Rasheedha: నిత్య పెళ్ళి కూతురా.. ఎక్కడున్నావ్..? ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్న ఖిలేడి కోసం వెతుకుతున్న పోలీసులు

ఇటీవలి కాలంలో చాలా మంది మహిళలు పెళ్లి, ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు. తాజాగా రషీద అనే ఒక మహిళ ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. ఆమె మోసం బయటపడటంతో, పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కోసం వెతుకుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 12, 2023 | 11:42 AMLast Updated on: Jul 12, 2023 | 11:42 AM

Rasheedha Cheating Men In The Name Of Marriage

Rasheedha: పవిత్రమైన పెళ్లిన ఆర్థిక అవసరాల కోసం వాడుకుంటూ కొందరు మోసం చేస్తున్నారు. డబ్బుల కోసం వివాహాలు చేసుకుని, మోసం చేసే విషయంలో మగవాళ్లే ముందున్నారనుకుంటే పొరపాటే. ఇటీవలి కాలంలో చాలా మంది మహిళలు పెళ్లి, ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు. తాజాగా రషీద అనే ఒక మహిళ ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. ఆమె మోసం బయటపడటంతో, పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కోసం వెతుకుతున్నారు.
సోషల్ మీడియాతో వలపు వల
రషీద స్వస్థలం తమిళనాడు, నీలగిరి జిల్లా గూడలూర్‌. డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వీలు చూసుకుని అతడి దగ్గరి నుంచి డబ్బు, నగలు కాజేసి వెళ్లిపోవడం రషీద చేసే పని. ఇదంత రషీద ఒక ప్లాన్ ప్రకారం చేస్తుంది. మగవారిని ఆకర్షించేందుకు సోషల్ మీడియాను వాడుకుంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వ్యక్తులతో పరిచయం పెంచుకుంటుంది. ఎప్పుడూ పేర్లు మార్చుకుని, నకిలీ ఖాతాలతో దగ్గరవుతుంది. చూడగానే అందంగా కనిపించే రూపం కావడంతో చాలా మంది రషీదకు సులభంగా అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో వారిని కొంత కాలం మాయమాటలతో నమ్మించి, ప్రేమిస్తున్నట్లు చెప్పి, పెళ్లి చేసుకుంటుంది. అలా యువకులతో పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుని వారి ఇంటికి అడుగుపెడుతుంది. అక్కడ అదను చూసి ఇంట్లోని డబ్బు, నగలతో పారిపోతుంది. అలా ఇప్పటివరకు ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. తాజాగా ఒక వ్యక్తిని పెళ్లాడి, అతడి డబ్బు, నగలు తీసుకుని పారిపోయింది. ఆమెను పెళ్లాడిన వారిలో ఒకడైన మూర్తి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టగా రషీద అసలు మోసం బయటపడింది.
తమిళనాడు, సేలం జిల్లా తారమంగళానికి చెందిన వ్యాపారవేత్త మూర్తిని రషీద ట్రాపులో పడేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని, అతడిని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. తర్వాత అతడిని గత మార్చి 30న పెళ్లి చేసుకుంది. ఇది రషీద మొదటి వివాహం. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన మూర్తికి చేదు అనుభవం ఎదురైంది. పెళ్లైన కొన్ని రోజులకే వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 4న రషీద ఇంట్లో నుంచి రూ.1.5 లక్షల నగదు, 5 తులాల బంగారు నగలు, విలువైన వస్తువులు తీసుకుని పరారైంది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులకు దిమ్మదిరిగే విషయాలు వెల్లడయ్యాయి. మూర్తిలాగే రషీద మరికొందరిని పెళ్లి చేసుకుని మోసం చేసిందని తేలింది. మొత్తం ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలా ఎనిమిది మందిని పెళ్లాడింది. అందరి దగ్గరి నుంచి డబ్బు, నగలు తీసుకెళ్లింది. ప్రస్తుతం రషీద పరారీలో ఉంది. కొద్ది రోజులుగా ఆమె కోసం గాలిస్తున్నా.. ఇంకా ఆచూకీ దొరకలేదు.