అమరావతిలో ISIS ఉగ్రవాదులు ? ఆ డ్రగ్‌ కొన్నది ఎవరు

ఏపీలో ఉగ్రవాదులు మకాం వేశారా. అమరావతిని అడ్డాగా చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసానికి ప్లాన్‌ చేస్తున్నారా.. ఇప్పుడు ఇవే భయాలు తెలుగు ప్రజలను టెన్షన్‌ పెడుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2025 | 02:50 PMLast Updated on: Mar 22, 2025 | 2:50 PM

Isis Terrorists In Amaravati Who Bought The Drugs

ఏపీలో ఉగ్రవాదులు మకాం వేశారా. అమరావతిని అడ్డాగా చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసానికి ప్లాన్‌ చేస్తున్నారా.. ఇప్పుడు ఇవే భయాలు తెలుగు ప్రజలను టెన్షన్‌ పెడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్, బొకోహరమ్ వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే “ఐసిస్ డ్రగ్”గా పేరొందిన ట్రెమడాల్ అనే సైకోట్రోపిక్ మాదకద్రవ్యాన్ని కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఓ మెడికల్ షాపులో ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు. ఒకటో, రెండో కాదు.. గత రెండేళ్లలో ఈ ఒక్క షాపులోనే 55 వేల 961 ట్రెమడాల్ మాత్రలు, 2 వేల 794 ఇంజెక్షన్లు విక్రయించారు. మాదక ద్రవ్యాల విక్రయాలను అరికట్టే చర్యల్లో భాగంగా విజిలెన్స్, ఔషధ నియంత్రణ విభాగం అధికారులు టీంలుగా ఏర్పడి రాష్ట్రంలోని ఔషధ దుకాణాలు, ఏజెన్సీల్లో సోదాలు నిర్వహించారు.

ఈ క్రమంలో అవనిగడ్డలోని భార్గవ మెడికల్ స్టోర్‌లో ఈ మాదకద్రవ్యాల రాకెట్ బయటపడింది. అలసట, నిద్ర రాకుండా ఉండటానికి, ఎక్కువ సమయం ఉత్తేజంగా పనిచేయటానికి ఐసిస్, బోకోహరామ్ వంటి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులకు ఈ ట్రెమడాల్ మాత్రలను అందిస్తుంటాయి. అందుకే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా “ఐసిస్ డ్రగ్”గా “ఫైటర్ డ్రగ్”గా పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే ట్రెమడాల్ ఔషధం తయారీ, వినియోగంపై 2018 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు, నియంత్రణలు పెట్టింది. ట్రెమడాల్‌ను NDPS చట్టం పరిధిలోకి తీసుకొచ్చి సైకోట్రోపిక్ మాదకద్రవ్యంగా గుర్తించింది. దీన్ని అనుమతించిన పరిమాణం, కాంబినేషన్లలో మాత్రమే తయారు చేసి వైద్యుల సూచనలతో విక్రయించాలి. కానీ అవనిగడ్డలోని మెడికల్ షాపులో మాత్రం.. యథేచ్ఛగా ఎలాంటి అనుమతులూ లేకుండానే భారీగా అమ్మేశారు. వైసీపీ హయాంలో ఇది ఉదృతంగా సాగింది. ఇప్పటికీ కొనసాగుతోంది.

ఈగల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో ఈ గుట్టు బయటకు రావటంతో తనిఖీ అధికారులూ ఆశ్చర్యపోయారు. రికార్డుల్లో ఉన్నదానికి మించి మాత్రలు విక్రయించి ఉంటారని అనుమానిస్తున్నారు. భార్గవ మెడికల్ స్టోర్స్ యజమాని కొనకళ్ల రామ్మోహనన్ను ప్రశ్నించగా.. చాలా కాలంగా ఈ మాత్రలు, ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు చెప్పారు. అవనిగడ్డ పరిసర ప్రాంతంలో అనేక వందల మందిని ఆయన ఈ మత్తు పదార్థానికి బానిసలుగా మార్చినట్లు ఈగల్ విభాగం గుర్తించింది. వారంతా రోజూ దీన్ని కొంటున్నట్లు తేల్చింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వీలుగా కొనకళ్ల రామ్మోహన్‌పౌ NDPS చట్టంలోని సెక్షన్ల కింద అవనిగడ్డ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ రాకెట్ మూలాలు వెలికితీసేందుకు మరింత లోతైన దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.