RED SANDAL: కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపిన ఎర్రచందనం స్మగ్లర్లు
ఎర్ర చందనం తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు కానిస్టేబుల్ గణేష్ ప్రయత్నించాడు. దీంతో స్మగ్లర్లు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి, అక్కడినుంచి పరారయ్యారు.
RED SANDAL: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు దారుణానికి పాల్పడ్డారు. స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపారు. ఈ ఘటన సోమవారం రాత్రి కేవీపల్లి మండల పరిధిలోని సుండుపల్లి సరిహద్దు, గొల్లపల్లి చెరువు వద్ద జరిగింది. కేవీపల్లి మండలం చీనేపల్లి వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు కాపు కాశారు.
ఇదే సమయంలో ఎర్ర చందనం తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు కానిస్టేబుల్ గణేష్ ప్రయత్నించాడు. దీంతో స్మగ్లర్లు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి, అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్‌ను పోలీసులు పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. వెంటనే స్పందించిన పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పోలీసులు ఆ ఏరియాను జల్లెడ పట్టారు. అణువణువూ గాలించారు. ప్రమాదానికి కారణమైన నిందితుల్ని పట్టుకున్నారు. ఎర్ర చందనం వాహనంతోపాటు, ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుల్ని పోలీసులు విచారిస్తున్నారు.
ప్రమాదానికి కారణమైన కారు కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉంది. నిందితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. వాహనంలో శేషాచలం అడవుల్లో చెట్లను నరికి దుంగలను తరలిస్తున్నట్లు గుర్తించారు. మరణించిన కానిస్టేబుల్ 2013 బ్యాచ్‌కు చెందినవాడు. 14వ బెటాలియన్ లో పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం గణేష్ డిప్యుటేషన్‌పై యాంటీ స్మగ్లర్ టాస్క్ ఫోర్స్‌కు వచ్చి, విధులు నిర్వర్తిస్తున్నాడు.