Constable Died: బట్టతల వస్తుందేమోననే భయంతో కానిస్టేబుల్ ఆత్మహత్య..!
జుట్టు లేకపోతే ప్రపంచం ఏదో తలకిందులవుతోందని భ్రమపడుతున్నారు. బట్టతల ఆత్మన్యూనతా భావానికే కాదు.. ఆత్మహత్యకు కూడా దారితీస్తోంది. తాజాగా ఒక వ్యక్తి జుట్టు ఊడిపోతుంది అనే కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Constable Died: బట్టతల ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది. యంగ్ ఏజ్‌లోనే చాలా మందికి జుట్టు ఊడిపోతుంది. పైగా మానసిక ఒత్తిడి, పొల్యూషన్ వంటి కారణాలతో చాలా మందికి జుట్టు త్వరగా తెల్లబడుతోంది. బట్టతల కూడా వస్తోంది. దీన్ని లైట్ తీసుకోవాల్సిన యువత.. జుట్టుకు తెగ ప్రాధాన్యం ఇస్తున్నారు. జుట్టు లేకపోతే ప్రపంచం ఏదో తలకిందులవుతోందని భ్రమపడుతున్నారు. బట్టతల ఆత్మన్యూనతా భావానికే కాదు.. ఆత్మహత్యకు కూడా దారితీస్తోంది. తాజాగా ఒక వ్యక్తి జుట్టు ఊడిపోతుంది అనే కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ప్రాణం విలువ తెలియకుండా కొందరు చిన్నచిన్న కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నారు. తమనే నమ్ముకుని ఉన్న కుటంబాలకు తీరని శోకం మిగులుస్తున్నారు. తాజాగా ఒక కానిస్టేబుల్.. జుట్టు ఊడిపోతోంది అన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలో శుక్రవారం జరిగింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లాయగూడ గ్రామానికి చెందిన ఆర్ల బుచ్చయ్య, మణెమ్మల కుమారుడు వినోద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. వినోద్ శుక్రవారం (జూన్ 9) ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం.. బట్టతల వస్తుందేమో అన్న భయమే అని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్ కుమార్ కొంత కాలంగా చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికి ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంటున్నాడు. అనారోగ్యం కారణంగా 20 రోజులుగా డ్యూటీకి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉంటున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంట్లోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, అనారోగ్యంతోనే వినోద్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావించారు. అయితే, తనకున్న చర్మ వ్యాధి కారణంగా.. జుట్టంతా ఊడిపోతుండటంతో వినోద్ తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. తన స్నేహితుల వద్ద ఈ వషయాన్ని పదేపదే ప్రస్తావించేవాడు. ఈ నేపథ్యంలో బట్టతల వస్తుందేమో అన్న కారణంతోనే వినోద్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.