Manipur Viral Video: అమానవీయంగా మణిపూర్ ఘటన.. నిందితులకు ఉరిశిక్ష.. సీఎం ప్రకటన..

ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగింది. మణిపూర్ హింస మొదలైన తర్వాత ఈ ఘటన జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 20, 2023 | 04:53 PMLast Updated on: Jul 20, 2023 | 4:53 PM

Outrage In India Over Manipur Womens Stripping Naked Parade Viral Video

Manipur Viral Video: హింసతో రగులుతున్న మణిపూర్‌‌కు సంబంధించి ఇప్పుడు మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగింది. మణిపూర్ హింస మొదలైన తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై దేశమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు వరకు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు వివిధ పక్షాలు, మణిపూర్ సీఎం బైరెన్ సింగ్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
దారుణ ఘటన
మే మొదటి వారం నుంచి మణిపూర్‌‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర హింస చెలరేగింది. పరస్పర దాడులు, ఇండ్లు, దుకాణాలు తగలబెట్టడం, హత్యలు వంటి ఘటనలు జరిగాయి. ఇప్పటివరకు మణిపూర్ హింసలో 140 మందికిపైగా మరణించారు. అయితే, అంతకంటే దారుణమైన ఘటన అప్పట్లో జరిగింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు అందరిముందూ నగ్నంగా చేసి, రోడ్డుపై నడిపించుకుంటూ వెళ్లారు. ఆపై అత్యాచారానికి కూడా పాల్పడ్డట్లు తెలుస్తోంది. దీన్ని అక్కడి వాళ్లు వీడియో తీయగా, తాజాగా వెలుగు చూసింది. వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అత్యాచారానికి గురైన వారిలో ఒక మహిళ టీనేజ్ సోదరుడిని కూడా నిందితులు హత్య చేసినట్లు తెలిసింది. ఈ ఘటన మే 4న తౌబాల్‌లోని నాంగ్‌పోక్ సెక్మా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని తెలుస్తోంది. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో రెండు నెలల తర్వాత వైరల్ కావడంతో ప్రభుత్వం స్పందించింది.
గుండె రగిలిపోతుంది: మోదీ
మణిపూర్‌‌లో జరిగిన ఘటన భారతీయులందరికీ సిగ్గుచేటు అని ప్రధాని మోదీ అన్నారు. నిందితులను వదిలిపెట్టబోమని, దీని గురించి తెలిసినప్పటి నుంచి తన గుండె మండుతోందన్నారు. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాంతి భద్రతలు కాపాడటంపై దృష్టి పెట్టాలని, మణిపూర్‌లోని మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఎప్పటికీ క్షమించబోమని – ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మరోవైపు ఈ ఘటనపై మణిపూర్ సీఎం బైరెన్ సింగ్ స్పందించారు. నిందితులందరినీ కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇద్దరు మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన వీడియో చూసి తన గుండె మండిపోయిందని, ఇది చాలా దారుణమైన ఘటన అన్నారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు బైరెన్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై ఇంకా విచారణ సాగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుంటామన్నారు. అవసరమైతే నిందితులకు ఉరిశిక్ష వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఇలాంటి అమానవీయ ఘటనలకు మన సమాజంలో తావు లేదు అని బైరెన్ సింగ్ వ్యాఖ్యానించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దీనిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను డిలీట్ చేయాలని సోషల్ మీడియా సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.
కొనసాగుతున్న హింస
ప్రశాంతతకు నిలయమైన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌‌లో మే3 న మొదలైన హింస రెండు నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఇప్పటికీ రాష్ట్రం తీవ్రమైన హింసతో రగిలిపోతుంది.ఇక్కడి మెయిటీ, కుకీ తెగదల మధ్య వైరం మొదలైంది. గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగింది. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటూ సృష్టించిన హింసలో అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. భారీ స్థాయిలో ప్రజలు నిరాశ్రయులుగా మారారు. భారీ ఆస్తి నష్టం సంభవించింది. చివరకు భారత సైన్యం, అస్సాం రైఫిల్స్‌ కూడా రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు మోహరించి పని చేస్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంటులోనూ చర్చ జరగనుంది.