Gaddar: 27ఏళ్ల క్రితం గద్దర్‌పై కాల్పుల వర్షం కురిపించిందెవరు? ఇప్పటివరకు దోషులను ప్రభుత్వాలు ఎందుకు పట్టుకోలేదు?
ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూయడం ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ఆయన మరణం తర్వాత మరోసారి గద్దర్ వెన్నులోని తూటాపై చర్చ మొదలైంది. ఈ కాల్పులు జరిపిందెవరన్నదానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
అది 1997, ఏప్రిల్ 6.. ఎప్పటిలాగే గద్దర నిద్రలేచి తన పని తాను చేసుకుంటున్నారు. ఇంతలోనే గుర్తుతెలియని వ్యక్తులు గద్దర్ ఇంటికి వచ్చారు. మీతో మాట్లాడాలంటూ ఇంటి బయటకు రమ్మని పిలిచారు. సరే అని గద్దర్ అలా ఇంటి బయటకు వచ్చారో లేదో.. అప్పటివరకు తమతో దాచుకున్న తుపాకీని బయటకు తీసి ఆరుసార్లు కాల్చారు. గద్దర్ ఇంటి ప్రాంగణమంతా రక్తంతో నిండిపోయింది. గద్దర్ కుప్పకూలిపోయారు. గద్దర్ చనిపోయి ఉంటారని భావించిన దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. గద్దర్‌ని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు అది కష్టం మీద ఆయన ప్రాణాలు కాపాడారు. శరీరంలోని నాలుగు బుల్లెట్లు బయటకు తీశారు కానీ.. వెన్ను దగ్గరలో ఉన్న బుల్లెట్‌ని మాత్రం తియ్యలేకపోయారు. అది తీస్తే గద్దర్ ప్రాణానికే ప్రమాదమని చెప్పారు. అప్పటి నుంచి నిన్న మరణించేవరకు గద్దర్ ఆ తుపాకీ తూటాతోనే బతికారు.
ఈ ఘటన జరిగే సమయానికే గద్దర్ విప్లవకారులకు, ప్రభుత్వ వ్యతిరేకులకు రోల్‌మోడల్. ఆయన పాటలు వింటూ ప్రభుత్వాలకు, పోలీసులకు పోరాడినవరేందరో. 1996 సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. ప్రభుత్వ సంస్థలను గాలికి వదిలేసి.. నాటి సీఎం చంద్రబాబు ప్రైవేటు జపం చేస్తున్న కాలమది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గద్దర్ యావత్ సమాజాన్ని తన పాటతో ఉత్తేజపరుస్తున్న రోజులవి. తెలంగాణ నినాదం కూడా అగ్గి రాజుకుంటున్న సమయంలో గద్దర్‌పై గుర్తుతెలియని ముఠా దాడికి పాల్పడడం వెనుక ఇప్పటికీ అనేక అనుమానాలున్నాయి. అయితే ఈ ఘటన జరిగి 27ఏళ్లు దాటినా ఇప్పటివరకు కనీసం కాల్చిందెవరో కూడా పోలీసులు తెలుసుకోకపోవడం విడ్డూరం.
గద్దర్‌పై కాల్పులు జరిపింది తామేనని గ్రీన్ టైగర్స్ అనే సంస్థ ప్రకటించుకున్నా అది ఎంతవరకు నిజమో తెలియదు.. పోని వారినైనా పట్టుకున్నారా అంటే అదీ లేదు. తనపై దాడి చేసింది గ్రేహోండ్స్ బలగాలేనని గద్దర్ అనేకసార్లు ఆరోపణలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ కేసును సీఐడీకి అప్పగించినా పురోగతి మాత్రం శూన్యం. అసలు నిందితులే దొరకలేదంటూ కేసును క్లోజ్ కూడా చేయడం ఇప్పటికీ అనేక అనుమానాలున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు సీఎంలు మారారు. వారిలో వైఎస్ ఈ కేసు దర్యాప్తు చేయాలని ఆదేశించారు.. ఆ తర్వాత ఆయన కూడా మరణించారు. ఆ తర్వాత వచ్చిన రోశయ్యా, కిరణ్‌కుమార్ రెడ్డికి కూడా గద్దర్ ఈ కేసు సంగతి తేల్చాలని పలుమార్లు వినతిపత్రం ఇచ్చారు. అయినా కేసు ముందుకు కదలలేదు. ఇటు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ కేసు ఒక్క అడుగు కూడా ముందుకు కదలకపోవడమేంటో అర్థంకాని దుస్థితి.