ముందు ఆప్ఘనిస్తాన్ ను ఓడించండి డకెట్ ను ఆడుకుంటున్న భారత ఫ్యాన్స్

ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ డకెట్ ను భారత క్రికెట్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా డకెట్ ను ట్రోల్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 28, 2025 | 02:15 PMLast Updated on: Feb 28, 2025 | 2:15 PM

England Cricketer Ben Duckett Is Played By Indian Cricket Fans In A Range

ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ డకెట్ ను భారత క్రికెట్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా డకెట్ ను ట్రోల్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలికిన డకెట్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ముందు ఆప్ఘనిస్తాన్ మీద గెలవాలంటూ సెటైర్లు వేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా డూ ఆర్ డై మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఆప్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. ఏకంగా 325 పరుగుల భారీస్కోర్ చేయడమే కాదు ఇంగ్లాండ్ ను నిలువరించి 8 రన్స్ తేడాతో గెలిచింది. ఈ ఓటమితో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. గెలిచే మ్యాచ్ చేజార్చుకున్న ఇంగ్లీష్ టీమ్ పై ఇప్పటికే ఆ దేశ మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇంగ్లాండ్ ను ఆడేసుకుంటున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి అనంతరం ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ డకెట్ పై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల ఇండియాతో జరిగిన వన్డే సిరీస్ లో మూడు వన్డేల్లోనూ ఇంగ్లాండ్ ఓటమి తర్వాత బెన్ డకెట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ పై తాము 3-0 తేడాతో ఓడినా పెద్ద విషయమేమీ కాదన్నాడు. ఇక్కడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వచ్చామంటూ మెగా టోర్నీపైనే తమ ఫోకస్ అంతా ఉందన్నాడు. ఇండియాను ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడించి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఓవరాక్షన్ చేశాడు. .ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంటిదారి పట్టడంతో డకెట్ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు భారత ఫ్యాన్స్…

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టడంతో నెటిజన్లు డకెట్ వ్యాఖ్యలపై ట్రోల్స్ చేస్తున్నారు. ఫైనల్ లో భారత్ ను ఓడిస్తామని చెప్పావుగా.. ఇప్పుడేమైంది అంటూ ఆటపట్టిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టు కేవలం మాటలే మాట్లాడుతుందని.. మైదానంలో విఫలమవుతుందని చాలా మంది నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దూకుడుగా ఆడటం అనే పేరుతో ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలవుతోందని విమర్శిస్తున్నారు. బజ్ బాల్ కాన్సెప్టుతో టెస్టుల్లో హడావుడి చేయడం కాదని, మిగిలిన ఫార్మాట్లలోనూ విజయాలు సాధించాలంటూ పలువురు మాజీలు సూచిస్తున్నారు. కాగా పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు కూడా కోచ్ గా బాధ్యతలు తీసుకున్న బ్రెండన్ మెక్ కల్లమ్ పైనా ఇంగ్లాండ్ మాజీలు మండిపడుతున్నారు. సరైన వ్యూహం లేకుండా మెగాటోర్నీకి సిద్ధమైపోయారంటూ సెటైర్లు వేస్తున్నారు.