Tirumala: చిన్నారిని చంపిన చిరుత.. తిరుమల నడకదారిలో భక్తులకు భద్రత లేదా? టీటీడీ ముందు అతిపెద్ద సవాల్

ఈ మధ్య కాలంలో తిరుమలలో భక్తులను చిరుత పులులు భయపెడుతున్నాయి. ఓ బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపడిన ఘటన మరవకముందే... నడకమార్గంలో వెళ్తున్న ఆరేళ్ల పాప చిరుత పంజాకు బలైపోయింది. స్వామి దర్శనానికి వెళ్తూ వణ్యప్రాణులకు భక్తులు బలైపోవడం తిరుమల చరిత్రలోనే తొలిసారి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 12, 2023 | 12:21 PMLast Updated on: Aug 12, 2023 | 12:21 PM

Leopard Killed Girl In Alipiri Tirumala Path Way Ttd Officials Alerts The Devotees

దట్టమైన అడవులు..కొండల్లో కచ్చితంగా వణ్యప్రాణులుంటాయి. అవే వాటి ఆవాసాలు. ప్రకృతి వాటిని అక్కడే ఉండమని నిర్దేశించింది. వణ్యప్రాణులు ఉన్న ప్రాంతాల్లోకి మానవులు వెళ్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఏ జంతువు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో ఎవరూ ఊహించలేరు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు అనేక మార్గాల్లో కొండపైకి వెళ్తూ ఉంటారు. అందులో అలిపిరి నడక మార్గం ఒకటి. తిరుపతి నుంచి తిరుమల వరకు దట్టమైన అడవుల్లో నుంచి నడకమార్గం ఉంటుంది. చిరుత పులులు ,ఎలుగుబంటులు సహా అనేక వణ్య ప్రాణాలు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో భక్తులను చిరుత పులులు భయపెడుతున్నాయి. ఓ బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపడిన ఘటన మరవకముందే… నడకమార్గంలో వెళ్తున్న ఆరేళ్ల పాప చిరుత పంజాకు బలైపోయింది. స్వామి దర్శనానికి వెళ్తూ వణ్యప్రాణులకు భక్తులు బలైపోవడం తిరుమల చరిత్రలోనే తొలిసారి.

నడకమార్గం ఇక ఏమాత్రం సేఫ్ కాదా ?

వరుస ఘటనలు నడకదారిన తిరుమల వెళ్లే భక్తులను భయపెడుతున్నాయి. కొండపైకి చేరి స్వామి దర్శనం చేసుకునే లోపు ఎప్పుడు ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కొండెక్కే భక్తులు చిన్న అలజడికి కూడా భయపడుతున్నారు. గుంపులు గుంపులుగా వెళ్లినా…ఒక్కోసారి ముందు వెనుక నడవడం సహజం. ఇలాంటి సమయాల్లో ఎక్కడో మాటువేసి ఉండే జంతువులు చిన్నారులను లాక్కెళ్లిపోతున్నాయి. భక్తులు, కుటుంబ సభ్యులు తెలుసుకుని అలర్ట్ అయ్యేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. భక్తులు ఎంత అప్రమత్తంగా ఉన్నా..టీటీడీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. వణ్యప్రాణుల దాడులను నివారించలేకపోతున్నారు. దీంతో నడకమార్గంలో వెళ్లడం ఇక ఏమాత్రం సురక్షితం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది

టీటీడీ ముందు అతిపెద్ద సవాల్

కేవలం కొన్ని క్షణాల పాటు శ్రీవారిని కళ్లారా వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. గంటలు, రోజుల తరబడి క్యూలైన్లలో వేచిఉన్నా.. ఒక్కసారి స్వామి దర్శనం అయితే దేవదేవుడి కటాక్షం లభించిందంటూ భక్తులు పొంగిపోతారు. అలాంటి భక్తులకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించడం తిరుమల తిరుపతి దేవస్థానం కనీస బాధ్యత. భక్తులు ఏమార్గాన్ని ఎంచుకున్నా… కొండ ఎక్కి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే వరకు భక్తులకు భద్రత విషయంలో కనీస భరోసా కల్పించాలి. తిరుమల నడకమార్గం కొత్తగా నిర్మించిందేమీ కాదు.. రామానుచార్యుల కాలం నుంచి ఈ మార్గంలో భక్తులు కొండపైకి వెళ్తున్నారు. కాలంతో పాటు మార్పులు చేర్పులు చేసి సౌకర్యాలను పెంచారు. అయితే భక్తుల సంఖ్యతో పాటు వణ్యప్రాణులు కూడా పెరిగాయి. అందుకు తగ్గట్టు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది

ఛైర్మన్‌గా కరుణాకర్‌రెడ్డి ఏం చేయబోతున్నారు ?

టీటీడీ ఛైర్మన్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి తక్షణం ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి. నడక మార్గానికి ఇరువైపులా కంచెను ఏర్పాటు చేస్తామని గతంలో వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. అయితే అది ప్రాక్టికల్ గా సాధ్యపడే అవకాశాలు లేవు. తిరుమల శేషాచలం కొండల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా… కేంద్ర అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. పైగా దట్టమైన అటవీ మార్గంలో పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం అంత సులభంగా అయ్యే పని కాదు. అందుకే ప్రత్యామ్నాయ ఆప్షన్లను ఆలోచించాలి

రాత్రిపూట నిషేధం విధిస్తే ?

తిరుమల నడకదారిలో వెళ్లే భక్తులపై ప్రస్తుతం ఎలాంటి నిషేధం లేదు. రాత్రి పగలు ఎప్పుడైనా భక్తులు కొండెక్కొచ్చు. అయితే వణ్య ప్రాణుల సంచారం మొత్తం ఎక్కువగా రాత్రి వేళల్లోనే ఉంటుంది. ఎంత గుంపులుగా తిరిగినా.. రాత్రి సమయాల్లో దట్టమైన అడవి మార్గంలో వెళ్లడం ఏమాత్రం సేఫ్ కాదు.. నడకదారి ప్రయాణాన్ని రాత్రి పూట నిషేధిస్తే వణ్యప్రాణుల భయం తప్పుతుందని కొంతమంది భక్తులు చెబుతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నడకమార్గాన్ని మూసివేస్తే దాడి ఘటనల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అయితే టీడీపీతో పాటు భక్తులందరూ ఈ విషయంలో సానుకూలంగా ఉంటారా లేదా అన్నది కూడా ప్రశ్నే. సుదూర ప్రాంతాల నుంచి వేళకాని వేళల్లో తిరుపతి చేరుకునే భక్తులు.. ఎక్కువగా రాత్రి సమయాల్లో కాలినడకన కొండపైకి యాత్ర మొదలుపెడతారు. ఆ టైమ్‌లో వేరే మార్గాల ద్వారా భక్తులను అనుమతించి.. నడకదారిని మూసేసే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. నడకదారిని మూసే అవకాశం లేనప్పుడు ఆ మార్గంలో అటవీశాఖతో కలిసి టీటీడీ గస్తీని ముమ్మరం చేయాలి. భక్తులకు భద్రతా టీమ్స్‌ను ఏర్పాటు చేయాలి.

శబరిమల వెళ్లే దారిలో ఏం జరుగుతుంది?

అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి వెళ్లే స్వాములు దట్టమైన అటవీమార్గంలో కాలినడకన ప్రయాణిస్తారు. పెద్దపాదం అనే మార్గంలో ఏనుగులతో పాటు అనేక వణ్యప్రాణులు ఉంటాయి. ఈ మార్గంలో అన్ని రోజులు భక్తులను అనుమతించరు. గతంలో అయ్యప్ప భక్తులను ఏనుగులు చంపేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే అటవీశాఖ అనుమతి ఇస్తేనే ఈ మార్గంలో భక్తులను అనుమతిస్తారు. ఎక్కడైనా వణ్యప్రాణుల కదలిక ఉందని అటవీశాఖ భావిస్తే..ఆ మార్గంలో ఎవరూ రాకుండా ముందే అలర్ట్ చేస్తుంది. ఈ తరహా చర్యలు కొన్ని చేపడితే తిరుమల నడకమార్గం కూడా భక్తులకు సేఫ్ గా మారుతుంది. ఆ మేరకు టీటీడీ దృష్టి సారించాలి.