Tomatoes: ప్లాన్ వేసి టమాటాల ట్రక్కు హైజాక్.. పోలీసులకు చిక్కిన జంట..
ఈ నెల 8న టమాటాలతో ట్రక్కులో వెళ్తుండగా హైవేపై దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే ఒక ముఠాకు చెందిన దంపతులు దీన్ని గమనించారు. ఎలాగైనా ఆ టమాటాల్ని కొట్టేయాలని ప్లాన్ చేశారు. తమ ముఠాతో కలిసి తమ ప్లాన్ అమలు చేశారు.
Tomatoes: ఇటీవలి కాలంలో టమాటా దొంగతనాలే ఎక్కువ జరుగుతున్నాయి. వీటికోసం దాడులకు కూడా పాల్పడుతున్నారు. కొన్నిచోట్ల రైతుల్ని కొట్టి మరీ టమాటాలు ఎత్తుకెళ్తున్నారు. తాజాగా టమాటాల ట్రక్కును ఎత్తుకెళ్లిందో జంట. ఈ ఘటన ఈ నెల 8న జరిగింది. కర్ణాటకలోని హిరియూర్‌కు చెందిన మల్లేశ్ అనే రైతు రెండన్నర టన్నుల టమాటాల్ని ట్రక్కులో కోలార్ తరలిస్తున్నాడు. ఈ నెల 8న టమాటాలతో ట్రక్కులో వెళ్తుండగా హైవేపై దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే ఒక ముఠాకు చెందిన దంపతులు దీన్ని గమనించారు. ఎలాగైనా ఆ టమాటాల్ని కొట్టేయాలని ప్లాన్ చేశారు. తమ ముఠాతో కలిసి తమ ప్లాన్ అమలు చేశారు.
తమిళనాడులోని అంబుర్ పరిధిలోని వనియంబాడి దగ్గర హైవేపై ఆ ట్రక్కును ఈ జంట ఒక కారులో ఫాలో అయింది. ఆ ట్రక్కుకు ఎదురుగా వెళ్లి, తమ కారును ఆపారు. ట్రక్కు తమ కారును ఢీకొందని, నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి ట్రక్కు డ్రైవర్, రైతు మల్లేశ్ నిరాకరించారు. చివరకు డబ్బు చెల్లించేందుకు రైతు అంగీకరించాడు. ఆన్‌లైన్‌లో మొబైల్ ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే, అంతటితో సంతృప్తి చెందిన ఆ ముఠా సభ్యులు డ్రైవర్‌ను, రైతును తోసేసి ట్రక్కును తీసుకున్నారు. టమాటాలు ఉన్న ట్రక్కును డ్రైవ్ చేసుకుంటూ తమిళనాడు వైపు వెళ్లిపోయారు. దొంగతనం చేసిన టమాటాల్ని నిందితులు అప్పటికే అమ్మేశారు. ఆ ట్రక్కును బెంగళూరు, పీన్యా మధ్య పార్కింగ్ చేసి, టమాటాలు అమ్మగా వచ్చిన డబ్బులతో తమిళనాడు పారిపోయారు.
ఘటన జరిగిన వెంటనే బాధిత రైతు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. పోలీసులు ఆ వాహనాన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్లి, తాజాగా గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఈ దోపిడీకి కారణమైన జంటను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్ని తమిళనాడు వేలూరుకు చెందిన భాస్కర్ (28), అతడి భార్య సింధూజ (26)గా గుర్తించారు. వీరితోపాటు మిగతా ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు కేజీ రూ.100 నుంచి రూ.200 వరకు పలుకుతున్న నేపథ్యంలో టమాటాల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఇంకా వర్షాలు కురుస్తుండటంతో టమాటా ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలైతే కనిపించడం లేదు.