Kerala Love Breakup: ప్రియురాలు రాసిన క్రైమ్ స్టోరీ.. బ్రేకప్ చెప్పలేదని ప్రియుడి కిడ్నాప్!
కేరళ, వర్కాలలోని చెరున్నియూర్‌కు చెందిన లక్ష్మీప్రియ.. అయిరూర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ కొంతకాలం ప్రేమలో మునిగితేలారు. అయితే, ఏమైందో తెలీదు కానీ, లక్ష్మీ ప్రియ ఈ మధ్య మరో వ్యక్తిని ప్రేమించింది.

Kerala Love Breakup: ప్రేమకథలన్నీ రొమాంటిక్‌గా ఉండవు. కొన్ని క్రైమ్ స్టోరీలుగా కూడా మారుతుంటాయి. ఇప్పుడు తెలుసుకోబోయేది అలాంటి ఒక క్రైమ్ లవ్ స్టోరీ గురించే. ఇందులో ప్రియురాలే దోషి. బాధితుడు ప్రియుడు. తనకు బ్రేకప్ చెప్పలేదని ఏకంగా లవర్‌నే కిడ్నాప్ చేయించిందో ప్రియురాలు. ఈ ఘటన ఇటీవల కేరళలో జరిగింది.
కేరళ, వర్కాలలోని చెరున్నియూర్‌కు చెందిన లక్ష్మీప్రియ.. అయిరూర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ కొంతకాలం ప్రేమలో మునిగితేలారు. అయితే, ఏమైందో తెలీదు కానీ, లక్ష్మీ ప్రియ ఈ మధ్య మరో వ్యక్తిని ప్రేమించింది. అప్పటికే మొదటి లవర్‌కు దూరంగా ఉంటున్న లక్ష్మీప్రియ, అతడికి బ్రేకప్ చెప్పాలనుకుంది. దీనికి అతడు అంగీకరించలేదు. అంతే అతడితో ఎలాగైనా బ్రేకప్ చెప్పించాలని, ఇకపై తనకు దూరంగా ఉండేలా చేయాలని నిర్ణయించుకుంది. దీనికోసం ఒక గ్యాంగునే ఏర్పాటు చేసుకుంది. ఈ నెల 5న తన రెండో ప్రియుడితోపాటు, ఆ గ్యాంగుతో కలిసి మొదటి లవర్‌ను కిడ్నాప్ చేసింది. లక్ష్మీప్రియ, ఆమె రెండో ప్రియుడు, గ్యాంగ్ అంతా కలిసి ఆ యువకుడి ఇంటికి వెళ్లారు. అతడిని బయటకు రప్పించి, కారులో ఎక్కించుకున్నారు.
అతడ్ని కారులో అలప్పి తీసుకెళ్లారు. అక్కడి రహస్య ప్రదేశంలోకి వెళ్లగానే, అతడిని బెదిరించారు. అతడి దగ్గరున్న చైన్, మొబైల్, రూ.5,000 లాక్కున్నారు. అంతేకాదు.. రూ.3,500 గూగుల్ పే చేయమని కూడా అడిగారు. ఆ అమ్మాయిని మర్చిపొమ్మని బెదిరించారు. అతడిపై దాడి చేసి కొట్టారు. అక్కడ్నుంచి ఎర్నాకులం సమీపంలోని ఒక ఇంటికి తీసుకెళ్లి మొబైల్ చార్జర్ ద్వారా కరెంట్ షాక్ ఇచ్చారు. తర్వాత అతడికి బీర్ తాగమని ఇచ్చారు. దీన్ని తాగేందుకు అతడు నిరాకరించడంతో బాటిల్‌తో తలపై కొట్టి, దాడి చేశారు. తర్వాత అతడి బట్టలూడదీసి, నగ్న ఫొటోలు తీసుకున్నారు. లక్ష్మీప్రియకు ఇకపై దూరంగా ఉండాలని, లేకపోతే అతడి నగ్న ఫొటోలు బయటపెడతామని బెదిరించారు.
అప్పటికే వాళ్ల దాడిలో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరుసటి రోజు అతడిని విట్టిలా సమీపంలోని బస్ స్టాప్ దగ్గర ఒక రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. రోడ్డు పక్కన పడున్న అతడిని స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నిందితుల కోసం వేట ప్రారంభించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా లక్ష్మీప్రియ తిరునంతపురంలో దాక్కున్నట్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రెండో లవర్, మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.