Chat GPT: చాట్ జీపీటీ సహాయంతో భారీ స్కామ్.. TSPSC పేపర్ లీకేజ్ కేసులో కొత్త కోణం..
తెలంగాణలో TSPSC పేపర్ లీకేజి ప్రకంపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 40 మందికి పైగా వ్యక్తులను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది.
నిన్నటి వరకూ నిందితులు కేవలం పేపర్లు మాత్రమే అమ్ముకున్నారని అంతా అనుకున్నారు. కానీ AEE/DAO పరీక్షలకు హాజరయ్యే కొందరు అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకొని.. మతకున్న టెక్నికల్ నాలెడ్జ్‌తో ఎగ్జామ్ హాల్‌లో ఉన్న అభ్యర్థులకు ఇన్ఫర్మేషన్ చేరవేసినట్టు సిట్ గుర్తించింది. ఇందుకోసం నిందుతులు చాట్ జీపీటీని ఉపయోగించినట్టు అధికారులు చెప్తున్నారు. ఇలా ఆన్సర్లు చెప్పేందుకు ఒక్కో అభ్యర్థి దగ్గర్నించి లక్షల రూపాయలు తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. క్వశ్చన్ పేపర్స్‌ను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు అనుకుంటున్న కేసులో నిందితులు ఎటక్ట్రానిక్ డివైజ్‌లను కూడా ఉపయోగించారని తెలియడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్.. టీఎస్‌పీఎస్సీ పేపర్స్ వచ్చాక తనకు పరిచయమున్న TSPDCL జూనియర్ అసిస్టెంట్ సురేశ్‌ను దళారిగా మార్చాడు. ఇతను AEE/DAO పేపర్స్‌ను 25 మందికి అమ్మనట్టు అధికారులు గుర్తించారు. అయితే సురేష్ ద్వారా క్వశ్చన్ పేపర్స్ కొన్న రమేష్ కొందరు వ్యక్తులకు ఆ పేపర్స్ అమ్మేశాడు. తమకు కూడా పేపర్స్ కావాలంటూ మరి కొందరు రమేష్‌ను సంప్రదించడంతో చాట్ ఉపయోగించాలని నిందితులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి దగ్గర 20 నుంచి 30 లక్షలు నిందితులు తీసుకున్నట్టు సమాచారం.
ప్లాన్ ప్రకారం అభ్యర్థులు రమేష్ ఇచ్చిన మైక్రోఫోన్ బెల్ట్‌లో పెట్టుకుని ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లారు. అక్కడి ఎగ్జామినర్ సహాయంతో క్వశ్చన్‌పేపర్ ఫొటోలు తీసి రమేష్‌కు పంపారు. ఆ ప్రశ్నలకు చాట్ జీపీటీ సహాయంలో సమాధానాలు వెతికిన రమేష్ మైక్రోఫోన్ ద్వారా అభ్యర్థులకు సమాధానాలు చేరవేశాడు. అయితే ఎలక్ట్రానిక్ డివైజ్‌లు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించిన ఎగ్జామినర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎగ్జామ్ రాసే అభ్యర్థులతో డీల్ మాట్లాడిన డీఈ రమేశ్‌తో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా పరీక్ష రాసిన ప్రశాంత్, నరేష్, మహేశ్, శ్రీనివాస్‌లను అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి క్వశ్చన్ పేపర్స్ కొన్న మరో 20 మంది అభ్యర్థులను కూడా గుర్తించామని పోలీసులు చెప్తున్నారు.