Hyderabad: చేప మందు దాత ఇక లేరు.. ఏమైందంటే..

బుధవారం రాత్రి బత్తిని హరినాథ్ గౌడ్ తుదిశ్వాస విడిచారు. హరినాథ్ గౌడ్‌కు భార్య సుమిత్రా దేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బత్తిని సోదరులైన హరినాథ్ గౌడ్, విశ్వనాథ్ గౌడ్, శివరాం గౌడ్, సోమలింగం గౌడ్, ఉమా మహేశ్వరగౌడ్‌లు హైదరాబాద్‌లో చాలాకాలంగా చేపమందు పంపిణీ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 24, 2023 | 03:33 PMLast Updated on: Aug 24, 2023 | 3:33 PM

Hyderabad Fish Prasadams Main Organiser Bathini Harinath Goud Passes Away

Hyderabad: మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా.. ఏటా అస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి బత్తిని హరినాథ్ గౌడ్ తుదిశ్వాస విడిచారు. హరినాథ్ గౌడ్‌కు భార్య సుమిత్రా దేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బత్తిని సోదరులైన హరినాథ్ గౌడ్, విశ్వనాథ్ గౌడ్, శివరాం గౌడ్, సోమలింగం గౌడ్, ఉమా మహేశ్వరగౌడ్‌లు హైదరాబాద్‌లో చాలాకాలంగా చేపమందు పంపిణీ చేస్తున్నారు.

1847లో హైదరాబాద్ సంస్థానంలోనే చేపమందు ప్రసాదం పంపిణీ అయింది. సుమారు 176 ఏళ్ల నుంచి బత్తిని వంశస్తులు అస్తమా రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని అందిస్తున్నారు. గతంలో పాతబస్తీలో పంపిణీ చేసేవారు. ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు మార్చారు. కొర్రమీను చేప పిల్లలను అక్కడే స్టాల్స్‌లో పెట్టి విక్రయిస్తారు. చేప ప్రసాదం కావాలనుకున్న వారు డబ్బులిచ్చి.. చేప పిల్లలను కొనుక్కుంటారు. ఉబ్బసం రోగుల ఇబ్బందుల నుంచి ఊరటనిస్తుందని నమ్మి.. చాలామంది బత్తిని సోదరులు ఇచ్చే చేపమందు కోసం ఇక్కడికి వస్తుంటారు. ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా.. వివిధ రాష్ట్రాల నుంచి లక్షల్లో అస్తమా బాధితులు చేపమందు కోసం తరలివస్తారు. శాకాహారులకు బెల్లంతో కలిపిన ప్రసాదం ఇస్తారు.

చిన్నపిల్లల నుంచి వందేళ్ల వృద్ధుల వరకు చేపమందును పంపిణీ చేస్తారు. భోజనం చేసిన మూడు గంటల తర్వాతే మందు ఇస్తారు. గర్భిణిలకు మాత్రం ఈ చేపమందు ఇవ్వరు. చేపమందు మీద విమర్శలు చేసే వాళ్లు కూడా ఉన్నారు. ఐతే హరినాథ్‌ గౌడ్ మరణించినా చేప మందు పంపిణీ ఆపేది లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆయన సోదరుడు వచ్చే ఏడాది నుంచి పంపిణీ చేయబోతున్నారు.