Extra Marital Affairs: వివాహేతర సంబంధాలతో నాశనమవుతున్న కుటుంబాలు.. ఎందుకీ తొందరపాటు పనులు?

తొందరపాటు, క్షణికావేశంలో కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్ని తలకిందులు చేస్తున్నాయంటే నమ్ముతారా? అలాంటి జాబితాలో ఇప్పుడు టీచర్‌ సుజాత, రాజేశ్ కథ కూడా చేరింది. ఇద్దరి ప్రాణాలు తీసింది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 31, 2023 | 01:46 PMLast Updated on: May 31, 2023 | 1:46 PM

Extra Marital Affairs Lead To Sad Endings

Extra Marital Affairs: సమాజం ఎటు పోతోంది? ఏమైపోతోంది? లేటు వయసులో ఈ అక్రమ సంబంధాలేమిటి? ఈ ఆకర్షణలేంటి? తొందరపాటు, క్షణికావేశంలో కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్ని తలకిందులు చేస్తున్నాయంటే నమ్ముతారా? అలాంటి జాబితాలో ఇప్పుడు టీచర్‌ సుజాత, రాజేశ్ కథ కూడా చేరింది. ఇద్దరి ప్రాణాలు తీసింది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
రాజేశ్-సుజాత కథ చాలా మందికి కనువిప్పు. ఒకరితో ఒకరికి ఏమాత్రం సంబంధం లేని ఇద్దరిని రాంగ్ డయల్ కలిపింది.

సాధారణంగా ఏదైనా రాంగ్ కాల్ వస్తే ఎక్కువ మంది చేసేది వారికి దూరంగా ఉండటం. మళ్లీ ఆ కాల్స్‌కు స్పందించకుండా ఉండటం చేస్తారు. రాంగ్ కాల్ చేసిన వ్యక్తి తిరిగి మళ్లీ కాల్ చేయకుండా ఉంటారు. కానీ, ఇక్కడ ఇద్దరూ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యారు. కాల్స్, మెసేజెస్ చేసుకునే దాకా వెళ్లింది ఈ రాంగ్ డయల్ రిలేషన్. పోనీ ఇద్దరిదీ యుక్త వయసు.. ఆకర్షణా.. అంటే అదీ కాదు. అతడి వయసు పాతికేళ్లలోపే. చదువు పూర్తి చేసుకున్నాడు. అంతోఇంతో పరిపక్వత ఉండాలి. ఇక ఆమె.. ప్రభుత్వ టీచర్. పైగా వయసు 45.

పెళ్లై, భర్త, పిల్లలు ఉన్నారు. ఇలాంటివాటికి అసలు అవకాశమే ఇవ్వకూడదు. కానీ, విధి విచిత్రమో.. ఏ బలహీనతో.. అతడికి ఆకర్షితురాలైంది. అతడేమో ఆమెను ఇష్టపడ్డాడు. కానీ, ఆమె నేపథ్యం ఏంటో తెలుసుకోలేకపోయాడు. తెలిసేసరికి ఆమెతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడు. ఆమె తనను మోసం చేసిందని నిందించాడు. బాధపడ్డాడు. ఆమెను దూరం పెట్టాడు. దీనికి ఆమె కూడా అలాగే బాధపడింది. తనను కలవాలని కోరింది. కానీ, అతడు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత రాజేశ్ కూడా మరణించాడు. ఇది హత్యా.. ఆత్మహత్యా అని తేలాలి. కారణం ఏదైనా.. ఇద్దరు చేసిన తప్పు వాళ్ల ప్రాణాలు తీసింది. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. దీనిలో ఎవరిని నిందించాలో తెలియని పరిస్థితి.
ఈ ఘటనకు బాధ్యులు ఎవరూ అన్న సంగతి పక్కనబెడితే.. ఇద్దరి మరణం అనేక అంశాలపై చర్చకు తావిస్తోంది. ప్రతి ఒక్కరికీ వయసుతో పాటు విచక్షణ కూడా అవసరం. అది మరిచి ఆకర్షణకు లోనైతే.. అది విషాదాంతాలకు దారి తీయొచ్చు. సాధారణంగా వివాహేతర సంబంధాలు దాదాపు అన్నీ విషాద ముగింపులే ఇస్తాయి. యుక్త వయసులో ఉన్న ఆడ, మగ ఇష్టపడితే ప్రేమ అనుకోవచ్చు. అలా కాకుండా పెళ్లైన తర్వాత జీవిత భాగస్వామితో కాకుండా మరొకరిని ఇష్టపడ్డా, వారితో సంబంధం కొనసాగించినా వాళ్లు విచక్షణ మరిచినట్లే. ఇంకొకరికి ఆకర్షితులయ్యేందుకు కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు. సమాజం అంగీకరించని సంబంధాలకు ఆకర్షితులు అవ్వకుండా ఉండటమే ఎవరైనా చేయాల్సిన పని. అది మొదటి రోజే అర్థం అవ్వకపోయినా.. అర్థమైన రోజైనా దాన్నుంచి బయటపడాలి.
చాలా మంది ఇలాంటి సంబంధాల బారిన పడుతున్నారు. లోపం ఎక్కడుందో తెలీదు కానీ.. హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తున్నాయి ఈ ఘటనలు. ఇలాంటి అనైతిక బంధం ఏర్పర్చుకునే ముందు కుటుంబం, సమాజం గురించి కూడా ఆలోచించాలి. తాత్కాలిక అవసరాల కోసం శాశ్వతమైన బంధాలను బలిపెట్టకూడదు. వివాహ బంధంలో లోపాలుంటే సరిదిద్దుకోవాలి. ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. అంతేకాని.. మరొకరిపై ఆకర్షణకు లోనై జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసుకోకూడదు. విచక్షణ, పరిపక్వత కలిగిన ఆలోచనలతోనే ఇలాంటి వాటి నుంచి బయటపడగలం.