Question Papers: తెలంగాణలో వరుస లీకులు.. భవితకు భరోసా ఏది ?

తెలంగాణలో అసలేం జరుగుతోంది. TSPSCకి సెక్యూరిటీ లేదు. టెన్త్‌ క్వశ్చన్‌ పేపర్స్‌కు ప్రొటక్షన్‌ లేదు. అన్నీ దాటుకుని కండక్ట్‌ చేసిన కోర్ట్‌ జాబ్‌ ఎగ్జామ్స్‌లో ఆన్సర్‌ క్లిక్‌ చేసేందుకు ఆప్షన్‌ లేదు. ఉద్యోగాల నియామకంలో ప్రభుత్వానికి ఎందుకింత అలసత్వం. ఏళ్ల తరబడి ఊరగాయలా నానబెట్టిన ఉద్యోగాలకు ఒకేసారి గంపాగుత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చారు. సరే.. ఎప్పుడైతేనే నోటిఫికేషన్‌ వచ్చింది కదా అని అంతా పుస్తకాలు పట్టుకుంటే.. ఈ లీకుల వ్యవహారం విద్యార్థులు, నిరుద్యోగుల్లో ఉన్న సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తోంది. దానికి తోడు అసలు ఇది పెద్ద విషయమే కాదన్నట్టు నాయకులు ఇస్తున్న స్టేట్‌మెంట్‌లు.. ఈ ప్రభుత్వం మీద నిరుద్యోగులకు ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2023 | 01:10 PMLast Updated on: Apr 04, 2023 | 1:10 PM

Question Papers Leak In Telangana

ఒక ఉద్యోగ భర్తీకి ఎగ్జామ్‌ జరుగుతోంది అంటే.. అది కేవలం అభ్యర్థికి రాసే పరీక్ష మాత్రమే కాదు. ఓ వ్యక్తి చిరకాల కోరిక, ఏళ్ల తరబడి పడ్డ కష్టం, అతని మీదే ఆధారపడి ఉన్న కుటుంబం భవిష్యత్తు, సమాజానికి ఓ అధికారిని అందించే ప్రక్రియ. అలాంటి ఎగ్జామ్స్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత కేర్‌లెస్‌గా వ్యవహరిస్తోందని ఇప్పటికే మూడు సార్లు రుజువైంది. మొన్న TSPSC పేపర్‌ లీకయ్యింది అన్నప్పుడు.. కొందరు ఉద్యోగుల తప్పు అన్నారు. ఇవాళ టెన్త్‌ పేపర్‌ లీకయ్యింది అన్నప్పుడు.. లీకేజ్‌ కాదు మాస్‌ కాపీయింగ్‌ అంటున్నారు. కోర్ట్‌ ఉద్యోగాల భర్తీ ఎగ్జామ్స్‌లో ఆన్సర్ క్లిక్‌ చేస్తే ఎర్రర్స్‌ వస్తున్నాయి అంటే.. తప్పు మాది కాదు కంప్యూటర్స్‌ది అన్నారు. ఏటండీ.. TSPSC ఉద్యోగులు ప్రభుత్వం అండర్‌లోనే కదా పని చేయాలి.. వాళ్లు ప్రైవేట్‌ ఉద్యోగులా అంటూ ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు.

మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ప్రభుత్వమే ప్రొటెక్షన్‌ ఇవ్వాలి.. అది మీ బాధ్యత కాదా అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఆన్‌లైన్‌ పరీక్షల్లో ఎర్రర్స్‌ రాకుండా ప్రభుత్వమే కదా జాగ్రత్త వహించాలి.. ఆ సోయి మీకు లేదా అని ప్రశ్నిస్తున్నారు పరీక్ష రాసిన అభ్యర్థులు. ఏ రకంగా చూసినా తప్పును ఒకరిమీద నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప.. మరో తప్పు జరకుండా మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఉప ఎన్నికలు వస్తే ఎన్నో ఆర్భాటాలు చేసే ఈ నాయకులు, హామీల వర్షం కురిపించే ఈ మంత్రులు.. ఇప్పుడు ఏమైపోయారని తెలంగాణ నిరుద్యోగ యువత ప్రశ్నిస్తోంది.

ఏళ్ల నుంచి ఇంటికి దూరంగా ఉంటూ.. తిండికి, నిద్రకు ఓర్చుకుని చదువుకున్న తమ కష్టానికి ఫలితం ఏదని రోదిస్తోంది.. వాళ్ల ఆవేదనను ఎవరు తీరుస్తారు ? మీ పిల్లల విషయంలో ఇలాగే జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్నిస్తోంది.. వీళ్లకు ఎవరు సమాధానం చెప్తారు ? TSPSCలో తప్పు జరిగితే నాదా బాధ్యత అంటూ కేటీఆర్‌ మాట్లాడటంపై ఆయన స్థాయికి తగ్గ మాట కాదంటున్నారు నిరుద్యోగులు. TSPSC పక్క రాష్ట్రం ఆంధ్రాలో లేదు మంత్రిగారు తెలంగాణలోనే ఉందంటూ గుర్తు చేస్తున్నారు. పేపర్‌ లీకేజ్‌ కామన్‌ అని.. గతంలో ఎంసెట్‌ పేపర్‌ 40 సార్లు లీకయ్యింది తప్పేంటని ఓ నాయకుడు గతంలో ప్రశ్నించడం ఒకప్పుడు యావత్‌ రాష్ట్రాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన సరదాగా అన్నారని అనుకున్నారంతా.

కానీ ఇప్పుడు వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంది కాబట్టే లీకేజ్‌ వ్యవహారం ఆయనకు అంత సింపుల్‌గా అనిపించిందని అర్థమౌతోంది. ప్రధాని మోదీ ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్‌ మీద ఉన్న శ్రద్ధ.. తెలంగాణ యువత భవిష్యత్తు మీద ఉంటే ఇలాంటి తప్పులు జరిగేవి కావంటున్నాయి ప్రతిపక్షాలు. ప్రభుత్వం మాట దేవుడెరుగు.. ఈ లీకేజ్‌లు, మాస్‌ కాపీయింగ్‌ల నుంచి నిరుద్యోగులను దేవుడే కాపాడాలంటున్నారు.