Narendra Modi: మోదీజీ బేటీ బచావో అంటే ఇదేనా..వాళ్ల ఆక్రందన కూడా వినండి
బేటీ పడావో బేటీ బచావో అని ప్రధానమంత్రితో పాటు ఆయన సహచర నేతలు నినదించినప్పుడు ఈ దేశం మొత్తం ఉప్పొంగిపోయింది. ఆడపిల్లల రక్షణ విషయంలో, వాళ్ల భవిష్యత్తు విషయంలో బీజేపీ ప్రభుత్వానికి ఎంత కమిట్‌మెంట్ ఉందో అంటూ కీర్తించింది. కానీ మోదీ సహా బీజేపీ పరివారం మొత్తం బేటీ బచావో బేటీ పడావో అంటూ పైకి మాటలు చెబుతున్నారు తప్ప.. వాళ్లకు కనీస భరోసా ఇవ్వలేకపోతున్నారన్న విషయం అర్థంకావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు కేంద్ర ప్రభుత్వం మొత్తం కొలువై ఉండే దేశ రాజధానిలో కొన్ని రోజులుగా పగలనగా, రాత్రనకా.. మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తుంటే తమకు న్యాయం చేయాలని గొంతెత్తి నినదిస్తుంటూ బేటీ బచావో అని నినదించే నేతలకు వాళ్ల ఆర్తనాదాలు వినిపించడం లేదు. కర్ణాటక ఎన్నికల్లో ఎలా గెలవాలి ఒక వేళ మెజార్టీ మార్కు రాకపోతే ఎవరికి గాలం వేయాలి.. ఇలా ఓట్ల లెక్కల్లో మునిగిపోయిన బీజేపీ అగ్రనాయకత్వానికి దేశం గర్వించే స్థాయిలో పతకాలు తెచ్చిన మహిళా క్రీడాకారుల ఆవేదన చెవికెక్కకపోవడం ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం కాక ఇంకేమవుతుంది.
లైంగిక వేధింపులు రొటీన్ వ్యవహారమా ?
మమ్మల్ని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారు. మాపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తక్షణం ఆయనపై చర్యలు తీసుకుని మాకు రక్షణ కల్పించండి అని ఎవరైనా మహిళలు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వ యంత్రాంగం ఎంత వేగంగా స్పందించాలి ? పైగా ఆరోపణలు చేసిన వాళ్లు అనామకులు కారు… ఒలంపిక్స్ లో పతకాలు సాధించి జాతీయ జెండాను ప్రపంచపటంపై గర్వంగా ఎగరెలా చేసిన మన మల్లయోధులు. పైగా వాళ్లల్లో ఓ మైనర్ కూడా ఉన్నారు. బాధిత మహిళలు ఎవరైనా సరే… ఆరోపణలు వెలుగులోకి రాగానే ఫిర్యాదు స్వీకరించడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కేసు నమోదు చేయడం, దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చడం.. ఆరోపణలు నిజమని న్యాయస్థానాలు తేలిస్తే.. సదరు కామాంధుడిని కటకటాల వెనక్కి నెట్టడం.. ఇది కదా జరగాల్సింది. ఇది కదా బేటీ బచావో అన్న దానికి సరైన అర్థం. కానీ ఇలా జరగలేదు. ఎందుకంటే సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఎంపీ కాబట్టి. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు కాబట్టి. ఆయన వెనుక చాలా మంది పెద్దమనుషులు ఉన్నారు కాబట్టి. తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి బాధిత రెజ్లర్లు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ల ఆవేదనను వినే నాథుడే లేకపోతే వాళ్లు ఇంకెవరికి చెప్పుకోవాలి.
బ్రిజ్ భూషణ్ అలియాస్ మర్డరర్
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్..లైంగిక వేధింపుల కథ మొత్తం ఈయన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే.. ఆయనకు ఎంత క్రిమినల్ హిస్టరీ ఉన్నా సరే..బ్రిజ్ భూషణపై ఈగ వాలనీయకుండా కాపాడుకుంటూ వస్తోంది బీజేపీ అధిష్టానం. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్న బ్రిజ్ భూషణ్.. మహిళా క్రీడాకారుల జీవితాలతో ఆడుకుంటున్నట్టు ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. వినేష్ పోగాట్, సాక్షి మాలిక్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఆయనపై ఆరోపణలు చేయకముందునుంచే బ్రిజ్ భూషణ్‌కు పెద్ద నేర చరిత్రనే ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఈయన గారిపై 40కి పైగా ఎఫ్ఐఆర్‌లు ఉన్నాయి. సైకిళ్లు, బైక్స్ దొంగతనం చేయడం మొదలు సివిల్ కాంట్రాక్టర్గా ఎదిగి ఆపై రాజకీయ నాయకుడి అవతారమెత్తారు బ్రిజ్ భూషణ్. ఉత్తర ప్రేదశ్‌లోని గోండా, బలరామ్ పూర్, అయోధ్య జిల్లాల్లో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్న బ్రిజ్ భూషణ్.. ఆరోసారి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులోనూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్‌కు కమలనాథులతో విడదీయరాని అనుబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే బీజేపీకి ఆయన అవసరం ఎంతుందో ఆయనకు బీజేపీతో కూడా అంత అవసరం ఉంది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలు ఉన్నట్టు గతంలో ఆరోపణలు ఉన్నాయి.
అవును మర్డర్ చేశా.. అయినా అమాయకుడిని
అవును నేను హత్య చేశానని ఏ రాజకీయ నాయుకుడైనా ఒప్పుకుంటాడా.. అంగబలం, అర్థబలం, రాజకీయ బలం పుష్కలంగా ఉన్న బ్రిజ్ భూషణ్ ఒప్పుకున్నారు. గతంలో నేను ఓ హత్య చేశాను…జనం నా గురించి ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదని ఓ ఇంటర్వ్యూలో మొహమాటం లేకుండా చెప్పిన చరిత్ర బ్రిజ్ భూషణ్‌ది. ఇంత నేర చరిత్ర ఉన్న బ్రిజ్ భూషణ్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు. ఈ విషయంలో తాను పూర్తిగా అమాయకుడినని…దీని వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు.
సుప్రీం జోక్యం చేసుకుంటేనే ఎఫ్ఐఆర్
మేరీ కోమ్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించినా ఆ కమిటీ ఇప్పటి వరకూ తేల్చిందేమీ లేదు. మేరీ కోమ్ సహా కమిటీలో ఉన్నవాళ్లంతా కమలనాథులకు జై కొట్టిన వాళ్లే. ఆ కమిటీ న్యాయమైన నివేదిక ఇస్తుందని రెజ్లర్లకు నమ్మకం లేదు. మరోవైపు ఎంపీ తీవ్రమైన లైంగిక ఆరోపణలు వెల్లువెత్తున్నా… కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కూడా ఢిల్లీ పోలీసులు ముందుకురాలేదు. అసలే అధికార పార్టీ ఎంపీ, పైగా క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉంది. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాతే ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.
పీటీ ఉషా గారూ మీకు ఇది తగునా ?
మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో అందరితో చీవాట్లు తింటున్న వ్యక్తి పీటీ ఉషా. ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా బాధితుల పక్షాన నలవాల్సిన పీటీ ఉషా… న్యాయపోరాటం చేస్తున్న రెజ్లర్ల తీరును తప్పుపట్టారు. వీధి పోరాటలు చేసి దేశం పరువు తీస్తారా అంటూ మండిపడ్డారు. సానియా మీర్జా, కపిల్ దేవ్, హర్బజన్ సింగ్ వంటి క్రీడాకారులు.. బాధితులకు అండగా ఉండి… న్యాయం జరగాలని కోరుకుంటుంటే టీపీ ఉషా మాత్రం బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడుతున్నారు.
బాధితులకు భరోసా ఇవ్వండి
ఒలంపిక్ పతకాలు సాధించి ఎంతో కీర్తిని కూడగట్టుకున్న రెజ్లర్లకు రోడ్డెక్కి ఒక పవర్‌ఫుల్ పొలిటీషియన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది ? రోజుల తరబడి నడిరోడ్లపైనే ఉంటూ ఆందోళన చేయడం ద్వారా వాళ్లు ఆశిస్తున్నది ఒక్కటే…వాస్తవాలు నిగ్గు తేల్చండి… బ్రిజ్ భూషణ్‌పై పదవి నుంచి తప్పించండి అని. ఇది ఏమాత్రం గొంతెమ్మ కోర్కె కాదు.. ఆరోపణలు అవాస్తవమైతే… బ్రిజ్ భూషణ్ ఇమేజే పెరుగుతుంది కదా.