You Tube Delivery: యూట్యూబ్ చూసి ప్రసవం చేసిన భర్త.. చివరకు ఏమైందంటే..?
యూట్యూబ్ చూసి తన భార్యకు ప్రసవం చేయాలని భావించిన భర్త ప్రయత్నం బెడిసికొట్టింది.

Madesh delivered his wife Lokanayaki after watching YouTube in Tamil Nadu
ఈ కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అందులోనూ సోషల్ మీడియా ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంది. దీంతోనే అనేక నేరాలు నేటి సమాజంలో ఎక్కువ అయ్యాయి. మరీ ముఖ్యంగా సైబర్ నేరాలు, లైంగిక వేధింపులకు అయితే హద్దూ అదుపూ లేదు. ఏ కొద్దిగా ఏమరపాటుగా ఉన్నామా అంతే సంగతులు. తాజాగా ఈ సంఘటన కూడా సోషల్ మీడియాకు సంబంధించినదే. యూట్యూబ్ చూసి భర్త తన భార్యకు కాన్సు చేసే క్రమంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి ఆమె కనుమూసింది. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది.
ఇతని పేరు మాదేశ్, 2021లో పోచంపల్లి సమీపంలోని పుటియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకిని వివాహం చేసుకున్నాడు. ఇతను సేంద్రీయ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అందుకేనేమో బహుశా తన భార్యకు కూడా సేంద్రీయ పద్దతిలో ప్రసవం చేయాలనుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది ఎన్ని సార్లు సర్వేకి వచ్చి తన తన భార్యకు వైద్య చికిత్స, వ్యాక్సిన్లు అందిస్తామన్నా ససేమిరా అన్నాడు. ఎలాంటి మెడికల్ సేవలు అవసరం లేకుండా ఇంటి వైద్యంతోనే తన భార్యకు కాన్పు అయ్యేలా చేశాడు.
ప్రసవానికి దగ్గర పడుతున్న సమయంలో నిండు గర్భిణికి పౌష్టిక ఆహారం తోపాటూ అవసరమైన వైద్య చికిత్సను అందించడంలో నిర్లక్ష్యం వహించాడు. ఆమెకు రోజూ గింజలు, ఆకుకూరలతో కడుపునింపేవాడు. ఇలా జీవనం సాగిస్తున్న సమయంలో ఆగస్టు 22న భార్య లోకనాయకి తీవ్రమైన పురిటినొప్పులకు గురైంది. ఆమె ప్రసవవేదనను అర్థం చేసుకొని ఆసుపత్రిలో చేర్పించకుందా తానే స్వయంగా వైద్యం చేయాలనుకున్నాడు. అందుకు యూట్యూబ్ లో బిడ్డకు ఎలా జన్మనివ్వాలనే వీడియోను చూస్తూ కాన్పు చేశాడు. మగబిడ్డను జన్మనిచ్చి భార్య అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎంత పిలిచినా స్పందించని కారణంగా దగ్గరలోని కున్నియార్ ఆసుపత్రికి తీసుకెళ్ళే మార్గమధ్యమంలో తుదిశ్వాస విడిచింది లోకనాయకి.
ఈవిషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన పోలీసులు మాదేశ్ పై కేసు నమోదు చేశారు. తన భార్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోచంపల్లి ఆసుపత్రికి తరలించారు. సామాజిక మాధ్యమాలను ఎంతవరకూ వాడుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. దొరికిందికదా అని ఇష్టం వచ్చినట్లు ప్రయోగాలు చేస్తే ఇలా జీవితాలు చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉందని ఇదొక గణపాఠంగా భావించాలి.
T.V.SRIKAR