Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు.. కీలక నిందితుల అరెస్టు..
ఘటన జరిగిన తర్వాత నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు. నిందితుడు ధరించిన టోపీ ఆధారంగా అతడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు ధరించిన టోపీ ఎక్కడ కొనుగోలు చేశాడు.. వంటి అంశాల ఆధారంగా అతడి వివరాలు కనుక్కున్నారు.

Rameshwaram Cafe Blast: బెంగళూరులో సంచలనం సృష్టించిన రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుడిన ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అదుపులోకి తీసుకుంది. కేఫ్‌లో బాంబ్ అమర్చిన ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దాక్కున్న అతడిని చాకచక్యంగా పట్టుకున్నారు. గత మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగింది. కేఫ్‌లో టిఫిన్ తినడానికి వచ్చిన నిందితుడు.. అక్కడ పేలుడు పదార్థాలైన ఐఈడీ ఉన్న బ్యాగును వదిలిపెట్టి వెళ్లాడు.
ఆ తర్వాత కొద్ది సేపటికే కేఫ్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. కేఫ్ చాలా వరకు ధ్వంసమైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఘటనలో తీవ్రవాద కోణం ఉండటంతో కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. కేఫ్‌లో బ్యాగు వదిలి వెళ్లిన సమయంలో నిందితుడు.. తనను ఎవరూ గుర్తించకుండా టోపీ, మాస్క్ ధరించాడు. దీంతో అతడిని గుర్తించడం కష్టమైంది. ఘటన జరిగిన తర్వాత నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు. నిందితుడు ధరించిన టోపీ ఆధారంగా అతడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు ధరించిన టోపీ ఎక్కడ కొనుగోలు చేశాడు.. వంటి అంశాల ఆధారంగా అతడి వివరాలు కనుక్కున్నారు. దీనికోసం వందలకొద్దీ సీసీ కెమెరా దృశ్యాల్ని పరిశీలించారు. అనంతరం మార్చి 29న NIA ఈ నిందితుడి వివరాలు, ఫొటోలు విడుదల చేసింది. ఆ నిందితుడి గురించి సమాచారం అందిస్తే రూ.10 లక్షల నజరానా ఇస్తామని ప్రకటించింది.
వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపిన ఎన్‌ఐఏ.. తాజాగా అతడిని కోల్‌కతాలో అరెస్టు చేసింది. బాంబు పెట్టిన ప్రధాన నిందితుడైన ముసావిర్ హుస్సేన్.. తన పేరు మార్చుకుని నకిలీ ఐడీలతో తిరుగుతున్నాడని, తాను హిందువుగా చెప్పుకుంటున్నాడని ఎన్‌ఐఏ తెలిపింది. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను కూడా ఎన్ఐఏ అరెస్టు చేసింది. పేలుడు తర్వాత వీళ్లు.. అస్సాం, పశ్చిమ్ బెంగాల్‌లో తలదాచుకున్నట్లు గుర్తించారు.