Train Accident: కుట్రా లేదు.. కాకరకాయా లేదు..! అంతా మాయ! ట్రైన్‌ యాక్సిడెంట్ల కేసుల్లో సీబీఐ అట్టర్‌ ఫ్లాప్‌!

యాక్సిడెంట్‌ ఎలా జరిగిందో ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు. రోజుకో మాట చెప్పింది రైల్వేశాఖ..! ఇంతలోనే కుట్ర అంటూ.. బయట శక్తులో.. లోపల మనుషులో ఏదో చేశారంటూ కొత్త వాదన తెరపైకి వచ్చింది. సీబీఐ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 6, 2023 | 11:08 AMLast Updated on: Jun 06, 2023 | 11:08 AM

Odisha Train Accident Mamata Banerjee Says Cbi Probe Wont Help And Why Cbi Probe For Train Accident Is Still Question

Train Accident: ట్రైన్లు ఢీకొంటే సీబీఐ విచారణ దేనికి..? గతంలో రైళ్ల ప్రమాదాలను ఎంక్వైరీ చేసిన సీబీఐ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించిందా?
మూడు రైళ్లు ఢీకొన్నాయి. యాక్సిడెంట్‌ ఎలా జరిగిందో ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు. రోజుకో మాట చెప్పింది రైల్వేశాఖ..! ఇంతలోనే కుట్ర అంటూ.. బయట శక్తులో.. లోపల మనుషులో ఏదో చేశారంటూ కొత్త వాదన తెరపైకి వచ్చింది. సీబీఐ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఘటన జరిగిన ఒడిశా బాలాసోర్‌ రైల్వే ట్రాక్‌ ప్రాంతాన్ని పరిశీలించింది. తర్వాత ఏం జరగబోతోంది..?
చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి అవతలి వాళ్లపై నింద వేయడం.. మరొకటి మేటర్‌ని డైవర్ట్‌ చేయడం. ఈ రెండు విషయాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పీహెచ్‌డీలు చేశాయి. దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైళ్ల ప్రమాద ఘటన తర్వాత బీజేపీ ఇదే ఫార్ములాను ఉపయోగిస్తోంది. ట్రైన్లు ఢీకొనడంలో కుట్ర కోణం దాగుందని సోషల్‌ మీడియాలో బీజేపీ ఐటీ వింగ్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కొందమంది పనిలో పనిగా ప్రతిపక్షాలను, మరికొంతమంది పాకిస్థాన్‌ను ఇందులో కలిపేశారు. టూల్‌ కిట్‌ తరహా స్క్రిప్ట్‌ అంటూ ట్వీట్లు పెడుతున్నారు. అసలు రైళ్ల ప్రయాణాల్లో భద్రత ఉందా లేదా అనే ప్రధాన విషయం సైడ్‌ ట్రాక్‌ ఐపోయింది. ఆ సమస్యను పీకి పక్కన పడేశారు. ఎవరి ఎజెండా వాళ్లు స్ప్రెడ్ చేస్తున్నారు.
అసలు సీబీఐకి ఎందుకు?
దేశంలో రైళ్ల ప్రమాదాలను అరికట్టే కవచ్‌ సిస్టమ్‌ని మోదీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని, వందేభారత్ ట్రైన్లపై భారీ నిధులు ఖర్చు పెట్టారని, ప్రయాణికుల సేఫ్టీని మాత్రం గాలికోదిలేశారని కేంద్రంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే కుట్ర కోణం వాదన బలంగా తెరపైకి వచ్చింది. మానవ తప్పిదమో, రైల్వే అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ ఈ ప్రమాదంలో కుట్ర జరిగే అవకాశం ఉందా అంటే చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఉన్నా కూడా ఆ విషయాన్ని పోలీసులు తేల్చగలరు. అటు రైల్వేశాఖ నుంచి ఇప్పటివరకు ఈ ఘటనపై ఓ క్లారిటీ లేదు. ఇంతలో సీబీఐ ప్రవేశించడం.. ప్రమాదానికి కుట్రే కారణమని ప్రచారం జరుగుతుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు రైళ్ల ప్రమాద కేసుల్లో సీబీఐ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గతాన్ని గుర్తు చేస్తున్నారు. సీబీఐ దర్యాప్తు వల్ల ఎలాంటి ఫలితం ఉండదని అభిప్రాయపడ్డారు. 2010లో తాను కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో 148 మంది మృతి చెందిన అనుభవాన్ని మమత గుర్తు చేసుకున్నారు. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్ కేసును 13 ఏళ్ల క్రితం సీబీఐకి ఇచ్చానని.. కానీ ఫలితం లేకపోయిందన్నారు మమత. సైంథియా యాక్సిడెంట్ కేసును కూడా సీబీఐకి అప్పగించానని.. అక్కడ కూడా ఫలితం లేదన్నారు. క్రిమినల్ కేసులను సీబీఐ విచారిస్తుంది. కానీ ఇది యాక్సిడెంట్ కేసు కదా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు దీదీ. అటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా ఇదే విషయాన్ని పాయింట్ అవుట్ చేస్తోంది. అసలు తప్పు ఎక్కడ జరిగిందో ప్రాథమిక అంచనా కూడా వేయలేని స్థితిలో రైల్వేశాఖ ఉందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.