Manipur violence: మణిపూర్ హింస.. వాళ్లంతా ఏమైపోయారు..? ఆ అమ్మాయి ఏమైంది..?
మణిపూర్ హింసలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు మహిళలపై అత్యాచారాలు కూడా జరిగాయి. అలాగే మూడు నెలల్లో 30 మంది కనిపించకుండా పోవడం మరో ఎత్తు. అసలు వాళ్లంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలీదు
Manipur violence: మణిపూర్ హింసాత్మక ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అత్యాచార ఘటనలే కాదు.. ఇప్పుడు కొందరు పౌరుల మిస్సింగ్ వ్యవహారం కూడా సంచలనం కలిగిస్తోంది. గత మేలో హింస మొదలైన తర్వాతా నుంచి ఇప్పటివరకు దాదాపు 30 మంది కనిపించడం లేదని ఫిర్యాదులు నమోదయ్యాయి. భారీ స్థాయిలో ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఒక విద్యార్థిని కూడా కనిపించకుండా పోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
మణిపూర్ హింసలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు మహిళలపై అత్యాచారాలు కూడా జరిగాయి. ఇక దోపిడీలు, ఇండ్ల దహనాలు, ధ్వంసం వంటివి మరీ ఎక్కువ. ఇవన్నీ ఒక ఎత్తైతే.. మూడు నెలల్లో 30 మంది కనిపించకుండా పోవడం మరో ఎత్తు. అసలు వాళ్లంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలీదు. వీటిపై దాదాపు 6,000 వరకు జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అల్లర్లు ప్రారంభమైన మూడు రోజుల తర్వాత సమరేంద్ర సింగ్ అనే జర్నలిస్టు, అతడి స్నేహితుడు కూడా కనిపించడం లేదని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికేదైనా అయ్యుంటే.. మృతదేహాలను.. కనీసం డీఎన్ఏ శాంపిల్స్ ఇచ్చినా అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వేదనతో చెబుతున్నారు.
యువతి మాయం.. ఫోన్లు స్విచ్ఛాఫ్
పదిహేడేళ్ల హిజామ్ లువాంబి అనే యువతి కూడా అల్లర్ల ప్రారంభమైన కొద్ది రోజుల నుంచి కనిపించకుండా పోయింది. కొద్ది రోజుల క్రితం పరిస్థితులు మెరుగయ్యాయని భావించిన లువాంబి.. తన స్నేహితుడితో కలిసి నీట్ క్లాసెస్‌కు వెళ్లింది. అప్పటినుంచి ఆమె తిరిగిరాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆమె ఫోన్, స్నేహితుడి ఫోన్ ఎక్కడ స్విచ్ఛాఫ్ అయ్యిందో మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వారిద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యే ప్రాంతాల మధ్య దూరం 18 కిలోమీటర్లు. పైగా అవి వేర్వేరు జిల్లాలు. ఒకేచోట తరగతులకు వెళ్లిన వారి ఫోన్లు వేర్వేరు చోట్ల ఎలా స్విచ్ఛాఫ్ అయ్యాయి..? ఏం జరిగి ఉంటుంది..? అనేది మాత్రం పోలీసులు తేల్చలేకపోయారు. లువాంబి మిస్సైన రోజు ఫోన్ చేస్తే.. ఆమె భయంతో మాట్లాడిందని, నంబోల్‌లోని ఖూపంలో ఉన్నట్లు చెప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సీసీ కెమెరాల్లో కూడా వాళ్లిద్దరూ ఆ ప్రదేశానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లున్న ప్రాంతం గురించి పోలీసులకు తెలిసినా.. అక్కడకు వెళ్లేందుకు భయపడ్డారని లువాంబి స్నేహితుడి తండ్రి చెప్పారు. అయితే, ఇప్పటికీ వాళ్లిద్దరూ ఏమయ్యారో పోలీసులు కనుక్కోలేకపోయారు. మరోవైపు అల్లర్లలో గాయపడి, ఆస్పత్రుల్లో కన్నుమూసిన 44 అనాథ శవాలకు ఆగష్టు 3న ఇంఫాల్‌లో సామూహిక అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.