Telangana: విద్యార్థులను కొరికిన ఎలుకలు.. ఇదీ తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి..!
ఇక్కడ విద్యార్థులకు అందించే వసతులు చూస్తే సీట్ల కోసం ఎగబడతారు అన్నట్టుగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. కానీ స్పాట్‌కి వెళ్లి సిచ్యువేషన్ చూస్తే కనిపించే సీన్ మాత్రం వేరే. ఒక దగ్గర స్టాఫ్ ఉండరు. మరో దగ్గర టాయిలెట్లు ఉండవు.
Telangana: విద్యావ్యవస్థకు పెద్ద పీఠవేశామంటారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు. ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా గవర్నమెంట్ స్కూళ్లను తీర్చిదిద్దామంటారు. ఇక్కడ విద్యార్థులకు అందించే వసతులు చూస్తే సీట్ల కోసం ఎగబడతారు అన్నట్టుగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు.
కానీ స్పాట్‌కి వెళ్లి సిచ్యువేషన్ చూస్తే కనిపించే సీన్ మాత్రం వేరే. ఒక దగ్గర స్టాఫ్ ఉండరు. మరో దగ్గర టాయిలెట్లు ఉండవు. వర్షం పడిందంటే కొన్ని స్కూళ్లను బోర్డు చూసి గుర్తు పట్టాల్సిందే. ఇదీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి. ఎంత అధ్వానంగా తయారైంది అంటే.. సరైన మెయిన్‌టేనెన్స్ లేక స్కూళ్లలో ఎలుకలు పెరిగిపోయి అవి పిల్లల మీద దాడి చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా వైరాలో ఇదే ఘటన జరిగింది. ఇది ఒక్కసారి జరిగిన ఘటన కాదు. వరుసగా మూడు రోజులు విద్యార్థులు ఎలకల కాట్లకు గురయ్యారు. విషయం బయటికి వస్తే ఉద్యోగం పోతుంది అనుకున్నారు కావొచ్చు. స్కూల్ ప్రిన్సిపాల్ గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులను హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ చేయించారు. ఆ నోటా.. ఈ నోటా.. పడి ఎలాగో విషయం బయటికి వచ్చింది.
ఇప్పుడు చాలా సింపుల్‌గా మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామంటూ సంజాయిషీ చెప్పుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివేది పేద విద్యార్థులు కాబట్టి అడిగేవాళ్లు లేరన్నట్టు, సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి యాజమాన్యం పిల్లలకో, రాజకీయ నాయకుడి పిల్లలకో వస్తే ఇలాగే సమాధానం చెప్తారా అంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.