర్షానికే కదలలేని స్థితిలో చిక్కుకుపోయి ప్రాణాలు పోగొట్టుకోవడం అంటే.. వర్షాలకు తట్టుకోలేకపోతున్న ఆ నగరానికి ఏమైందో ఆలోచించాలి. బెంగళూరు సిటీ వర్షంలో మునిగి ప్రాణాలు తీయడానికి బాధ్యులెవరో ఆలోచించాలి.
వర్షం అన్నాక పడుతుంది.. నగరం మునగకుండా చూడాలిగా..
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు.. ఇవన్నీ పేరుకే మహానగరాలు. ఒక్కసారి కొన్ని గంటల పాటు వర్షం దంచికొట్టిందంటే వరల్డ్ క్లాస్ సిటీలుగా చెప్పుకుంటున్న ఈ నగరాలు కూడా వణికిపోతాయి. బెంగళూరులో గట్టిగా 5 నుంచి 10 సెం.మీ వర్షం పడితే చాలు డ్రైనేజీ పొంగి ప్రవహించి బెంగళూరు మునిగిపోతుంది. సిలికాన్ సిటీ రోడ్లు కాస్త చెరువులను తలపిస్తాయి. ఏది ఇల్లో.. ఏది చెరువో.. కనిపెట్టలేని దుస్థితి. ప్రపంచంలో ఉన్న టాప్ 30 మెట్రోపాలిటన్ నగరాల్లో బెంగళూరు కూడా ఒకటి కదా. మరి అలాంటి నగరంలో అండర్ పాస్ కింద చిక్కుకుని యువతి చనిపోవడం ఏంటి..? ప్రజల ప్రాణాలు కాపాడలేని నగరాన్ని మనం ఎంత గొప్పగా వర్ణించి ఉపయోగం ఏంటి?

Bengaluru Techie
బెంగళూరుకు ఎందుకింత దుస్థితి పట్టింది ?
గార్డెన్ సిటీ.. సిలిగాన్ సిటీ.. ఎలక్ట్రానిక్ సిటీ… కూల్ వెదర్.. సౌత్ ఇండియాకే ఒక ఐకానిక్ నగరం.. అన్నీ బాగున్నాయి. కానీ బెంగళూరును సర్వనాశనం చేసే అంశాలు కూడా చాలా ఉన్నాయి. బెంగళూరు కేవలం కర్ణాటక రాజధాని మాత్రమే కాదు.. వరల్డ్ క్లాస్ సిటీ. అందుకే అర్బనైజేషన్ విపరీతంగా పెరిగిపోయింది. బెంగళూరు పరిధి విస్తరించే కొద్దీ ఆక్రమణలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. నగర ఎకో సిస్టమ్ ఏ స్థాయిలో దెబ్బతిన్నదంటే.. చెరువులు ఉండాల్సిన చోట భారీ భవంతులు వెలిశాయి. నాలాలు, డంపింగ్ యార్డ్స్ కూడా నివాస స్థలాలుగా మారిపోయాయి. నీరు పల్లమెరుగు అంటారు.. అలా పల్లానికి నీరు పోకుండా ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో బెంగళూరు మహానగరంలో ఉన్న చెరువుల మధ్య ఇంటర్ కనెక్టివిటీ పూర్తిగా పోయింది. అధికారుల అవినీతి పాలకుల నిర్లక్ష్యం కారణంగా బెంగళూరులో ఇబ్బడిముబ్బడిగా నిర్మాణాలు జరిగిపోయాయి. రాజకీయ నాయకుల అండతో రియల్ ఎస్టేట్ రెచ్చిపోయింది. భవిష్యత్తు అవసరాలను, ఇబ్బందులను ఏమాత్రం లెక్కచేయకుండా నిర్మాణానికి అనుకూలంగా లేని ప్రాంతాల్లో కూడా భారీ కట్టడాలు వెలిశాయి. 1999 ప్రాంతాల్లో బెంగళూరు నగరం పచ్చదనంతో కళకళలాడేది. ఆరోజుల్లో బెంగళూరులో అడుగుపెడితే ప్రకృతి పలకరించేది. కానీ ఇవాళ బెంగళూరులో అర్బనైజేషన్ రాపిడ్ గా జరిగిపోయింది. ఎకో సిస్టమ్‌ను కాపాడటానికి కావాల్సిన పచ్చదనం కనుమరుగైపోయింది.
ఒక్క సెం.మీ కురిస్తే వరద మునకే
కర్ణాటక స్టేట్ నాచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ నెల రోజుల క్రితం బెంగళూరు నగర పాలక సంస్థకు ఒక నివేదిక అందించింది. దీని ప్రకారం బెంగళూరు పరిధిలో 226 లొకేషన్స్‌లో కేవలం ఒక్కటంటే ఒక్క సెంటీమీటరు వర్షం కురిసినా ఆ ఏరియాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. వర్షాల పరంగా వీటిని హైపర్ సెన్సిటివ్ లొకేషన్లుగా గుర్తించారు. వాస్తవానికి ఈ ఏరియాలన్నీ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉన్నాయి. ఈ 226 లొకేషన్స్‌లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ప్రమాదాలను ఊహించడం కూడా కష్టమే.
ఈ పరిస్థితికి ఎవరిని నిందించాలి ?
నాలాలు డంపింగ్ యార్డులుగా మారిపోయాయి. భారీ వర్షం కురిస్తే నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో రెసెడెన్షియల్, కమర్షియల్ జోన్స్ వెలిశాయి. నగరాన్ని పరిరక్షించాల్సిన మున్సిపల్ అధికారులు మొద్దునిద్రపోతున్నారు. కనీస మౌలిక సౌకర్యాలను కల్పించాల్సిన బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆ పని ఎప్పుడో మర్చిపోయింది. బెంగళూరు వైభవాన్ని కాపాడాల్సిన పాలకులు అవినీతి పరులకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు కొమ్ముకాస్తున్నారు. దీంతో బెంగళూరు మహానగరం తేలికపాటి వర్షానికి కూడా వణికి పోయే దుస్థితికి చేరుకుంది. అందుకే నగరం నడిబొడ్డున వర్షం నీరు పోయే దారిలేక అండర్ పాస్ కింద చిక్కుకుని భానురేఖ ప్రాణాలు కోల్పోయింది.
ఇంకో భానురేఖను బలికానివ్వకండి
మొన్నటి వరకు బీజేపీ పాలించింది. ఇప్పుడు కాంగ్రెస్ చేతికి అధికారమొచ్చింది. పాలకులు మారినప్పుడల్లా బెంగళూరుపై వరాలు కురిపిస్తూ ఉంటాయి. బెంగళూరు మునిగిపోకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని చెబుతూ ఉంటారు. కానీ వాస్తవంగా అది జరగడం లేదు. అక్రమనిర్మాణాలపై కొరడా ఝులిపించకుండా, నగరం ఎకో సిస్టమ్‌ను కాపాడకుండా ఎన్ని మాటలు చెప్పినా ప్రయోజనం ఉండదు. నగరం ఐటీ హబ్‌గా ఎంత వెలిగిపోయినా వర్షాల కారణంగా చోటుచేసుకునే మరణాలు బెంగళూరు ప్రతిష్టను దెబ్బతీస్తాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు మేలుకోకపోతే మరికొంతమంది ఇలా బలైపోయే ప్రమాదముంది.