Cbi Court: వయసుతో పని లేదు – తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 6, 2023 | 07:27 AMLast Updated on: Feb 13, 2023 | 12:58 PM

Cbi Court

32 ఏళ్ల క్రితం వంద రూపాయలు లంచం కేసులో రామ్‌ నారాయణ్‌ రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగిపై కేసు నమోదైంది. ప్రస్తుతం 82 ఏళ్ల వయస్సులో ఉన్న సదరు రిటైర్డ్ ఉద్యోగికి లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం (ఫిబ్రవరి 2,2023) ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే రూ.15,000ల జరిమానా కూడా విధించింది. ఐతే తన వయసును పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించమని సదరు రిటైర్డ్‌ ఉద్యోగి కోర్టును వేడుకున్నా.. ససేమిరా అంటూ కోర్టు ఆ అభ్యర్ధనను తిరస్కరించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 32 ఏళ్ల క్రితం అదీ.. కేవలం వంద రూపాయల లంచం కేసులో కోర్టు ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. లంచం అనేది చిన్నదైనా పెద్దదైనా చేసిన తప్పుకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు ఆ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి.

ఉత్తర రైల్వేలో లోకో డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయిన రామ్‌కుమార్ తివారీ 1991లో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మెడికల్ సర్టిఫికెట్ కోసం రైల్వే డాక్టర్ రామ్‌నారాయణ్ వర్మ వద్దకు వెళ్లారు. దీంతో రామ్ కుమార్‌కు టెస్టులు చేయించి సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ.150లు సమర్పించుకోవాలని అన్నాడు రామ్‌ నారాయణ్‌. అంత ఇచ్చుకోలేనన్న రామ్ కుమార్ తొలివిడతగా రూ. 50, ఆ తర్వాత రూ. 100 ఇస్తానని రామ్ నారాయణ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బు ఇవ్వడానికి ముందే రామ్ కుమార్‌ సీబీఐకి ఫిర్యాదు చేశారు.

ఆ తర్వాత ఆయన రూ. 100 ఇస్తుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా రామ్ నారాయణ్‌ను పట్టుకుని, కోర్టుకు అప్పగించారు. అలా అప్పటినుంచి విచారణ వాయిదాలు పడుతూ.. పడుతూ.. 32 ఏళ్ల  తరువాత  ఈ ఏడాది ఫిబ్రవరి 2న తీర్పునిచ్చిన కోర్టు రామ్ నారాయణ్‌ వర్మను దోషిగా తేల్చి ఏడాది జైలుశిక్ష విధించింది. దీంతో వర్మ ప్రస్తుతం తన వయసు 82 ఏళ్లని, తన వయసును దృష్టిలో పెట్టుకుని సానుభూతితో శిక్షను తగ్గించాలని కోరారు. పైగా ఈ కేసులో ఇప్పటికే రెండు రోజులు జైలులో గడిపానని కోర్టుకు విన్నవించుకున్నారు. ఐతే కోర్టు ఏడాది జైలుశిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పింది.