Train Accident: రైలు ప్రమాదంపై కోహ్లీ, పవన్ సహా సెలబ్రిటీల దిగ్భ్రాంతి
ఒడిశా రైలు ప్రమాద ఘటన దేశం యావత్తు మనసు మెలివేస్తోంది. రక్తంలో కలిసిన కన్నీటి ధారలు.. కాళరాత్రిని మిగిల్చాయ్. ఈ ఘటనపై దేశం యావత్తు రియాక్ట్ అవుతోంది.

Train Accident: ఎప్పుడూ చూడని ఘోరం.. ఇంకెప్పుడూ జరగకూడని దారుణం.. ఒడిశా రైలు ప్రమాద ఘటన దేశం యావత్తు మనసు మెలివేస్తోంది. రక్తంలో కలిసిన కన్నీటి ధారలు.. కాళరాత్రిని మిగిల్చాయ్. ఈ ఘటనపై దేశం యావత్తు రియాక్ట్ అవుతోంది. 280మందికి పైగా మరణం.. కుప్పలుగా శవాలు.. తెగిపడ్డ చేతులు, కాళ్లు.. తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టేలా ఉంది అక్కడి పరిస్థితి. తమిళనాడు, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ప్రమాద ఘటనపై సమీక్ష నిర్వహించారు.
సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఇక అటు రైలు ప్రమాద ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని.. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రుల్లో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఉండే చాన్స్ ఉందని.. వాళ్లను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. రైలు ప్రమాద ఘటన తనను షాక్‌కు గురి చేసిందని.. తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఎప్పుడూ చూడని ప్రమాదమని.. ఎప్పుడూ జరగకూడని ప్రమాదం అంటూ పోస్ట్ చేశారు కేటీఆర్.
ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలోనే బాధితులంతా గుండెనిబ్బరంతో ఉండాలని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. ట్విట్టర్ వేదికగా తన సానుభూతి వ్యక్తం చేశారు. ఒడిశా ప్రమాదంపై టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు సానుభూతి తెలిపిన కోహ్లీ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.