Missile Technology: మిస్సైల్ టెక్నాలజీ@595 రూపాయలు
అమెరికాకు చెందిన ఓ కీలక మిస్సైల్ టెక్నాలజీ (Missile Technology)ని రష్యా (Russia) దాదాపు 6వందల రూపాయలకే సంపాదించింది.
ఏంటి హెడ్డర్ తప్పుపడింది అనుకుంటున్నారా… ? వేల కోట్లలో ఉండాల్సింది పొరపాటున వందల్లో అని రాశారనుకుంటున్నారా…కానే కాదు నిజంగానే అమెరికాకు చెందిన ఓ కీలక మిస్సైల్ టెక్నాలజీ (Missile Technology)ని రష్యా (Russia) దాదాపు 6వందల రూపాయలకే సంపాదించింది. నిజంగా ఆరువందలే… ఇంకా చెప్పాలంటే ఇంకో ఐదు రూపాయలు తక్కువే… అంత తక్కువకు క్షిపణిని సంపాదించడం అసాధ్యమే.. కానీ అది రష్యా కేజీబి (KGB) చేసిన మ్యాజిక్… యాక్సిడెంటల్ గా రష్యాకు చేరిన ఈ టెక్నాలజీ రష్యా మిస్సైల్ చరిత్రనే తిరగ రాసింది.
గత కొన్ని రోజులుగా తన గగనతలంలో కనిపిస్తున్న వింత వస్తువులను అమెరికా కూల్చేస్తోంది. ఇందుకోసం తనకు ఎంతో నమ్మకమైన సైడ్ వైండర్ (Side Winder) క్షిపణిని వినియోగిస్తోంది. టార్గెట్ ఫిక్స్ అయ్యాక గురితప్పడం దానికి తెలియదు. మెలికలు తిరుగుతూ శత్రు క్షిపణులను బోల్తా కొట్టిస్తూ తన పని తాను చేసుకుపోతుంది. ఇలాంటి ప్రత్యేకమైన క్షిపణి రష్యా దగ్గర కూడా ఉంది. కానీ దాని పేరు వేరు.. అమెరికా 1950ల్లో ఈ ప్రత్యేకమైన మిస్సైల్ ను తయారు చేసింది. అయితే తైవాన్ (Taiwan) యుద్ధంలో వినియోగించిన సమయంలో ఓ మిస్సైల్ చైనా (China) చేతికి చేరి అక్కడ్నుంచి రష్యాకు వెళ్లింది. అయితే ఈ విషయం తెలిసిన అమెరికా ప్లాన్ మార్చింది. టెక్నాలజీ మొత్తాన్ని మార్చేసింది. కానీ ఆ టెక్నాలజీని కూడా రష్యా కన్నింగ్ గా కొట్టేసి అమెరికాకు షాక్ ఇచ్చింది.
పోలాండు (Poland)కు చెందిన జోసెఫ్ లినోస్కీ అనే వ్యక్తి రష్యా నిఘా సంస్థ కేజీబీ ఏజెంట్ గా పనిచేసేవాడు. ఇతడు మాన్ ఫ్రెడ్ రామింజర్, వూల్ఫ్ డైతార్ట్ నాపీ అనే ఇద్దర్ని కూడా రిక్రూట్ చేయించాడు. వీరు ముగ్గురు కలిసి అప్పటి పశ్చిమ జర్మనీ (West Germany)లో గూడచర్యం చేసేవారు. అప్పుడు అది అమెరికాకు మిత్రదేశం. పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఫాంటమ్ (Fantom) విమానాన్ని దొంగిలించాలని ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాదని భావించి ఏదో ఒకటి కొట్టేయాలని భావించారు.
1967అక్టోబర్ 22న వీరు ముగ్గురు కలిసి న్యూబర్గ్ ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. దొంగ ఐడీ కార్డులతో లోపలికి ఎంటరయ్యారు. ఆ సమయంలో భారీగా మంచు పడుతుండటంతో వీరిని ఎవరూ గుర్తించలేకపోయారు. డిపోలో సైడ్ వింగర్ మిస్సైల్ ను చూసి ఇది మనకు పనికి వస్తుందేమోనన్న అనుమానంతో దాన్ని కొట్టేయాలని డిసైడయ్యారు. వెంటనే ఓ చక్రాల బండిలో దాన్ని పెట్టుకుని రన్ వే చివరకు తీసుకెళ్లారు. అక్కడ ఫెన్సింగ్ కత్తిరించి తమ కారులోకి క్షిపణిని చేర్చారు. అది అందులో పట్టకపోవడంతో వెనక అద్ధం పగలగొట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా ఓ రెడ్ కార్పెట్ ను దానికి చుట్టి వెంటనే అక్కడ్నుంచి మాయమయ్యారు. న్యూబర్గ్ కు 200కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రెఫెల్డ్ కు చేరుకున్నారు. వెంటనే దాన్ని విడదీసి ఎయిర్ మెయిల్ లో దాన్ని రష్యాకు కొరియర్ చేశారు. అందుకు అయిన ఖర్చు 79 డాలర్లు… అప్పటి మన కరెన్సీలో చెప్పాలంటే అది 6వందల కంటే తక్కువ. అవి మెషిన్ విడిభాగాలని నమ్మించాడు. ఆ వెంటనే రామింజర్ రష్యా బయలుదేరిపోయాడు.
అయితే అంతా సజావుగా సాగితే ట్విస్ట్ ఏముంది. ఆ మెయిల్ వెళ్లినట్లే వెళ్లి తిరిగి పశ్చిమ జర్మనీకే చేరింది. అడ్రస్ తప్పు అంటూ వెనక్కు వచ్చింది. అప్పటికీ అమెరికా తమ క్షిపణి ఏమయ్యిందన్నది పసిగట్టలేకపోయింది. విషయం తెలుసుకున్న రామింజర్ తిరిగి పశ్చిమ జర్మనీకి తిరిగివచ్చి మళ్లీ దాన్ని రష్యాకు పంపాడు. అలా చేరిన ఆ క్షిపణిని రివర్స్ ఇంజనీరింగ్ తో రష్యా వేరే పేరుతో తయారు చేసింది. ఆ తర్వాత రామింజర్ పశ్చిమజర్మనీ అధికారులకు చిక్కడంతో నాలుగేళ్ల శిక్ష విధించారు.
అలా కేవలం 79 డాలర్లు ఖర్చు పెట్టి వేలకోట్లు విలువ చేసే మిస్సైల్ ను రష్యా సంపాదించింది. విలువ తెలియకపోయినా పనికి వస్తుందేమోనన్న ముగ్గురు ఏజెంట్ల అనుమానం రష్యాకు వేలు కాదు కాదు లక్షల కోట్ల విలువ చేసే మిస్సైల్ టెక్నాలజీని సంపాదించిపెట్టింది.
(KK)