Reels and Kills: రీల్స్ అండ్ కిల్స్! ఎందుకా లైకుల పిచ్చి..? కన్నవారికి.. కడుపు కోత!
ఏ విషయంలోనైనా పిచ్చి పనికిరాదు.. అది సోషల్ మీడియాపైనా కావొచ్చు.. ఇతరులపై కావొచ్చు. ఆన్‌లైన్ గేమ్స్‌పైనా కావొచ్చు..! అడిక్షన్ అన్నది ఎందులోనైనా ప్రమాదమే..! చాలా కాలంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మోజు యువత ప్రాణాలు తీస్తోంది. తాజాగా మరోసారి అదే జరిగింది. ఇన్‌స్టాలో అప్లోడ్ చేయాలని రైల్వే ట్రాక్ పక్కన వీడియోలు తీస్తుండగా ట్రైన్ ఢీకొని ఓ విద్యార్థి ప్రాణాలొదిలాడు.
Reels and Kills: అప్పటివరకు అద్భుతంగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థి.. ఉన్నట్టుండి ఇంట్లో బుక్ తియ్యడమే మానేశాడు..! ఓ అమ్మాయి.. అంతకముందు ఎన్నడూ లేని విధంగా ఇంట్లో అదో లోకంలో బతుకుతున్నట్లు ప్రవర్తిస్తోంది..! మరో మహిళ.. బయట వాళ్లతో కానీ, ఇంట్లో వాళ్లతో కానీ అసలు అవసరమే లేదన్నట్లు నిత్యం ఫోన్ పట్టుకొనే తిరుగుతూ దర్శనమిచ్చింది..!
ఇన్‌స్టా రీల్స్.. అదో వింత ప్రపంచం..!
పేరు ఏదైనా కావొచ్చు.. చేసే పని మాత్రం సేమ్..! చేతులు ఎప్పుడూ టచ్ స్క్రీన్‌పై రోల్ అవుతునే ఉండాలి. అందులో వచ్చే పిచ్చి వీడియోలు చూస్తూనే ఉండాలి.. మనం కూడా వాళ్లలాగా వీడియోలు చేయాలి. సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవాలి. లైకులు పెంచుకోవాలి. సెలబ్రెటీల రేంజ్‌లో ఫాలోవర్స్ కావాలి. చదువు వద్దు.. ఆటలు వద్దు.. బయటకు వెళ్లి ఫ్రెండ్స్‌తో తిరగొద్దు.. సినిమాలు కూడా వద్దు.. విద్యార్థికి కావాల్సిన ఎలాంటి ఫిజికల్ ఎక్సర్‌సైజూ వద్దు..! కావాల్సింది వన్ అండ్ ఓన్లీ.. ఫోను! అది ఉంటే చాలు.. తిండి, నిద్ర పీకి పక్కన పడేసే రోజులొచ్చి చాలా కాలం ఐపోయింది! ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి చాలా మంది చావుకు కారణమైంది. తాజాగా మరోసారి అదే జరిగింది.
రైలు ఢీకొనడంతో విద్యార్థి మృతి
హైదరాబాద్ రహ్మత్‌నగర్‌కు చెందిన మదార్సా విద్యార్థి సర్ఫరాజ్(16) తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి శుక్రవారం మధ్యాహ్నం సనత్‌నగర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ పట్టాలపై నిలబడి ఇన్‌స్టా రీల్స్ కోసం వీడియోలు తీసుకుంటున్నాడు. అంతలోనే వేగంగా వచ్చిన ఓ రైలు సర్ఫరాజ్‌ను ఢీకొట్టింది. సర్ఫరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగతా ఇద్దరు రైలు రాకను గమనించి పక్కకు తప్పుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఎంతో మందిని బలి తీసుకున్న రీల్స్ పిచ్చి
రీల్స్ పిచ్చితో డేంజర్ స్టంట్లు చేసి ఇన్‌స్టాలో అప్లోడ్ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా బైక్ స్టంట్లు చేస్తూ ప్రాణాలు వదిలేసిన వారూ ఉన్నారు. పెద్ద పెద్ద భవనాలపై.. కొండలపై.. వాగుల వద్ద.. ఇలా రిస్క్ ఉన్న ప్రతీచోటా రీల్స్ చేయడం అలవాటుగా మారింది. రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావాలనే ఆలోచనే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సర్ఫరాజ్ తరహాలోనే వరంగల్ జిల్లాకు చెందిన అజయ్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి, రైలు పట్టాల వద్ద ట్రైన్ వస్తుండగా వీడియో తీసేందుకు ప్రయత్నించి రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిందీ ఘటన. ఇక తల్లిదండ్రులు రీల్స్ చేయొద్దు అన్నందుకు ప్రాణాలు తీసుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది మార్చిలో తర్వాతి రోజు ఎగ్జామ్ పెట్టుకొని ఓ 9 ఏళ్ల బాలిక రీల్స్ చేస్తుండగా తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ప్రాణాలు తీసుకుంది.
సెల్ఫీ డెత్స్ కంటిన్యూ
ఫేమ్ కోసమో.. లైకుల కోసం.. సెలబ్రెటీ స్టేటస్ కోసమో.. కారణం ఏదైనా కావొచ్చు.. రీల్స్ పిచ్చితో మాత్రం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నాయి. అటు సెల్ఫీ సరదా ముగ్గురు స్నేహితుల ప్రాణాలను తీసేసింది. హైదరాబాద్‌కి చెందిన కైసర్, సోహెల్ ఇద్దరు మంచి స్నేహితులు. వాళ్లిద్దరూ ఓ ఫంక్షన్‌లో పాల్గొనడానికి సిద్ధిపేటకు వెళ్లారు. నెంటూరు సామల చెరువు దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు. కైసర్ తన అన్నకొడుకుని కూడా తీసుకెళ్లాడు. ఆ అబ్బాయికి మూడేళ్లు.. పిల్లవాడిని పక్కనపెట్టి యువకులిద్దరూ సెల్ఫీలు దిగుతుండగా మూడేళ్ల బాలుడు గుంతలో జారి పడ్డాడు. అతడిని రక్షించే క్రమంలో ఇద్దరు యువకులు కూడా గుంతలో చిక్కుకుని ప్రాణాలొదిలారు. ఇలా ఒక్క రోజు వ్యవధిలో పాపులారిటీ పిచ్చి నలుగురు ప్రాణాలను బలిగొంది. అందులో అభంశుభం తెలియని మూడేళ్ల బాలుడు కూడా ఉండడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.