Punjab Couple: బంటీ ఔర్ బబ్లీ.. ఎనిమిది కోట్లు దోచుకున్న జంట.. ఫ్రీ కూల్ డ్రింక్ ఆఫర్‌తో పోలీసుల ఎర..! ఎలా దొరికారంటే..
ఎనిమిదిన్నర కోట్లు దోచుకున్న ఓ జంట పోలీసులు వేసిన చిన్న ఎరకు చిక్కింది. ఉచిత కూల్ డ్రింకు కోసం ఆశపడి దొరికిపోయింది. పంజాబ్‌కు చెందిన ఒక జంటను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. డాకూ హసీనా అనే పేరు కలిగిన మన్‌దీప్ కౌర్, ఆమె భర్త జస్వీందర్ సింగ్ కలిసి రూ.8.5 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు.
Punjab Couple: నేరస్థులు ఎంత తెలివిగలవాళ్లైనా ఏదో ఒక పొరపాటు చేస్తారు. ఆ పొరపాటే వాళ్లను కటకటాల వెనక్కి నెడుతుంది. ఎనిమిదిన్నర కోట్లు దోచుకున్న ఓ జంట పోలీసులు వేసిన చిన్న ఎరకు చిక్కింది. ఉచిత కూల్ డ్రింకు కోసం ఆశపడి దొరికిపోయింది. పంజాబ్‌కు చెందిన ఒక జంటను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. డాకూ హసీనా అనే పేరు కలిగిన మన్‌దీప్ కౌర్, ఆమె భర్త జస్వీందర్ సింగ్ కలిసి రూ.8.5 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు.
పంజాబ్‌లోని లూథియానాలో సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ అనే సంస్థ నుంచి మన్‌దీప్ జంట ఈ నెల పదో తేదీన ఈ సొమ్మును దోచుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఈ కేసు చేధించడం ఒక సవాలుగా మారింది. ఎనిమిదిన్నర కోట్లు దోచుకున్న తర్వాత మన్‌దీప్-జస్వీందర్ జంట పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. దీనికోసం నేపాల్ పారిపోవాలనుకున్నారు. అయితే, ఎలాగూ అంత సొమ్ము దోచుకున్నాం కదా.. మార్గమధ్యలో పుణ్యక్షేత్రాల్ని కూడా దర్శించుకోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే పుణ్యక్షేత్రాల వైపు వెళ్లారు. మరోవైపు పోలీసులు విచారణ వేగవంతం చేసి, వారితో కలిసి దోపిడీకి పాల్పడ్డవారిని అరెస్టు చేశారు. మొత్తం పన్నెండు మంది నిందితుల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన నిందితుల నుంచి సేకరించిన సమాచారంతో మన్‌దీప్ జంట నేపాల్ వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మార్గమధ్యలో పుణ్యక్షేత్రాల సందర్శన గురించి కూడా తెలుసుకున్నారు. హరిద్వార్, కేదార్‌నాథ్, హేమ్‌కుండ్‌సాహెబ్ వంటి క్షేత్రాలను సందర్శిస్తున్నట్లు గుర్తించి వారిని పట్టుకునేందుకు ఒక ఎర వేశారు. అదే ఉచిత కూల్ డ్రింక్స్. సాధారణంగా ఇక్కడికొచ్చే భక్తులు ముఖం, తలపై ముసుగులు ధరిస్తారు. అలాంటప్పుడు వీరిని గుర్తించడం కష్టం. వేల మంది భక్తుల్లో ముసుగుతో ఉన్న ఈ జంటను పట్టుకోవడం సాధ్యం కాదు. అందుకే ఉచిత కూల్ డ్రింక్స్ పంపిణీ మొదలుపెట్టారు. అనుకున్నట్లుగానే ఈ జంట హేమ్‌కుండ్‌సాహెబ్‌లో ఉచితంగా అందిస్తున్న పది రూపాయల కూల్ డ్రింకు కోసం వచ్చారు. అక్కడికి రాగానే కూల్ డ్రింక్ తాగేందుకు తమ ముసుగులు తీశారు. అంతే వారిని పోలీసులు గుర్తుపట్టారు.
ఆ విషయం బయటపడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. హేమ్‌కుండ్‌సాహెబ్‌లో ఈ జంట ప్రార్థనలు చేసి బయటకు వచ్చిన తర్వాత అరెస్టు చేశారు. ఈ సీక్రెట్ ఆపరేషన్‌కు పోలీసులు లెట్స్ క్యాచ్ క్వీన్ బీ అనే పేరు పెట్టారు. అంటే రాణి తేనెటీగను పట్టుకుందాం అని దీని అర్థం. పోలీసులు ప్రయోగించిన ఉచిత కూల్ డ్రింకు సత్ఫలితాన్నిచ్చింది. వేసవి కాలం కావడంతో కూల్ డ్రింకు తాగేందుకు వచ్చి మన్‌దీప్-జస్వీందర్ పోలీసులకు దొరికిపోయారు. అనంతరం వీరి నుంచి రూ.21 లక్షల నగదు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.