NAAC అక్రెడిటేషన్ కోసం కేఎల్ యూనివర్శిటీ లంచాలు ? దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సోదాలు, 10 మంది అరెస్టు
NAAC సభ్యులకు కేఎల్ యూనివర్శిటీ యాజమాన్యం లంచాలు ఇచ్చిందా ? NAAC A++ నగదుతో పాటు బంగారం ముట్టజెప్పిందా ? సీబీఐ ఎంత మందిని అరెస్టు చేసింది ?
NAAC సభ్యులకు కేఎల్ యూనివర్శిటీ యాజమాన్యం లంచాలు ఇచ్చిందా ? NAAC A++ నగదుతో పాటు బంగారం ముట్టజెప్పిందా ? సీబీఐ ఎంత మందిని అరెస్టు చేసింది ? ఎఫ్ఐఆర్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ? దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో చిక్కిన నగదు ఎంత ? అడ్మిషన్లు పెంచుకోవడానికి కేఎల్ యూనివర్శిటీ తెరవెనుక బాగోతం నడిపిందా ?
కేఎల్ యూనివర్శిటీ అడ్డంగా బుక్కయింది. NAAC అక్రెడిటేషన్ కోసం లంచాలు ఇచ్చారంటూ…యూనివర్సిటీ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. గుంటూరు జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేఎల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్, వైఎస్ ప్రెసిడెంట్, వైస్ ఛాన్స్ లర్ సహా 10 మందిని అరెస్టు చేసింది. తమ విద్యాసంస్థకు అనుకూలమైన రేటింగ్ ఇచ్చేందుకు…NAAC టీమ్ సభ్యులకు కేఎల్ యూనివర్సిటీ నిర్వాహకులు డబ్బు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. NAAC టీమ్ సభ్యులకు నగదు, బంగారం, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల రూపంలో ఇచ్చినట్లు ఫిర్యాదులు వచ్చాయి.
చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలెం, సంబల్‌పూర్, భోపాల్, బిలాస్‌పూర్, గౌతమ్ బుద్ధ్ నగర్, న్యూఢిల్లీలోని 20 ప్రదేశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ సోదాలు నిర్వహించింది. 37 లక్షల నగదు, 6 ల్యాప్‌టాప్‌లు, ఐఫోన్ ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అధికారులు తెలిపారు. ఎఫ్ఆర్ లో 14 మంది పేర్లను చేర్చింది సీబీఐ. ఏ1 గా ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, ఏ2గా వైస్ ఛాన్సలర్ జీపీ సారథి వర్మ, ఏ3గా వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీన్, ఏ4గా హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఎ. రామకృష్ణ, ఏ5గా NAAC మాజీ డిప్యూటీ అడ్వైజర్ డాక్టర్ ఎల్. మంజునాథ రావు, ఏ6గా బెంగళూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎమ్. హనుమంతప్ప, ఏ7గా NAAC సలహాదారు ఎమ్.ఎస్ శ్యాంసుందర్ పేర్లను చేర్చారు. వీరితో పాటు ఏ8గా న్యాక్ ఇన్‌స్పెక్షన్ కమిటీ ఛైర్మన్, రామచంద్ర చంద్రవంశీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సమరేంద్ర నాథ్ సాహా, ఏ9గా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాజీవ్ సిజారియా, ఏ10గా NAAC కమిటీ సభ్యుడు, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా డీన్ డి. గోపాల్, ఏ11గా జాగ్రన్ లేక్సిటీ యూనివర్సిటీ డీన్ రాజేష్ సింగ్ పవార్, ఏ12గా NAAC కమిటీ సభ్యుడు, బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్, డైరెక్టర్ మానస్ కుమార్ మిశ్రా, ఏ13గా NAAC కమిటీ సభ్యులు, దావణగెరె విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గాయత్రి దేవరాజా, ఏ14గా NAAC కమిటీ సభ్యులు, సంబల్పూర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ బులు మహారాణా పేర్లను చేర్చారు.
నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్…యునివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో పని చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో వసతి సదుపాయాలు, టీచింగ్ సిబ్బంది, ల్యాబ్ ల వంటి అంశాలపై ప్రమాణాలను నిర్ధారిస్తుంది. ఆయా సంస్థల్లో ఉన్న పరిస్థితులను బట్టి…వాటికి రేటింగ్ ఇస్తుంది. A++, A+, A, B++ వంటి ర్యాంకులు ఇస్తుంది. ఇందులో A++ రేటింగ్…టాప్ ప్లేస్ ఉన్న వాటికి ఇస్తుంది నాక్. A++ ర్యాంక్ కింద పరిగణించాలంటే…జాతీయస్థాయి సంస్థల్లో ఉండాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలు, బోధన, బోధనేతర సిబ్బంది, క్లాస్ రూంలు, ల్యాబ్ లు, తరగతి గదులు ఇలా…అన్నింట్లోనూ టాప్ గా ఉండాలి. అలాంటి వాటికి నాక్ A++ ర్యాంకింగ్ ఇస్తుంది. ఈ రేటింగ్ ఇవ్వడం వల్ల… విద్యాసంస్థకు మంచి పేరు వస్తుంది.
విద్యార్థులు ఆ కళాశాలలో చదువుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. NAAC A++ ర్యాంకింగ్ చూసిన తర్వాత ఎక్కడ చదువుకోవాలో విద్యార్థులు డిసైడ్ అవుతారు. కేఎల్ యూనివర్శిటీ యాజమాన్యం…తమ అడ్మిషన్లను పెంచుకోవడానికి అడ్డదారులు తొక్కినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోనేరు లక్ష్మయ్య ఇంజినీరింగ్ ఫౌండేషన్ ను 1980లో గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో స్థాపించారు. 2006లో స్వయం ప్రతిపత్తి పొందింది. 2009లో డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది . యూనివర్శిటీ పేరును ఉపయోగించకూడదని…యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో కోనేరు లక్ష్మయ్య ఎడ్యూకేషన్ ఫౌండేషన్ గా పేరు మార్చారు. 2019లో KL డీమ్డ్ యూనివర్సిటీగా మార్చబడింది.