Snake Bite: చిన్నారికి పాము కాటు.. రోడ్డు లేకపోవడంతో పది కిలోమీటర్లు మోసుకెళ్లిన తల్లి.. అయినా దక్కని ప్రాణం
రోడ్లు లేని కారణంగా, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందకుండా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లు ఎందరో. తాజాగా ఏడాదిన్నర వయసున్న ఓ పాప.. పాము కాటుకు గురై, రోడ్డు లేని కారణంగా ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయింది.
Snake Bite: దేశం అభివృద్ధి చెందుతోంది అని ఎంత గొప్పలు చెప్పుకున్నా.. అదెంత అబద్ధమో నిరూపించే ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. భారీ ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలు, రైల్వే లైన్లు.. ఇలా ఎన్ని గొప్ప నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పుకొంటున్నా.. కనీస రహదారులు, తాగు నీళ్లు, విద్యుత్ కూడా లేని ఊళ్లు వేలల్లో ఉన్నాయి.
రోడ్లు లేని కారణంగా, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందకుండా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లు ఎందరో. తాజాగా ఏడాదిన్నర వయసున్న ఓ పాప.. పాము కాటుకు గురై, రోడ్డు లేని కారణంగా ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లా, అతిమరతు కొల్లాయి అనే గ్రామంలో జరిగింది. ఇంటి దగ్గర నిద్రిస్తున్న 18 నెలల చిన్నారి ధనుష్కను పాము కాటు వేసింది. పాప ఏడుపు విని పరిశీలించిన తల్లిదండ్రులకు ఆ పాప పాము కాటుకు గురైందని గుర్తించారు. వెంటనే పాపను అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, సరైన రోడ్డు లేని కారణంగా అంబులెన్స్ ఎక్కువ దూరం వెళ్లలేకపోయింది. దీంతో మార్గమధ్యలోనే పాపను అంబులెన్స్ నుంచి దించేశారు.
ఇంక చేసేదేంలేక ఆ తల్లిదండ్రులు అక్కడి నుంచి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి ఎత్తుకుని, పరుగెత్తుకుంటూ తీసుకెళ్లారు. కానీ, ఇలా నడుచుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఆలస్యమైంది. చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో పాప మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టమ్ అనంతరం తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, సరైన రోడ్డు సౌకర్యం లేని కారణంగానే తమ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని పాప తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. పాప ఉంటున్నది కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ సరైన రోడ్డు సౌకర్యం లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో నడుచుకుంటూనే వెళ్లాల్సిన పరిస్థితి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు.
ఈ ప్రాంతానికి రోడ్డు మార్గం మంజూరైందని, త్వరలోనే రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు. అంటే 76 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఇంకా ఈ ఊరుకు సరైన రోడ్డు సౌకర్యం లేదని ప్రభుత్వం అంగీకరించినట్లైంది. ఇప్పటికీ ఇలాంటి గ్రామాలెన్నో. కనీసం రోడ్లు కూడా వేయలేని ప్రభుత్వాలు.. తామేదో దేశాన్ని అభివృద్ధి చేసేశాం అంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం.