Seema Haider: ప్రేమికురాలా..? పాక్ ఏజెంటా..? సీమా హైదర్ విషయంలో సందేహాలెన్నో..!
మొదట అందరూ సచిన్-సీమాల ప్రేమనే చూశారు. సీమాను గొప్ప ప్రేమికురాలిగా భావించారు. అయితే, నలుగురు పిల్లలతో కలిసి మరీ పాక్ వదిలి ఇండియా రావడం కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. తర్వాత ఈ విషయంలో భారత అధికారుల్లో నెమ్మదిగా అనుమానాలు మొదలయ్యాయి.
Seema Haider: ఇండియాలో ఉన్న ప్రియుడి కోసం పాక్ నుంచి వచ్చిన సీమా హైదర్ విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమె నిజంగా తన ప్రియుడి కోసమే వచ్చిందా..? లేక ప్రేమ పేరుతో ఇండియాలో గూఢచర్యం చేసేందుకు వచ్చిందా..? ఈ విషయంపైనే ఇప్పుడు అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం సీమా-సచిన్ ప్రేమకథ కన్నా.. దేశ భద్రత, గూఢచర్యం అనే విషయంపైనే దేశమంతా చర్చిస్తోంది.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా అనే యువకుడితో పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ గులామ్ అనే మహిళకు పబ్‌జి ద్వారా పరిచయమైంది. ఈ పరిచయం ఇద్దరి మధ్యా ప్రేమగా మారింది. అప్పటికే సీమాకు పెళ్లై, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఇండియాలోని తన ప్రియుడు సచిన్ కోసం సీమా హైదర్ నలుగురు పిల్లలతో కలిసి ఇండియా వచ్చింది. పాక్ నుంచి దుబాయ్.. అక్కడి నుంచి నేపాల్.. అటు నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించింది. రాగానే సచిన్‌తో పెళ్లికి సిద్ధమైంది. పెళ్లికి దరఖాస్తు చేసుకునేందుకు ఒక లాయర్‌ను సంప్రదించింది ఈ జంట. అంతే.. లాయర్ ద్వారా అసలు విషయం బయటపడింది. పాక్ నుంచి అక్రమంగా సీమా ఇండియాకు వచ్చిందన్న సంగతి ప్రపంచానికి తెలిసింది. మొదట అందరూ సచిన్-సీమాల ప్రేమనే చూశారు. సీమాను గొప్ప ప్రేమికురాలిగా భావించారు. అయితే, నలుగురు పిల్లలతో కలిసి మరీ పాక్ వదిలి ఇండియా రావడం కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. తర్వాత ఈ విషయంలో భారత అధికారుల్లో నెమ్మదిగా అనుమానాలు మొదలయ్యాయి. అసలు నిజంగానే సచిన్ కోసం వచ్చిందా..? లేక దేశంలో గూఢచర్యం, మరేదైనా కారణం కోసం వచ్చిందా..? అని అనుమానిస్తున్నారు అధికారులు. ఈ అంశంపై అన్ని రకాలుగా విచారణ జరుపుతున్నారు.
ఎన్నో అనుమానాలు
సాధారణ ప్రజల దగ్గరి నుంచి భారత రక్షణ అధికారుల వరకు సీమా విషయంలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సచిన్ కోసం సొంత దేశం వదిలి వచ్చేంతగా అతడిలో ఆకర్షణ ఏముంది అని..? అతడేమీ సంపన్న కుటుంబానికి చెందిన వాడేం కాదు. సాధారణ కుటుంబానికి చెందినవాడు. పోనీ ప్రేమకు ఆస్తి, అంతస్థు, అందంతో పని లేదు అనుకుని సరిపెట్టుకుందామన్నా ఏవో సందేహాలు మెదులుతూనే ఉన్నాయి. ఈ విషయంపై అనుమానం వచ్చిన అధికారులు సీమాను విచారిస్తున్నారు. యూపీకి చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు ఆమెను రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో సీమా వ్యవహరిస్తున్న తీరు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పాక్‌లోని కొందరికి హిందీ సరిగ్గా రాకపోవచ్చు. కానీ, సీమా హిందీ బాగా మాట్లాడేస్తుంది. పైగా ఇంగ్లీషు కూడా బాగానే వచ్చని తెలిసింది. ఆమెకు కొన్ని వాక్యాలు ఇచ్చి చదవాలి అని చెబితే ఎలాంటి తడబాటు లేకుండా చదివింది. ఆమె నేపథ్యం చూస్తే అంతగా ఇంగ్లీషు వచ్చి ఉండకపోవచ్చని అధికారుల అంచనా. కానీ, ఆమె ఇంగ్లీషు మాట్లాడటం మన అధికారుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అలాగే ఆమె పాక్‌కు సంబంధించిన ఐడీ కార్డులోని విషయాలపై కూడా అనేక అనుమానాలున్నాయి. ఆమె చెబుతున్న వయసుకు, ఐడీ కార్డులోని వయసుకు సంబంధం లేదు. పైగా పుట్టిన తర్వాత పొందే ఐడీ కార్డును ఆమె గత ఏడాది పొందింది. అంటే కొత్తగా ఏడాది క్రితం క్రియేట్ చేసిన ఐడీ కార్డు అది. అందులో తనకు అనువైన వివరాల్ని పొందుపర్చుకుని ఉండొచ్చు. అందుకే ఆమె పాక్ ఐడీతోపాటు పాస్‌పోర్టు, పిల్లల ఐడీ కార్డులు, పాస్‌పోర్టులు వంటి వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. సీమా సోదరుడు, బంధువులు పాక్ ఆర్మీలో పని చేస్తున్నారు. రెండు రోజులపాటు, ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన విచారణలో ఆమె ఆచితూచి సమాధానాలు చెబుతోంది. అంటే పోలీసులు ఏ ప్రశ్నలు అడుగుతారు..? వాటికి ఏం సమాధానాలు చెప్పాలి..? అని ముందుగానే సిద్ధమైనట్లు అనుమానం కలుగుతోంది. మొదటి రోజు విచారణ కంటే.. రెండో రోజు విచారణలో మరింత ధైర్యంగా సమాధానాలు చెప్పింది. ఆమె నుంచి అసలైన సమాధానం రాబట్టడం కష్టమనే విషయం ఏటీఎస్ అధికారులు గుర్తించారు. సీమా చాలా తెలివిగా సమాధానాలు చెబుతోంది.
సచిన్ కోసం రాలేదా..?
ఏటీఎస్ అధికారుల విచారణలో ఆసక్తికర విషయం బయటపడింది. సీమా ఇండియా వచ్చిన తర్వాత మొదట సచిన్‌ను కాకుండా.. వేరే వ్యక్తులను సంప్రదించినట్లు తెలిసింది. ఆమెకు ఢిల్లీకి చెందిన మరికొందరితోనూ పబ్‌జి పరిచయాలు ఉన్నట్లు తేలింది. ఈ కోణంలోనూ అధికారులు విచారిస్తున్నారు. సీమా విషయంలో ఎదురవుతున్న అనేక సందేహాలు ఆమె ప్రేమికుడి కోసమే వచ్చుండకపోవచ్చు అనిపించేలా ఉన్నాయి. ఆమె ఐఎస్ఐ ఏజెంటా..? గూఢచర్యం చేసేందుకు వచ్చిందా..? ఇంకేదైనా లక్ష్యంతో ఇండియాలో అడుగుపెట్టిందా అనే కోణంలో అధికారుల విచారణ సాగుతోంది. కాగా, సీమా హైదర్ పాక్ ఏజెంట్ అని, ఆమెను తిరిగి పాక్ పంపించాలి అని ముంబై పోలీసులకు ఒక మెసేజ్ వచ్చింది. దీనిపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇంకా ఎవరైనా ఉన్నారా..?
సీమా ఇండియా రాగానే సచిన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందుకోసం లాయర్‌ను సంప్రదిస్తే.. ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. ఒకవేళ ఆయన ఈ విషయం చెప్పకపోతే.. సీమా ఇండియా పౌరురాలిగా మారిపోయేది. అదీ కాకుండా.. వేరే ఎవరినైనా దళారిని సంప్రదించి, నకిలీ డాక్యుమెట్స్ సృష్టించి, ఈ తతంగం అంతా నడిపించినా ఎవరికీ తెలిసేది కాదు. నిజంగా ప్రేమికుడి కోసమే వచ్చుంటే ఏ సమస్యా లేదు. కానీ, ఇక్కడి మనిషిగా కలిసిపోయి, దేశ రహస్యాలు సేకరించినా, కుట్రలు జరిపినా దేశ భద్రతకు పెను ప్రమాదమే. ఏదైతేనే ప్రస్తుతానికి సీమా హైదర్ విషయం భద్రతాధికారుల చేతిలో ఉంది. వాళ్లు అసలు విషయం తేల్చేస్తారు. కానీ, సీమాలాగే ఇంకెవరైనా ఇలాగే ఇండియా వచ్చి సెటిలయ్యారా..? మనవాళ్లకు ప్రేమ బాణాలు విసురుతూ గూఢచర్యం చేస్తున్నారా..? బయటకు రాకుండా ఇలా మిగిలిపోయిన వాళ్లున్నారా..? సందేహం లేని ప్రశ్నలెన్నో..!