Agastya Chauhan: స్పీడ్‌గా పోతే పోతాం.. పైకే పోతాం..! తెలిసీ మారరా?

యూట్యూబర్, ప్రొఫెషనల్ బైక్ రైడర్‌‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అగస్త్య చౌహాన్‌. కవాసకీ నింజా స్పోర్ట్స్ బైక్ నడుపుతూ.. వీడియోలు చేస్తుండేవాడు. తన ఛానెల్లో వీడియో అప్‌లోడ్ చేసే సమయంలో అతి వేగంతో వాహనం నడపొద్దని వీక్షకులకు సూచించేవాడు. కానీ అదే అతి వేగానికి అతడు బలయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 5, 2023 | 02:04 PMLast Updated on: May 05, 2023 | 2:04 PM

High Speed Killing Indina Youth Learn A Lesson From Youtuber Agastya Chauhan Accident

Agastya Chauhan: ‘స్పీడ్‌ థ్రిల్స్‌.. బట్‌ కిల్స్‌’.. ఇది అందరికీ తెలుసు. కానీ ఎవరూ పాటించరు. మనకేం కాదనే ధీమా! మనల్ని మించిన తోపులు లేరనే మొండితనం! సీన్ కట్ చేస్తే.. రోడ్డుపై రక్తపుటేరులు. ఇక యూట్యూబర్లు వ్యూస్‌ కోసం చేస్తున్న సాహసాలు కొంప ముంచుతున్నాయి. తాజాగా యువ యూట్యూబర్‌ అగస్త్య విషాదాంతం ఎంతో మందికి మేలుకొలుపు.
సోషల్‌ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి అగస్త్య చౌహాన్‌ గురించి పరిచయం అక్కర్లేదు. రివ్వున దూసుకుళ్లే బైక్‌తో అడ్వెంచరస్‌ వీడియోలు చేస్తుంటాడు. యూట్యూబర్, ప్రొఫెషనల్ బైక్ రైడర్‌‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అగస్త్య యూట్యూబ్ ఛానెల్‌కు 12 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటే ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కవాసకీ నింజా స్పోర్ట్స్ బైక్ నడుపుతూ.. వీడియోలు చేస్తుండేవాడు. తన ఛానెల్లో వీడియో అప్‌లోడ్ చేసే సమయంలో అతి వేగంతో వాహనం నడపొద్దని వీక్షకులకు సూచించేవాడు. కానీ అదే అతి వేగానికి అతడు బలయ్యాడు. గంటకు 270 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళుతూ 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. కిందపడ్డ అతని తల బద్దలైంది. హెల్మెట్ తునాతునకలైందంటే వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అతడ్ని ఫేమస్‌ చేసిన వేగమే అతడి ప్రాణం తీసింది. కొన్ని నెలల క్రితం నాగ్‌పూర్‌లో నలుగురు మెడికోలు ఇలాగే కారు డ్రైవ్‌ చేస్తూ ఆ వేగాన్ని చిత్రీకరిస్తూ ప్రాణాలొదిలేశారు. వేగంగా వెల్లే వాళ్ల దృష్టి అంతా రికార్డు మీదే ఉంటుంది కానీ ముంచుకొస్తున్న ముప్పుపై లేకపోవడమే సమస్య. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. నిజానికి వీటిని ప్రమాదాలు అనకూడదేమో. ప్రమాదం అంటే తెలియకుండా జరిగేది. కానీ అగస్త్య లాంటివారు తెలిసి తెలిసీ తమ ప్రాణాలను రోడ్లకు బలిపెడుతున్నారు. జెట్ స్పీడ్‌తో ఎవరికీ అందనంత వేగాన్ని అందుకునే ప్రయత్నంలో ఎవరికీ అందనంత దూరానికి వెళ్లిపోతున్నారు.
ఓవర్ స్పీడింగే కారణం
మనదేశంలో రోడ్డు ప్రమాదాలకు కారణాల్లో ఓవర్‌ స్పీడింగ్‌ మొదటిది. 70శాతం యాక్సిడెంట్లకు, 65శాతం మరణాలకు అతి వేగమే కారణం. రోడ్డు ప్రమాద మృతుల్లో ఎక్కువ మంది యువతే. మనదేశంలోని చాలారోడ్లు 100 కిలోమీటర్ల గరిష్ట వేగానికి మాత్రమే పరిమితం. అంతకు మించి వెళితే మృత్యువుతో పరిహాసమాడినట్లే. కానీ ప్రస్తుతం వస్తున్న కార్లు, బైక్‌లు సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటున్నాయి. అగస్త్య ప్రాణాలు పోగొట్టుకున్న యమునా ఎక్స్‌ప్రెస్ హైవే మన దేశంలోని మంచి రోడ్లలో ఒకటి. దానిపై చాలామంది 120 నుంచి 140కిలోమీటర్ల వేగంతో వెళుతుంటారు. నిజానికి అది కూడా అతి వేగమనే చెప్పాలి. కానీ అగస్త్య వెళ్లింది అతి వేగం కాదు.. అంతకు మించిన వేగం. అలాంటి సందర్భాల్లో వాహనం మన కంట్రోల్‌లో ఉండదు. చిన్న మలుపు వచ్చినా, గుంతలో పడినా ఇక అంతే సంగతులు. అగస్త్య కూడా అలాగే డివైడర్‌ను ఢీకొట్టాడు. మన రోడ్లపై 120సీసీ బైకులే కష్టమనుకుంటే ఇప్పుడు వస్తున్న చాలా బైకులు 350సీసీని మించిపోతున్నాయి. దీంతో యువతకు పట్టపగ్గాలుండటం లేదు. రోడ్డు ఏ మాత్రం ఖాళీగా కనిపించినా రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నారు. మధ్యలో ఎవరైనా అడ్డొచ్చినా, రోడ్డు కాస్త అటూ ఇటుగా ఉన్నా ప్రాణాలు పోతున్నాయి. ఇక అగస్త్య వాడింది 1000 సీసీ బైక్. ఇలాంటివి చూడటానికి చాలా బాగుంటాయి. కానీ మన రోడ్లకు మాత్రం వాటిని తట్టుకునే సామర్ధ్యం లేదు.

Agastya Chauhan
ఖరీదైన బైకులూ కారణమే
బైకులు, కారు రేసుల్లో ఇలా అతివేగానికి బలైపోతున్న వారిలో యువతే ఎక్కువ. ఉడుకు రక్తం వారిని దూకుడుగానే వెళ్లమంటుంది. బండి మన కంట్రోల్‌లో ఉంది అనుకుంటారు. కానీ అది తమ చేతిలో లేదన్న విషయం ప్రమాదం జరిగాక కానీ తెలియదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. స్పీడ్‌ థ్రిల్‌నిస్తుంది. కానీ, అనుకోని ప్రమాదం అంతం చేస్తుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. కాస్ట్‌లీ బైక్‌ లు, పవర్‌ ఫుల్‌ వాహనాలు వాడి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లు ఎంతోమంది కనిపిస్తారు. మన దగ్గరే ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొడుకు నుంచి మాజీ మంత్రి నారాయణ కుమారుడి వరకు ఎంతమంది ఇలా వేగానికి బలైపోయారో చూశాం. నటులు బాబుమోహన్, కోట శ్రీనివాసరావు, క్రికెటర్ అజారుద్దీన్.. ఇలా చాలామందికి ఓవర్ స్పీడ్ కడుపుకోత మిగిల్చింది.
తల్లిదండ్రుల గురించి ఆలోచించరా?
మనవి అసలే అంతంతమాత్రం రోడ్లు. వీటిపై సాహసాలు చేయడమంటే యముడికి వీడియో కాల్ చేసి మరీ ఇన్వైట్ చేయడమే. కాస్త జోష్‌‌గా నడిపినా ప్రమాదం పలుకరిస్తుంది. సోషల్ మీడియా దూకుడు పెరిగాక యూత్‌లో విచక్షణ తగ్గిపోతోంది. క్షణంలో దూసుకెళ్లే బైక్‌లు, కార్లు కొని, వాటితో సాహసాలు చేసి, ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో అప్‌ లోడ్‌ చేసి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. దీనికి అలవాటుపడ్డవారికి ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త ప్రయత్నం చేయాలనే తపన ఉంటుంది. ఎవరూ చేయనిది చేసి తమ సబ్‌స్ర్కైబర్స్‌ను థ్రిల్ చేయాలని ఆరాటపడుతుంటారు. ఆ ప్రయత్నం ప్రమాదాలను తెచ్చిపెడుతోంది. రేసర్లు నిత్యం తమ రికార్డులు తామే దాటడానికి తహతహలాడుతుంటారు. ఓ దశ దాటాక డబ్బుకంటే వారికి మరింత ఫేమస్ కావాలనే పిచ్చే కనిపిస్తుంది. యువత థ్రిల్ కోసం ప్రయత్నాలు చేసే ముందు ఒక్కసారి తమకు ఏమైనా జరిగితే తమ కుటుంబం ఏమై పోతుందో అన్నది ఒక్కసారి ఆలోచించాలి. ప్రాణం తీసే వేగం అవసరమా అన్నది గుర్తించాలి. అల్లారుముద్దుగా పెంచుకుని ప్రయోజకుల్ని చేయాలన్న తపనతో తమకోసమే బతికే తమ తల్లిదండ్రులు ఏమైపోతారో అని ఒక్క సెకను ఆలోచిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు. థ్రిల్ కోసం చేసే ప్రయత్నం ఎన్నో కుటుంబాలకు శోకాన్ని మిగులుస్తుంది. ఎంతోమంది తల్లులకు కడుపుకోత పెడుతుంది. బతికున్నంత కాలం వారు ఆ నరకాన్ని అనుభవించాల్సిందే కదా. ఒక్క క్షణం అలాంటి పరిస్థితే మనకు ఎదురైతే అన్న ప్రశ్న యువత వేసుకుంటే ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయరు. అగస్త్య లాంటి యంగ్ రైడర్లు ప్రాణాలు కోల్పోరు.