Cyber Crime: పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో సైబర్ మోసాలు.. అలెర్ట్ కాకుంటే అకౌంట్ మొత్తం ఖాళీ..!!

ఒకటి రెండు గంటలు పార్ట్ టైమ్ జాబ్ చేయండి.. ఈజీగా మనీ సంపాదించవచ్చని టెంప్ట్ చేస్తున్నారు. దీంతో చాలా మంది వాళ్ల మాయలో పడిపోయి వాళ్లు చెప్పినట్టు చేస్తున్నారు. మొదట్లో వాళ్లు పంపిన లింక్స్ ను క్లిక్ చేయమనో, షేర్ చేయమనో చెప్తారు. అలా చేస్తే మన అకౌంట్లో నగదు జమ చేస్తారు. దీంతో చాలా మంది ఆశపడి అందులో కంటిన్యూ అవుతున్నారు. ఆ తర్వాతే మొదలవుతుంది అసలు కథ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 22, 2023 | 01:35 PMLast Updated on: Jul 22, 2023 | 1:35 PM

Online Part Time Job Frauds Are The New Trend In Cybercrime

ఇటీవలికాలంలో సైబర్ మోసాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. గతంలో మన అకౌంట్లను హ్యాక్ చేసి నగదు దోచేవాళ్లు విదేశీ కేటుగాళ్లు. అయితే ఇప్పుడు అలా చేయట్లేదు. నేరుగా మనతో టచ్ లోకి వస్తున్నారు. వాట్సాప్ ద్వారానో, టెలిగ్రామ్ ద్వారానో మనకు జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు. జాబ్ వద్దంటే ఒకటి రెండు గంటలు పార్ట్ టైమ్ జాబ్ చేయండి.. ఈజీగా మనీ సంపాదించవచ్చని టెంప్ట్ చేస్తున్నారు. దీంతో చాలా మంది వాళ్ల మాయలో పడిపోయి వాళ్లు చెప్పినట్టు చేస్తున్నారు. మొదట్లో వాళ్లు పంపిన లింక్స్ ను క్లిక్ చేయమనో, షేర్ చేయమనో చెప్తారు. అలా చేస్తే మన అకౌంట్లో నగదు జమ చేస్తారు. దీంతో చాలా మంది ఆశపడి అందులో కంటిన్యూ అవుతున్నారు. ఆ తర్వాతే మొదలవుతుంది అసలు కథ.

హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ఓ బాధితుడు ఇటీవల సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు ఓ కంప్లెయింట్ చేశాడు. తాను 28 లక్షలు కోల్పోయానని చెప్పాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. దీని వెనుక చైనా కేంద్రంగా నడుస్తున్న ముఠా వెలుగులోకి వచ్చింది. టెలిగ్రామ్ ద్వారా బాధితుడిని సంప్రదించిన కేటుగాళ్లు పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ చేశారు. అందుకోసం ట్రావెలింగ్ బూస్ట్ 99 డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. వెంటనే ఐదు టాస్కులు ఇచ్చారు. వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేసి వాటిని పూర్తి చేశాడు. వెంటనే 866 రూపాయల ప్రాఫిట్ వచ్చింది. ఇలా తను టాస్క్ లు పూర్తి చేసిన ప్రతిసారి తన వాలెట్ లో డబ్బు జమయ్యేది. కానీ విత్ డ్రా చేసుకునేందుకు వీలు లేదు. అలా మొత్తం 28 లక్షలు జమయ్యాయి కానీ విత్ డ్రా చేసుకోలేకపోయాడు. ఆ నగదు ఆరు అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు.

రాధికా మార్కెటింగ్ పేరుతో ఉన్న అకౌంట్లోకి మొదట డబ్బు జమయింది. దీన్ని హైదరాబాద్ కు చెందిన మహ్మద్ మున్వర్ మెయింటైన్ చేస్తున్నాడు. అక్కడి నుంచి వివిధ బ్యాంకుల్లోని అకౌంట్లకు బదిలీ అయింది. మొత్తం అకౌంట్లను అహ్మదాబాద్ కు చెందిన ప్రకాశ్ ప్రజాప్రతి మెయింటైన్ చేస్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో చైనాకు చెందిన లు ల్యో, నాన్ యే, కెవిన్ జూన్ ప్రధాన నిందితులు. ఒక్కో అకౌంట్ ఓపెన్ చేసినందుకు వీళ్లకు రెండు లక్షల రూపాయలు ఇస్తోంది చైనా ముఠా. ఇలా ప్రకాశ్ ప్రజాపతి మొత్తం 65 అకౌంట్లు ఓపెన్ చేయించి చైనా గ్యాంగ్ కు అప్పగించాడు. వీటి ద్వారా దాదాపు 125 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇతర అకౌంట్ల నుంచి మరో 584 కోట్ల నగదు బదిలీ అయింది.

ఇలా పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో ఇప్పటివరకూ దాదాపు 15వేల మంది మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరు సరాసరిన 5 లక్షల వరకూ పోగొట్టుకున్నారు. టాస్కుల పేరుతో మొదట ఊరించి.. ఆ తర్వాత మొత్తం దోచేస్తున్నారు. మధ్యలో వదిలేస్తే అమౌంట్ రాదని బెదిరిస్తారు. దీంతో అలాగే కంటిన్యూ అయి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. ఇలా మోసపోతున్నవాళ్లలో ఎక్కువ మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. ఇలా మోసం చేస్తున్న గ్యాంగులకు టెర్రరిస్టులతో కూడా సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలాంటి వాటిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.