Farm Houses: హైదరాబాద్ సిటీ శివారు ఫామ్ హౌస్‌లే క్రైమ్ అడ్డాలా?

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వందల కొద్దీ ఫాంహౌజ్‌లు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయనే ఆరోపణలున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 16, 2023 | 03:59 PMLast Updated on: Feb 16, 2023 | 3:59 PM

Farm Houses In Hyderabad Citys Suburbs Are Crime Spots

హైదరాబాద్ శివార్లలో ఇబ్బడి ముబ్బడిగా ఫామ్ హౌస్‌లు, రిసార్టులు వెలిశాయి. కరోనాటైంలో చాలామంది రిసార్టులు, ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్నారు. కరోనా ఆంక్షలు సడలించడంతో అందరూ తిరిగి సిటీకి వెళ్లిపోయారు. ఖాళీగా ఉన్న ఫాంహౌజ్‌లను అద్దెకు ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఫామ్ హౌస్‌లను అందుబాటులో పెట్టారు. ఈ ఫామ్ హౌజ్ లు ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయాయి.

హైదరాబాద్ శివారుల్లో చాలా ఫామ్ హౌస్‌లు ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. పార్టీల పేరుతో ఫామ్ హౌస్‌లను రెంటుకు తీసుకొని అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మద్యం, గంజాయి, డ్రగ్స్, పేకాట, వ్యభిచారం అక్కడ నిత్యకృతం అయిపోయాయి. దీంతో పాటు సాధారణ బర్త్ డే పార్టీ పేరుతో ఫామ్ హౌస్‌లను తీసుకొని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు.

ఏడాది కాలంగా హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఫామ్ హౌస్‌లపై పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఫామ్ హౌస్ యజమానులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దాదాపు వంద ఫామ్ హౌస్‌లపైన అధికారులు కేసులు నమోదు చేసి యజమానులను కటకటాల వెనక్కి నెట్టారు. ఏకంగా ఒక సినీ హీరో ఫామ్ హౌస్ లో పేకాట డెన్ బయటపడింది. హైదరాబాద్ శివార్లోని 32 ఫామ్ లపైన పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. నాలుగు ఫామ్ హౌస్ లలోని 23 మందిని అరెస్ట్ చేసారు. మోయినాబాద్‌లోని బిగ్‌బాస్‌ ఫామ్‌హౌస్‌, జహంగీర్ డ్రీమ్‌ వ్యాలీ, శంషాబాద్ పరిధిలోని రిప్లెజ్‌ ఫామ్​హౌస్‌, మేడ్చల్​లోని గోవర్ధన్​రెడ్డి ఫామ్​హౌస్​లపై కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి మద్యం బాటిళ్లు, హుక్కా సామాగ్రి, ప్లేయింగ్ కార్డ్స్, లక్ష 3వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ మధ్య సిటీ శివారు ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. పక్కా సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు షాక్‌ తిన్నారు. 37 మంది గంజాయి మత్తులో ఉండడాన్ని గమనించారు. వాళ్ళని అదుపులో తీసుకుని రేవ్‌ పార్టీని భగ్నం చేశారు. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే. తెలియనివి ఎన్నో ఉన్నాయి. ఫామ్ హౌస్ బాగోతాలకు అధికారులు, లీడర్ల మద్దతు కూడా ఫుల్ గా ఉంది. అందుకే ఇవి అడ్డు అదుపు లేకుండా జరుగుతున్నాయి.