Extramarital affairs: వావివరుసలు మనిషి సృష్టి కదా! పుర్రెలో పుట్టిన బుద్ధి ఎక్కడికి పోతుంది? ఈ వివాహేతర సంబంధాలకు అసలు కారణాలేంటో తెలుసా?
మనసు మలినమైతే తల్లి, చెల్లి కూడా 'వాడికి' 'అలానే' కనిపిస్తారు. వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా విషాదంతోనే ముగుస్తాయి. సరూర్ నగర్ యువతి అప్సర మర్డర్ ఇదే విషయన్ని మరోసారి నిరూపించింది.
అక్కా..అక్కా అంటూ అప్సర్ తల్లితో మాటలు కలిపాడు. అప్సరని తన మేనకోడలిలాగా ఊరులో ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అందుకే ఆమెను బైక్‌పై ఎన్నీసార్లు తిప్పినా.. రాత్రి 12గంటలకు ఇంటి వద్ద డ్రాప్ చేసినా ఎవరూ అనుమానించలేదు. వాళ్ల ఇంటి మనిషేలే అనుకున్నారంతా! గుడిలో పూజారి కూడా కావడం.. అమాయకుడిలా మాట్లాడే తెలివితేటలుండడంతో వెంకట సాయి సూర్య కృష్ణపై అంతకముందు ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి డౌట్ రాలేదు. అయితే ఈ పిలుపుల్లోనే.. వరుసలు కలుపుకోవడంతోనే వివాహేతర సంబంధాలకు టైటిల్ కార్డ్ పడుతుందన్న విషయాన్ని చాలా కొద్దీ మందే గమనిస్తున్నారు.
వావివరుసలు మనిషి సృష్టి!:
సైన్సు ప్రకారం మానవుడు మొదటిగా ఆఫ్రికాలో పుట్టాడు.. అక్కడ నుంచే వివిధ ఖండాలకు వలస వెళ్లాడు. అంటే మనమంతా ఆ నల్లతల్లి బిడ్డలమే.. అందరిలో ప్రవేహించేది దాదాపు అదే రక్తం. ఈ వావివరుసలు నాగరికత పెరుగుతున్న కాలంలో మనిషి సృష్టించిన సంబంధాలు. మనుషుల లోలోపల పుర్రెల్లో గూడుకుట్టుకున్న కామానికి ఈ వరుసలు హద్దు దాటకుండా చేశాయి. అయితే మనిషి నిజస్వరూపం మాత్రం కొద్దీసార్లు బయటపడుతుంటుంది. అందుకే ఎక్కడ లేని పిలుపులతో చుట్టరికం లేని వారికి కూడా దగ్గరవుతారు. అవి కాస్త అటు తిరిగి ఇటు తిరిగి వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయి. ‘అందరూ అలానే ఉండరు కదా’ అన్న అర్థ నిజాన్ని పక్కన పెడితే వేల సంవత్సరాలగా మనుషులు మెదళ్లలో తిష్టవేస్తూ వస్తున్న ‘మోహం’ ఈ సంబంధాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి. అందుకే వావివరుసలు మర్చి..అప్పటివరకు లేని వరుసలు సృష్టించి..కోరికలు తీరిన తర్వాత ఎవరో ఒకరు తనువు చాలిస్తున్నారు.
వివాహేతర సంబంధాలకు కారణాలు:
దేశంలో దాదాపు సగానికిపైగా వివాహేతర సంబంధాలు విషాదంతోనే ముగుస్తున్నాయి. చంపడమో..చావడమో.. ఆస్పత్రుల పాలవడమో ఏదో ఒక ఘోరమో, దారుణమో జరగకుండా ఉండని పరిస్థితి. వివాహేతర సంబంధాలకు ఎన్నో కారణాలను నిపుణులు ఎప్పటికప్పుడు వివరిస్తుంటారు. సంతృప్తికరమైన శృంగార సుఖం లేదని, సంసారానికి పనికిరావడం లేదని, భర్త/భార్య వేధింపులకు గురిచేస్తున్నారని, చిన్నతనంలోనే పెళ్లి జరిగిపోయిందని, భర్త ద్రోహం చేశాడని, భార్య మోసం చేసిందని.. అందుకే ప్రతికారం తీర్చుకుంటారని ఇలా రకరకాల కారణాలు ఘటన జరిగిన ప్రతిసారి నిపుణుల నుంచి వినపిస్తూనే ఉంటాయి. గాలితనంగా బయట మాట్లాడుకునే చిల్లర కారణాలు ఎలాగో ప్రజల నోళ్లలో నిత్యం నానుతూనే ఉంటాయి. వాళ్ల గురించి మాట్లాడుకోవడం శుద్ద దండగా! అయితే ఈ కారణాలన్ని నిజాలే కావొచ్చు..మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి?
శృంగార సుఖం కోసమేనా ఇదంతా?
ప్రతి వివాహేతర సంబంధం శృంగారం కోసేమనని భావించలేం. పెళ్లీ తర్వాతో.. అంతకముందో జీవితంలో అసలు ప్రేమే నోచుకోని మనసులు ఇతరుల పట్ల ఇట్టే ఆకర్షితులవుతాయి. ఎమోషనల్ రిలేషన్ కాస్త వివాహేతర సంబందానికి దారి తీస్తుంది. కొందరివి మాత్రం పైన చెప్పుకున్నట్టు రకరకాల కారణాలుంటాయి. ఇందులో మంచి-చెడులను సమాజం నిర్ణయించకూడదు. అందుకే వీటిని అక్రమ సంబంధాలని అనకుండా వివాహేతర సంబంధాలనే అనాలి. ఏదో అక్రమమో, ఏది సక్రమమో నిర్ణయించే అధికారం సమాజానికి లేదు. ఎందుకంటే వివాహేతర సంబంధానికి దారి తీసిన కారణాలు వాళ్లకి తెలియవు..
అయితే ఈ సంబంధాలన్ని విషాదంతోనే ముగియడానికి ఉన్న బలమైన కారణం మనిషికి తన శరీరం, తన మనసుపై, తన మెదడుపై.. అవి విడుదల చేసే హార్మోన్లపై కనీస జ్ఞానం లేకపోవడం. వాటిని నియంత్రించుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం. తన శరీరంపై తనకే అదుపు లేకపోవడం.. ఈ కోరికలన్ని తాత్కాలికమేనని..కాసేపు బుర్రలో తిరిగి కాసేపటికి సాధారణ స్థితికి చేరుకుంటాయన్న విషయం తెలియకపోవడం. అవతలి జెండర్‌లో ఏదో సృష్టి రహస్యం దాగుందని భ్రమ పడడం. శృంగారం కోసం పాకులాడిల్సిన పని లేదన్న విషయం అర్థంకాకపోవడం..అది ఏదో వింత ప్రపంచం నుంచి ఊడిపడలేదన్న విషయన్ని గ్రహించలేకపోవడం. ఆకర్షణ, ప్రేమ సహజమేనన్న నిజం కూడా కొందరికి తెలియదు. అవి కూడా తప్పుల్లాగా ప్రచారం చేసే సమాజం ఎలాగో ఉంది. అందుకే కోరికలని నార్మలైజ్ చేసి చూడనంతకాలం, మనిషి తన అసల బుద్దిని, తన శరీరాన్ని అర్థం చేసుకోలేనంత కాలం వివాహేతర సంబంధాలు విషాదంతోనే ముగుస్తుంటాయి.