Bihar Marriage: బట్టతల బట్టబయలై బెడిసికొట్టిన పెళ్లి..
ఈ కాలంలో పెళ్లే ఒక పెద్ద గుదిబండలా మారింది. పెళ్లి చూపులు మొదలు పెళ్లి పీటల వరకూ అన్నింటా ఆటంకాలే. ఒకరిని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి సవాలక్షా ప్రశ్నలు ఎదురవుతాయి. ఏం చేస్తాడు మొదలు ఎంత సంపాదిస్తాడు వరకూ. అందం మొదలు గుణగణాల వరకూ అన్నీ అంగడి లిస్ట్ పెట్టుకొని మరీ టిక్ మార్క్ చేసుకునే రోజులు ఇవి. ఇక ప్రేమతో కూడిన అరైంజ్డ్ మ్యారేజ్ అయితే చెప్పనవసరం లేదు. అడుగడుగునా మ్యానేజ్ చేసుకోవడం, అడ్జెస్ట్ అవ్వడం, కాంపర్మైజ్ వంటివి కనిపిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే ఒకడు రెండో పెళ్లికి సిద్దం అయ్యాడు. అది కూడా అబద్దాలు చెప్పి. చివరకు ఇతని పెళ్లి ఎలా జరిగిందో చూద్దాం.

In Bajaura village of Bihar's Gaya district, Iqbal hid his baldness and prepared for his second marriage
బీహార్ లోని గయా జిల్లాకు చెందిన బజౌరా గ్రామంలో ఇక్భాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను తన భార్యతో కలిసి ఉంటూనే మరో పెళ్లి చేసుకోవాలనే దుర్భుద్ది పుట్టింది. దీంతో పెళ్లిళ్ళ బ్రోకర్ను సంప్రదించాడు. తనకు పెళ్లైన విషయం, బట్టతల ఉన్న సంగతి చెప్పకుండా పెళ్లికి సిద్దం అయ్యాడు. కొన్ని రోజుల తరువాత బజౌరా గ్రామానికి చెందిన యువతితో ఇతగాడి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి చూపుల మొదలు మండపంలో పెళ్లి పీటలు ఎక్కేవరకూ ఎలాంటి అనుమానం రాకుండా బాగానే హ్యాండిల్ చేశాడు. మాంగళ్యధారణ చేసేందుకు ఇక కొన్ని క్షణాలు ఉండగా ఇతగాడి జుట్టుపై అమ్మాయి బంధువులకు అనుమానం వచ్చింది. దగ్గరకు వెళ్లి అతని జుట్టు పట్టుకొని లాగారు. చెప్పేదేముంది. విగ్గు ఊడి చేతికి వచ్చింది.
ఇంతలో సీన్ కట్ చేస్తే.. తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్న విషయాన్ని తెలుసుకొని మొదటి భార్య పెళ్లి మండపానికి చేరుకుంది. తన పెనిమిటి పెళ్లిబట్టల్లో చూసి ఆగ్రహానికి గురై అందరూ చూస్తుండగానే చెంప చెల్లుమనిపించింది. అతని మోసం నలుగురి ముందు బయటపడింది. దీంతో అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు అక్షింతలు వేయాల్సిన చేతులతో దెబ్బలు వేశారు. పెళ్లైన విషయంతో పాటూ.. బట్టతల విషయాన్ని దాచి ఉంచినందుకు పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు మూడు ముళ్లుతో కాకుండా మూడు చెరువుల నీళ్లు తాగించేలా ఉతికి ఆరేశారు. ఈ ప్రబుద్ధుడిని గ్రామ పెద్దల సమక్షంలో ప్రవేశపెట్టి సమస్యను పరిష్కరించుకున్నారు. తాను చేసింది తప్పే అని.. ఇక పై ఇలాంటి ఘటనలకు పాల్పడనని చెప్పుకొచ్చాడు నిత్యపెళ్లి కొడుకు. పెళ్లికి వచ్చిన వాళ్లు ఈతంతు మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇతగాడు అనుకున్న పెళ్ళి ఒకటైతే.. అయిన పెళ్లి మరొకటి అంటూ ఈ వీడియో చూసినవాళ్లు కామెంట్లు పెడుతున్నారు.
T.V.SRIKAR