Kenya Doomsday Cult: జీసస్ పేరిట మృత్యు కేళి? ఈ పాపం ఎవరిది పాస్టర్?
తాజాగా కెన్యాలో దేవుడి పేరుతో అత్యంత హృదయ విదారక ఘటన జరిగింది. ఉపవాసం చేసి ఆకలితో మరణిస్తే జీసస్‌ను కలవొచ్చని ఒక పాస్టర్ చెప్పిన మాటల్ని నమ్మి 200 మందికిపైగా అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 600 మంది ఆచూకీ దొరకడం లేదు.
Kenya Doomsday Cult: దేవుడి పేరుతో మూఢ నమ్మకాలు అన్ని చోట్లా సాగుతున్నాయి. వీటిని అడ్డం పెట్టుకుని కొందరు తమ పబ్బం గడుపుకొంటారు. అమాయక ప్రజల్ని మోసం చేస్తూ తాము మాత్రం ఉన్నత జీవితం గడుపుతుంటారు. మత బోధకులు, గురువులు చెప్పే వాటిని పాటిస్తూ చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా కెన్యాలో దేవుడి పేరుతో అత్యంత హృదయ విదారక ఘటన జరిగింది. ఉపవాసం చేసి ఆకలితో మరణిస్తే జీసస్‌ను కలవొచ్చని ఒక పాస్టర్ చెప్పిన మాటల్ని నమ్మి 200 మందికిపైగా అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 600 మంది ఆచూకీ దొరకడం లేదు.
ప్రతి మతంలో గురువులు, ముల్లాలు, పాస్టర్లు వంటి వాళ్లు తమ మతం గురించి ప్రచారం చేస్తుంటారు. ఆచార వ్యవహారాల గురించి వివరిస్తారు. దేవుడి అనుగ్రహం ఎలా పొందాలో.. దేవుడికి ఎలా చేరువ అవుతారో చెబుతుంటారు. వీటిలో కొన్ని అశాస్త్రీయంగా, అమానవీయంగా కూడా ఉంటాయి. తాజాగా కెన్యాలో జరిగింది అలాంటి ఘటనే. తమకున్న జ్ఞానాన్ని మానవ జాతి ప్రగతి కోసం వినియోగించాల్సిన ఒక పాస్టర్ అన అజ్ఞానంతో సాటి మనుషుల ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడు. ఒకరు.. ఇద్దరు కాదు.. ఆయన మాటలు విని ఏకంగా 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన హృదయవిదారకంగా ఉంది. కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో పాల్ మెకంజీ పాస్టర్‌గా ఉండేవాడు. తన దగ్గరకు వచ్చే ప్రజలకు క్రీస్తు గురించి వివరించే వాడు. ఈ క్రమంలో ఇటీవల జీసస్‌ను చేరుకునేందుకు ఒక ఉపాయం చెప్పాడు.
దేవుడి పేరుతో ఉపవాసం చేసి, ఆకలితో మరణిస్తే జీసస్‌ను చేరుకోవచ్చని చెప్పాడు. దీంతో ఈ ప్రాంతంలోని చాలా మంది అమాయకులు ఆయన మాటలు నమ్మారు. ఉపవాసం చేయడం ప్రారంభించారు. అలా ఆహారం, నీళ్లు తీసుకోకపోవడంతో చాలా మంది మరణించారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. ఇంట్లోని పెద్దవాళ్లు ముందుగా తమ పిల్లలు మరణించేలా చూశారు. ఆ తర్వాత వాళ్లు మరణించారు. ఇలా మరణించిన వారిని అక్కడి అటవీ ప్రాంతంలోనే సామూహికంగా ఖననం చేశారు. చాలా రోజులుగా ఈ తతంగం సాగుతోంది. చాలా మంది మరణించారు. ఇదంతా రహస్యంగా సాగింది. అయితే, కొందరు వ్యక్తుల ద్వారా ఈ వ్యవహారం బయటి ప్రాంతానికి తెలిసింది. దీంతో పోలీసులు, అధికారులు ఇక్కడికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. అతి తక్కువ మంది మాత్రమే వారికి కనిపించారు. అప్పటికే వాళ్లంతా ఉపవాసం చేసి, ఆరోగ్యం క్షీణించి, చావుబతుకుల మధ్య ఉన్నారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. మిగిలిన వారి కోసం గాలించగా శవాలే కనిపించాయి.
అప్పటికే చాలా మంది ఉపవాసం చేసి మరణించారు. అధికారులు వారి మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. అలా అనేక చోట్ల తవ్వి చూడగా దాదాపు 200 మందికిపైగా మృతదేహాలు కనిపించాయి. ఇక్కడ ఉండే మరో 600 మంది జాడ కనిపించడం లేదు. వాళ్లు కూడా ఉపవాసం చేసి మరణించారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు కారణమైన పాస్టర్ పాల్ మెకంజీని అధికారులు అరెస్టు చేశారు. అంతమందిని ఉపవాసం చేయమని చెప్పి తను మాత్రం హాయిగా జీవిస్తున్నాడు. అమాయకులు ఇలా చనిపోయేందుకు పాస్టర్ కారణమయ్యాడు. దేవుడి పేరుతో దారుణానికి ఒడిగట్టాడు. మరోవైపు మరణించిన వారి శరీర భాగాలు కొన్ని కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పూర్తి దర్యాప్తు జరిగితే కానీ ఈ వ్యవహారంలో అసలు విషయాలు తెలియదు.