Delhi Railway Station: వందేభారత్ రైళ్లు సరే.. స్టేషన్లలో వసతులేవి..? ప్రయాణికుల భద్రత పట్టదా..?
మన దేశంలో రైల్వే వ్యవస్థ నిర్లక్ష్యానికి చిరునామాగా మారుతోంది. ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా కనీస వసతులు ఉండటం లేదు. రైల్వే శాఖను ఎంతగా ఆధునీకరిస్తున్నా అత్యవసర సేవలు కూడా అందుబాటులో ఉండటం లేదు. అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ ఢిల్లీలో ప్రాణాలు కోల్పోయింది.
Delhi Railway Station: ఒకే రోజు ఐదు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయంటూ గొప్పలు చెప్పుకొంటున్నాం. విదేశాలకు ధీటుగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నామంటూ మురిసిపోతున్నాం. కానీ, రైల్వే స్టేషన్లలో కనిపించని కనీస సౌకర్యాల గురించి పట్టించుకోవడం మర్చిపోయాం. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రత గాలికొదిలేసిన వైనాన్ని విస్మరించాం. తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఒక మహిళ కరెంటు షాక్‌తో చనిపోయిన ఘటనే దీనికి నిదర్శనం.
మన దేశంలో రైల్వే వ్యవస్థ నిర్లక్ష్యానికి చిరునామాగా మారుతోంది. ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా కనీస వసతులు ఉండటం లేదు. రైల్వే శాఖను ఎంతగా ఆధునీకరిస్తున్నా అత్యవసర సేవలు కూడా అందుబాటులో ఉండటం లేదు. అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ ఢిల్లీలో ప్రాణాలు కోల్పోయింది. ఇది ఎన్నో కరెంట్ షాక్ ఘటనల్లాగే అనిపించినా దీనిలో రైల్వే శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో సాక్షి అహుజా అనే 34 ఏళ్ల మహిళ ఆదివారం కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయింది. సాక్షి తన పిల్లలు, సోదరి కుటుంబంతో కలిసి చండీఘడ్ వెళ్లేందుకు ఆదివారం తెల్లవారుఝామున ఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుకుంది. స్టేషన్ ఎగ్జిట్ వద్ద ఒక నీటి గుంత ఉంది.
వర్షం వల్ల ఆ గుంతలో నీళ్లు చేరాయి. దీంతో ఆ గుంతను తప్పించుకునేందుకు ఆమె పక్కనే ఉన్న ఒక స్తంభాన్ని తాకారు. అక్కడ అప్పటికే విద్యుత్ వైర్లు తెగిపడి ఉన్నాయి. ఈ క్రమంలో విద్యుత్ వైర్ల వల్ల ఆమె కరెంట్ షాక్‌కు గురైంది. సాక్షికి కరెంట్ షాక్ తగలడం దూరం నుంచి చూసిన ఆమె సోదరి, తండ్రి భయంతో కేకలు వేశారు. సాయం కోసం అర్థించారు. చివరకు కరెంట్ షాక్‌తో స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అధికారులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ రావడానికి దాదాపు 40 నిమిషాల సమయం పట్టింది. అప్పటివరకు సాక్షి స్పృహ తప్పి పడిపోయి అలాగే ఉంది. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ఆమె మరణించింది. ఎప్పట్లాగే రైల్వే శాఖ స్పందించి విచారం వ్యక్తం చేసింది. విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ఘటన తర్వాతే అక్కడి విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారంటే అప్పటిదాకా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.
రైల్వేశాఖ తప్పిదాలెన్నో
సాక్షి మృతి ఘటనలో రైల్వే శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఘటన జరిగిన ఢిల్లీ రైల్వే స్టేషన్ అతిపెద్ద స్టేషన్లలో ఒకటి. నిత్యం ఐదు లక్షల మంది ప్రయాణికుల వరకు ఇక్కడి నుంచి వెళ్తుంటారు. ఇంత మంది ప్రయాణికులు తిరిగే స్టేషన్‌లో కనీసం ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా లేదట. ఇక అంబులెన్స్ సంగతి ప్రస్తావించడం కూడా అనవసరం. లక్షల మంది ప్రయాణించే రైల్వే స్టేషన్ వద్ద అత్యవసర చికిత్స కోసం వినియోగించడానికి ఒక్క అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడం, వారి భద్రతను పర్యవేక్షించడం.. అంతా రైల్వే శాఖదే బాధ్యత.
ప్రయాణికుల భద్రత విషయంలో రైల్వే శాఖ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో చెప్పేందుకు సాక్షి మరణం ఒక ఉదాహరణ. గతంలో కూడా ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగిందట. ఈ విషయంలో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని అక్కడి రైల్వే కూలీలు అన్నారు. కాగా, సాక్షి మరణించిన ప్రదేశంలో ఇంకా కొన్ని వైర్లు ప్రమాదకరంగా ఉన్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఇటీవల మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలోనే ఆ శాఖ నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమమ్యాయి. తాజాగా సాక్షి ఘటనతో రైల్వే శాఖ మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే రైల్వే శాఖ స్పందించి ప్రయాణికులు భద్రతపై దృష్టి సారించాలి. వందేభారత్ రైళ్ల పేరుతో సాగుతున్న ప్రచారాన్ని పక్కనబెట్టి, ప్రయాణికుల క్షేమానికి ప్రాధాన్యమివ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.