Kotha Prabhakar Reddy: కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి.. హైదరాబాద్ ఆస్పత్రికి తరలింపు..!
ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రభాకర్ రెడ్డిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రభాకర్ రెడ్డి కడుపులో తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. గాయపడిన ప్రభాకర్ రెడ్డిని భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Kotha Prabhakar Reddy: బీఆర్ఎస్ పార్టీకి చెందిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రభాకర్ రెడ్డిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రభాకర్ రెడ్డి కడుపులో తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. గాయపడిన ప్రభాకర్ రెడ్డిని భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గత ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి.. ప్రస్తుతం దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
ఇప్పటికే బీఫామ్ అందుకున్న ఆయన.. ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఓ పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దుండగుడు దాడిచేశాడు. కార్యకర్త ముసుగులో ఓ వ్యక్తి ప్రభాకర్ రెడ్డికి అతి సమీపంలోకి వచ్చి కరచాలనం చేస్తున్నట్లుగా నటించాడు. వెంటనే జేబులో నుంచి కత్తి తీసి.. ఎంపీ కడుపులో పొడిచాడు. దాడి చేసిన వ్యక్తిని బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకొని చితకబాదారు. నిందితుడిని దుబ్బాక నియోజకవర్గం, చిట్యాల గ్రామానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే కొత్త ప్రభాకర్ రెడ్డిని.. గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు. దీంతో ఆయనను సిబ్బంది హైదరాబాద్ తరలించారు. రాజు ఎవరు..? ఎందుకు దాడి చేశాడు..? అనే విషయాల్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.