France Riots: ఫ్రాన్స్‌ ఎందుకు తగలబడుతోంది..? టీనెజర్‌ని పోలీసులు ఎందుకు చంపారు..? నీరో చక్రవర్తిలా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫిడేల్‌ వాయిస్తున్నాడా..?

ఇంతింతై వటుడింతై అన్నట్టు.. ఫ్రాన్స్‌లో మొదలైన నిరసనలు చినికిచినికి గాలివానలా మారాయి. ఇది ఎక్కడకు దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి. నిరసనలు చేస్తున్న వాళ్లలో ఎక్కువ మంది టీనేజర్లే ఉన్నారు. పోలీసులపై దాడి చేస్తున్నారు. పరిస్థితిని అదుపు చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 2, 2023 | 01:38 PMLast Updated on: Jul 02, 2023 | 1:38 PM

Justice Pour Nehal As France Protests Intensify For Police Killing 17 Year Teenager

France Riots: నిరసనల పురిటి గడ్డ ఫ్రాన్స్‌ మరోసారి అట్టుడుకుతోంది. 17ఏళ్ల టీనేజర్‌ని పోలీసులు కాల్చి చంపడంతో దేశమంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఫ్రాన్స్‌ నిత్యం నిరసనలతో అట్టుడికే దేశం. తలవంచడమే కానీ.. తలదించడం తెలియని పౌరులు అక్కడుంటారు. అందుకే అధ్యక్ష పీఠంపై ఎవరెక్కినా ప్రజలు లెక్క చేయరు. తప్పుంటే ప్రశ్నిస్తారు. నిలదీస్తారు. తాడోపెడో తేల్చుకుంటారు. మరోసారి అదే చేస్తున్నారు. జూన్​ 27న జరిగిన 17 ఏళ్ల టీనేజర్‌ మరణం (హత్య) ఆ దేశాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. నహెల్​ అనే యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఆఫ్రికాలోని అల్జీరియా నుంచి వలస వచ్చిన కుటుంబం నహెల్‌ది. ఇది జాత్యహంకార కాల్పులుగా ప్రజలు భగ్గమంటున్నారు.
ఇంతింతై వటుడింతై అన్నట్టు.. ఫ్రాన్స్‌లో మొదలైన నిరసనలు చినికిచినికి గాలివానలా మారాయి. ఇది ఎక్కడకు దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి. నిరసనలు చేస్తున్న వాళ్లలో ఎక్కువ మంది టీనేజర్లే ఉన్నారు. పోలీసులపై దాడి చేస్తున్నారు. పరిస్థితిని అదుపు చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. లాభం లేదనుకొని టియర్‌ గ్యాస్, వాటర్‌ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. పలు ప్రాంతాల్లో రాత్రుళ్లు కర్ఫ్యూ విధిస్తున్నారు. ఆందోళనకారుల దాడుల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు. అదుపులోకి తీసుకున్న 667 మంది ఆందోళనకారుల్లో 307 మంది ప్యారిస్‌కి చెందినవారే. మరోవైపు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిపై విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

ఓవైపు దేశం తగలపడిపోతుంటే ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ ఓ మ్యూజిక్‌ కన్సర్ట్‌లో పాల్గొన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది ఘటన జరిగిన ముందు రోజు నాటి వీడియో అని ప్రభుత్వం చెబుతోంది. పిల్లలు, టీనేజర్లను తల్లిదండ్రులు ఇళ్లలో నుంచి బయటకు పంపించవద్దని మాక్రాన్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. అటు ఓవైపు నిరసనలు జరుగుతుంటే మరోవైపు దోపిడీ దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. కనిపించిన షాపుల్లో దూరిపోయి అక్కడి వస్తువులను చోరీ చేస్తున్నారు. ఐఫోన్లు కూడా దొంగిలించినట్లు సమాచారం. చేస్తుంది దోపిడీలు అయినా.. ఏదో ఘనకార్యం అన్నట్టు వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇలా దొంగలు, నిరసనకారులతో పోలీసులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరికొన్ని ప్రాణాలు పోయే ప్రమాదముంది. మరి చూడాలి మాక్రాన్‌ ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తారో..!